Share News

నేటి నుంచి మూసీ రెండో విడత నీటి విడుదల

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:14 AM

మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వ ఆయకట్టుకు గురువారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు డ్యాం అధికారులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

నేటి నుంచి మూసీ రెండో విడత నీటి విడుదల

కేతేపల్లి, నాగార్జునసాగర్‌, సెప్టెంబరు 11: మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వ ఆయకట్టుకు గురువారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు డ్యాం అధికారులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయకట్టుకు మొదటి విడతగా గత జూలై 25 నుంచి ఆగస్టు 18 వరకు 25 రోజులు విడుదల చేయాల్సి ఉన్నా, రైతుల విజ్ఞప్తి మేరకు అదనంగా మరో 15 రోజులు నీటిని విడుదలచేశారు. రెండో విడత ఈ నెల 3వ తేదీ నుంచి నీటి విడుదల చేయాల్సి ఉండగా, వర్షాల కారణంగా దాదాపు 10 రోజులు వాయిదా వేశారు. రెండో విడత నీటిని ఈ నెల 12 నుంచి నెలాఖరు వరకు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 645 అడుగుల గరిష్ఠ నీటిమట్టం కలిగిన మూసీ ప్రాజెక్టు బుధవారం సాయంత్రానికి 643.50 అడుగులకు చేరింది. ఇదిలా ఉండగా, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువనుంచి వరద రాక క్రమంగా 68,210 క్యూసెక్కుల తగ్గడంతో ప్రాజెక్టు మొత్తం 26 గేట్లను మూసివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు) కాగా, బుధవారం సాయంత్రానికి 589.10 అడుగులుగా(310.3558టీఎంసీలు) నమోదైంది. ప్రాజెక్టు నుంచి మొత్తంగా 43,230 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:14 AM