మహిళా స్వావలంబనలో ‘స్వరభారతీ’
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:12 AM
గ్రామీణ మహిళలకు ఆర్థికభరోసాతో పాటు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు పిలుపు స్వచ్ఛంద సంస్థ చేపట్టిన కార్యాచరణ ఎంతో మంది జీవితాలను మలుపుతిప్పింది.
తుర్కపల్లి, భువనగిరి మండలాల్లో నిర్వహణ
నేడు సొసైటీ రజతోత్సవాలు
గ్రామీణ మహిళలకు ఆర్థికభరోసాతో పాటు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు పిలుపు స్వచ్ఛంద సంస్థ చేపట్టిన కార్యాచరణ ఎంతో మంది జీవితాలను మలుపుతిప్పింది. మూడు దశాబ్దాల కిందట గ్రామీణ మహిళలు ప్రతీ అవసరానికి ఇంటి యజమానులపై ఆధారపడే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వారికి ఎదురయ్యే సమస్యలను చర్చించుకోవడంతో పాటు ఆర్థికస్వేచ్ఛ కోసం నెలకొన్నదే సంస్థ పిలుపు. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్వరభారతీ మ్యాక్స్ సొసైటీ ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది. పిలుపు సంస్థ వ్యవస్థాపకులు ఎం.జనార్థన ఆలోచనలోంచి 1993లో పుట్టిన ఈ సంస్థ ఎంతోమందిని మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. నింపుతోంది.
-తుర్కపల్లి
గ్రామగ్రామాన తిరిగి పేద మహిళలను సమావేశపర్చి వారి పరిస్థితులను విశదీకరించి, పొదుపు పరపతి అవశ్యకతను తెలిపి, వారి అభీష్టంతో రూ.10తో పొదుపు పరపతి మొదలుపెట్టారు. ఏడాదిలో 250 మంది సభ్యులుగా చేరారు. ఎన్నో ఆటుపోట్లను నిష్టూరాలను ఎదుర్కొన్నారు. పిలుపు సంస్థ ఆధ్వర్యంలో 1997 ఆగస్టు నాటికి 9 గ్రామాల్లో 1,026 మంది సభ్యులతో కలిపి స్వరభారతీ పేరున అనరిజిస్టర్డ్ సొసైటీగా రూపొందింది. ఇందులో ఓ సంస్థకు ఉన్నట్లుగానే జనరల్ బాడీని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత రెండేళ్లకు 1999 మార్చిలో తొమ్మిది గ్రామాలు 1,026 మంది సభ్యులతో కూడిన మహిళా పరస్పర సహాయ సహకార పొదుపు పరపతి సంఘం లిమిటెడ్ పేరున 1995 మ్యాక్స్ చట్టం కింద స్వరభారతీ మ్యాక్స్ పేరుతో రిజిస్టర్ చేశారు.
వడ్డీ తగ్గిస్తూ.. పొదుపుపై వడ్డీ చెల్లిస్తూ
పిలుపు సంస్థకు 1999-2003 దశలో గ్రామపంచాయతీ 100 గజాల భూమిని విరాళంగా ఇవ్వగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ)ఆర్థిక సహకారంతో సొంత భవనాన్ని నిర్మించుకున్నారు. మరోపక్క ఒక్కో గ్రామానికి విస్తరిస్తూ 2023 నాటికి 17 గ్రామాలు 1,238 మంది సభ్యులకు సంస్థ చేరుకుంది. చేసుకున్న పొదుపు ద్వారా సభ్యుల అవసరాల మేరకు రుణసహాయం పొంది బతుకుదెరువులను మెరుగుపర్చుకోవడం మొదలుపెట్టారు. సభ్యులకు అందించే రుణాలపై 24శాతం వడ్డీ వసూలు చేస్తూ 12 శాతం వారి పొదుపులో జమచేస్తున్నారు. గ్రామాలన్నింటినీ మూడు క్లస్టర్లుగా ఏర్పాటుచేసి ముగ్గురు ఉద్యోగులను నియమించి సంఘాల నిర్వహణ బాధ్యలను అప్పగించారు. వారికి నిర్వహణపై శిక్షణ అందించారు. 2008లో జరిగిన మ్యాక్స్ వార్షిక సమావేశంలో అప్పులపై వడ్డీని 18శాతానికి తగ్గించి ఇందులో 90శాతం సభ్యుల పొదుపులపై చెల్లించడం ప్రారంభించారు.
బ్యాంకుల రుణసాయం
2009-2013 మధ్యలో 20గ్రామాల్లోని 2,843 మంది సభ్యులను 206 బృందాలుగా స్టేట్ బ్యాంక్ వారి సహకారంతో ఏర్పాటు చేసి, బృందాల పేరున బ్యాంక్ ఖాతాలను తెరిచి అప్పటివరకు సమకూరిన పొదుపులు, పొదుపులపై చెల్లించిన వడ్డీని ఖాతాల్లో జమచేశారు. అప్పటి నుంచి బృందాలస్థాయిలో సభ్యుల సమష్ఠి నిర్ణయం మేరకు ఆర్థిక లావాదేవీలు ప్రారంభమయ్యాయి. ఈ బృందాలకు మ్యాక్స్ వారి పూచీకత్తుపై హెచడీఎ్‌ఫసీ నుంచి రూ.1.30కోట్లు, ఎస్‌బీఐ తుర్కపల్లి నుంచి రూ.2కోట్ల రుణసాయం అందాయి. వలస పోయిన వృద్ధులు సభ్యత్వాలను విరమించుకున్నారు. ఎప్పటికప్పుడు ఈ బృందాలను పర్యవేక్షిస్తూ అవసరమైన పద్ధతులను రూపొందించుకొని నిరంతరం సంఘ సమావేశాల్లో పాల్గొని సభ్యులను జాగృతం చేసి ముందుకుసాగారు. లెక్కల్లో తప్పొప్పులను సరిచేసుకుంటూ బుక్‌కీపర్లకు తగిన శిక్షణ ఇచ్చారు. కేవలం ఆర్థిక లావాదేవీలే కాకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, మహిళా, పేదల సమస్యలపై పనిచేయడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా 2018 నుంచి బుక్‌కీపర్లకు బృందాల ఆర్థిక పరిపుష్ఠిని బట్టి రూ.500 నుంచి రూ.300 వరకు రుసుం చెల్లిస్తున్నారు. మిగులు లేని బృందాలకు ఉచితసేవ అందిస్తున్నారు. భవిష్యతలో పిలుపు సంస్థ లేకపోయినా స్వరభారతీ మ్యాక్ ఈ ప్రాంతాల్లోని మహిళలకు అండగా ఉంటుందని భరోసా ఇక్కడి మహిళల్లో కనిపిస్తోంది.
ఈ నెల 12న స్వరభారతీ రజితోత్సవాలు
పిలుపు స్వచ్ఛంద సంస్థ సహకారంతో 1995లో స్వరభారతీ మ్యాక్స్ సొసైటీ రిజిస్ట్రేషన అయ్యింది. సొసైటీ ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 12న రజతోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు. ఈ వేడుకలకు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరవుతున్నట్లు మ్యాక్స్ మేనేజర్, బోర్డు అధ్యక్షురాలు సుమలత తెలిపారు.
ఆదాయంతో పాటు ఆహారం
రామోజీనాయక్‌తండాలో స్వరభారతీ ఏర్పాటుచేసిన ఇందిరా బృందంలో 1999లో సభ్యురాలిగా చేరా. మా తండాలో ఇంతకు ముందు జొన్నలు, సజ్జలు బాగా పండించేవారు. కానీ ఐదేళ్ల నుంచి జొన్న సాగు మానేశారు. ఈ సంగతి మా బృందంలో చర్చించుకొని తిరిగి జొన్న పంటను పునరుద్ధరించాలని తీసుకున్న నిర్ణయం మేరకు జొన్న సాగు చేస్తున్నా. అందుకు అనుబంధంగా వ్యాపార పంటైన బంతిని కూడా వేశా. దీంతో మా కుటుంబసభ్యులకు పౌష్టికాహారం లభిస్తుంది, జొన్న సాగు చేసే వారికి పెట్టుబడి సాయం కూడా ఇస్తున్నారు. ఈ పంటల సాగుతో కొంత ఆదాయం పౌష్టికాహారం లభిస్తోంది.
-గుగులోతు అంబి, రామోజీనాయక్‌తండా
ఖర్చులు పోనూ రూ.10 వేల ఆదాయం
ఇంతకు ముందు పౌల్ర్టీఫాం ఉండేది. దాంతో వచ్చే ఆదాయం అవసరాలకు సరిపోయేదికాదు. భావన పొదుపు బృందం నుంచి చిన్నమొ త్తాల్లో చాలాసార్లు అప్పు తీసుకోని కుటుంబ అవసరాలు తీర్చుకున్నా.ఇప్పుడు రూ.70వేల అప్పు తీసుకుని జిరాక్స్ మిషన పెట్టుకున్నా. ఖర్చులన్నీ పోను నెలకు రూ.10వేల వరకు ఆదాయం వస్తుంది. స్వరభారతికి ధన్యవాదాలు.
వలందాసు లావన్య, రుస్తాపూర్
భవిష్యతలో మరింత ముందుకు
30ఏళ్లుగా నడుస్తున్న స్వరభారతీ మ్యాక్స్ తమ అనుభవాలను తీసుకుని భవిష్యతలో ఇదే స్ఫూర్తితో సమాజంలో పేదలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. ఆ దిశగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నా.
ఎం.జనార్థన, పిలుపు సంస్థ ఎగ్జిక్యూటీవ్, డైరక్టర్
సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం సంతోషం
గత 25 ఏళ్లుగా స్వరభారతీ మాక్స్ ద్వారా ఎలాంటి ఒడిదుడుకులు లేకు ండా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ నేడు సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకోవడం తనతో పాటు గ్రూప్ సభ్యులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- కొడారి సుమలత, స్వరభారతీ మ్యాక్స్ అధ్యక్షురాలు