Share News

గొంతుకోసి యువకుడి హత్య

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:15 AM

పాతకక్షల నేపథ్యంలో ఓ యువకుడి గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో బుధవారం ఉదయం వెలుగుచూసింది.

గొంతుకోసి యువకుడి హత్య
కిరణ్‌(ఫైల్‌ఫొటో)

నాగారం, సెప్టెంబరు 11: పాతకక్షల నేపథ్యంలో ఓ యువకుడి గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో బుధవారం ఉదయం వెలుగుచూసింది. యువకుడి మృతదేహాన్ని ఎస్సారెస్పీ కాల్వలో పడేయడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నాగారం సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్‌ఐ ఐలయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమలగిరి మునిసిపాలిటీకి చెందిన వనగండ్ల కిరణ్‌కుమార్‌(27) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో తిరుమలగిరి పరిధిలోని హిల్స్‌కాలనీ నుంచి బైక్‌పై వెళ్తున్నాడు. కిరణ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి అతడిపై కత్తులతో దాడి చేశారు. స్పృహకోల్పోయిన కిరణ్‌ను కారులో నాగారం మండలం డీ.కొత్తపల్లి గ్రామశివారులోని ఎస్సారెస్పీ కాల్వ వద్దకు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక కిరణ్‌ను గొంతుకోసి చంపారు. మృతదేహాన్ని కాల్వలో పడవేసి దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారని సీఐ తెలిపారు. బుధవారం ఉదయం కాల్వ వెంట పొలాలకు వెళ్తున్న స్థానికులకు కాల్వలో యువకుడి మృతదేహం కనిపించిందన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెళ్లి పంచనామా నిర్వహించినట్లు సీఐ తెలిపారు. కిరణ్‌కుమార్‌ అవివాహితుడు కాగా అతడి సోదరుడు సాయికుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. త్వరలో దుండగులను పట్టుకుని హత్యకు దారితీసిన కారణాలను ప్రకటిస్తామన్నారు. సంఘటనా స్థలాన్ని సూర్యాపేట డీఎస్పీ జీ రవి పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్స్‌, క్లూస్‌టీం, ఫోరెన్సిక్‌ బృందాలు ఆధారాలు సేకరించాయి.

హత్యకు వివాహేతర సంబంధమేనా కారణమా?

దుండగుల దాడిలో చేతిలో హత్యకు గురైన కిరణ్‌కుమార్‌కు తిరుమలగిరికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. ఈ విషయంలో కిరణ్‌తో గతంలో ఓ వ్యక్తి గొడవ పడినట్లు సమాచారం. మృతుడి సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఫత్తెపురం విజయ్‌తో గతంలో గొడవపడ్డాడని,అతడే తన తమ్ముడిని హత్య చేశాడని అనుమానం వ్యక్తం చేశాడు. ఆ దిశగా విచారణ చేసి, నేరస్తులను పట్టుకుంటామని సీఐ తెలిపారు.

దుండగులను అరెస్ట్‌ చేయాలని రాస్తారోకో

తిరుమలగిరి : తిరుమలగిరికి కేంద్రానికి చెందిన కిరణ్‌ను కిరాతంగా హత్యచేసిన దుండగలను వెంటనే అరెస్ట్‌ చేయాలని కుటుంబసభ్యులు తిరుమలగిరి పట్టణంలో ఆందోళన చేశారు. జనగామ- సూర్యాపేట రహదారిపై అంబేడ్కర్‌నగర్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్‌ఐ సురే్‌షలు ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపచేశారు. అంబేడ్కర్‌నగర్‌లో పోలీసులు గట్టి బందోబస్త్‌ ఏర్పాటుచేశారు.

Updated Date - Sep 12 , 2024 | 12:15 AM