వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:40 AM
నవరాత్రుల పాటు పూజలందుకున్న ఏక దంతుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ మేరకు సోమవారం జిల్లాఅంతటా గణేష్ నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లావ్యాప్తంగా 3,067 విగ్రహాలను ప్రతిష్ఠించగా ఈపాటికే సుమారు 500 విగ్రహాలను నిమజ్జనం చేశారు.
జిల్లా అంతటా నిమజ్జన కోలాహలం
500 మందికిపైగా పోలీసులతో భారీ బందోబస్తు
ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి: కలెక్టర్, డీసీపీ
భువనగిరి టౌన్: నవరాత్రుల పాటు పూజలందుకున్న ఏక దంతుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ మేరకు సోమవారం జిల్లాఅంతటా గణేష్ నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లావ్యాప్తంగా 3,067 విగ్రహాలను ప్రతిష్ఠించగా ఈపాటికే సుమారు 500 విగ్రహాలను నిమజ్జనం చేశారు. సోమవారం జిల్లా అంతటా 2వేల విగ్రహాలను సమీపంలోని చెరువులు, కుంటలు, కాల్వల్లో నిమజ్జనం చేయనున్నారు. మిగతా విగ్రహాలను ఈ నెల 20లోపు నిమజ్జనం చేయనున్నారు.
గణేష్ శోభాయాత్ర,నిమజ్జనం సజావుగా సాగేందుకు పలు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లుచేస్తున్నాయి. జిల్లా అంత టా 500మందికి పైగా బలగాలతో పోలీసులు భారీ బందోబస్తు ఏ ర్పాటు చేస్తున్నారు. డీజేలను నిషేధించినట్లు ఈపాటికే పోలీసులు ప్రకటించడంతో నిర్వాహకులు కోలాటాలు, వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అధికారుల సమన్వయంతో..
జిల్లాలో ప్రతిష్ఠించిన విగ్రహాల్లో అధికశాతం సోమవారం నిమజ్జనం చేయనుండడంతో జిల్లా అంతటా కోలాహలం నెలకొంది. భక్తులందరూ అందంగా అలంకరించిన శకటాలపై గణనాథులను ఊరేగిస్తూ భక్తిగీతాలు ఆలపిస్తూ, భజనలు చేస్తూ వివిధ ప్రదర్శనలతో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సాగనుంది. భువనగిరితోపాటు జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో నిమజ్జన శోభాయాత్ర అట్టహాసంగా నిర్వహించనున్నారు. మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీలు, ఇరిగేషన్, అగ్ని మాపక శాఖ, మత్స్య శాఖ, ట్రాన్స్‌కో, పోలీస్, రెవెన్యూ తదితర ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో నిమజ్జనోత్సవ ఏర్పాట్లను చేస్తున్నారు. భువనగిరి పెద్ద చెరువులో నిమజ్జనోత్సవం సజావుగా సాగేలా రెం డు భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. చెరువులో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. చెరువు అంతటా భారికేడ్లు ఏర్పాటుచేసి లైట్లు బిగించారు. అత్యవసర వైద్యసేవలకోసం వైద్యశాఖ ఔట్‌పోస్టును ఏర్పాటు చేసి అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచనుంది. తాగునీటిని ఏర్పాటుచేశారు. నిమజ్జన ఏర్పాట్లను మునిసిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కమిషనర్ రామాంజుల్‌రెడ్డి, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రత్నపురం శ్రీశైలం, తదితరులు పరిశీలించారు. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట్టణాన్ని కాషాయ జెండాలతో అలంకరించగా వివిధ సంఘాలు స్వాగత తోరణాలు ఏర్పాటుచేశాయి. భక్తులకు అవసరమైన తాగునీటిని అందించనున్నారు. అలాగే బీబీనగర్, రాయిగిరి, వలిగొండ, సంగెం, తుమ్మలగూడెం, తదితర చెరువుల వద్ద కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
భారీ బందోబస్తు నడుమ..
గణేష్ నిమజ్జన శోభాయాత్ర సజావుగా సాగేందుకు జిల్లాలో 500మందికిపైగా పోలీసులతో జిల్లా అంతటా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు. చివరి విగ్రహం నిమజ్జనమయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి అధికారులు సూచించారు. వదంతులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కల్పించే వారిపై నిఘా పెట్టినట్లు పోలీసు అధికారులు పే ర్కొంటున్నారు. శోభాయాత్రలో ఇతరులకు ఇబ్బందికలిగేలా వ్యవహరించరాదని పోలీసులు పేర్కొంటున్నారు.
నిమజ్జనోత్సవానికి పటిష్ఠ బందోబస్తు : డీసీసీ
గణేష్ నిమజ్జనోత్సవానికి జిల్లా అంతటా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ ఎం రాజే్‌షచంద్ర తెలిపారు. నిమజ్జనంపై జిల్లా పోలీసులతో ఆదివారం భువనగిరిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నిమజ్జనంకోసం చెరువుల వద్ద స్థానిక సంస్థలు, ఇతర శాఖల అధికారులతో కలి సి స్థానిక పోలీస్ అధికారులు ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. శోభాయాత్ర శాంతియుతంగా ముగిసేందుకు విధుల్లో ఉన్న పోలీసులు చిత్తశుద్ధి చూపాలన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రత్యేక భద్రతకు స్థానిక అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. భువనగిరి, బీబీనగర్ తదితర చెరువుల వద్ద సులభ నిమజ్జనంకోసం క్రేన్లు తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. చివరి విగ్రహం నిమజ్జనం జరిగే వరకూ పోలీసులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ప్రతి గంటకు జిల్లా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీలు లక్ష్మీనారాయణ, వినోద్‌కుమార్, ఏసీపీలు రవికిరణ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రమే్‌షకుమార్ పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి : హనుమంతు కె.జెండగే, కలెక్టర్
గణేష్ నిమజ్జన శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి. ఊరేగింపులో, చెరువుల్లో నిమజ్జనం చే సే సందర్భాల్లో ఎలాంటి అపశ్రుతి జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. పలు ప్రభుత్వ శాఖల అధికారులు కూ డా నిమజ్జన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. శోభాయాత్రను ఉదయమే ప్రారంభించి రాత్రి త్వరగా ముగించేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. సమయ పాలన పాటించడం ద్వారా అందరూ క్షేమంగా ఉండవచ్చు. నిర్వాహకులు సమన్వయంగా వ్యవహరిస్తూ ఊరేగింపు శాంతియుతంగా ముగిసేలా అధికారులకు సహకరించాలి.
నల్లగొండ జిల్లాలో 4,831 గణేష్ విగ్రహాలు
నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఈనెల 16వ తేదీన (సో మవారం) గణేశ్ నిమజ్జ న శోభాయాత్రను ప్రజ లు ప్రశాంత వాతావరణ లో నిర్వహించేలా పోలీసులు బందోబస్తు ఏర్పా ట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,831 వినాయక విగ్రహాలు ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు, ఘటనలు జరగకుండా పోలీసులు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని ప్రధాన రహదారులతో పాటు వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలతోపాటు ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా పోలీస్ కార్యాలయానికి అనుసంధానం చేశారు. ఈ సీసీ కెమెరాల ద్వారా జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూం నుంచి అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ని అన్ని వినాయక విగ్రహాలు, మండపాలను జియో ట్యాగింగ్ చేసిన పోలీసులు మండపాలకు నంబర్లు కేటయించారు. ఈ నెంబర్ల ప్రకారం శోభాయాత్రలో పాల్గొనాల్సి ఉంటుంది. నల్లగొండ పట్టణ కేంద్రంలోని అద్దంకి బైపాస్ పానగల్ సమీపంలో ఉన్న వల్లభరావు చెరువు వద్ద తొమ్మిది అడుగులలోపు విగ్రహాలు నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశారు. తొమ్మిది అడుగులకు పైబడిన విగ్రహాలు సాగర్ రోడ్డులోని 14వ మైలురాయి వద్ద నిమజ్జనం చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
సూర్యాపేట జిల్లాలో 38 ప్రాంతాల్లో నిమజ్జనం
సూర్యాపేట(కలెక్టరేట్): సూర్యాపేట జిల్లాలో నేడు గణేష్ నిమజ్జనాన్ని నిర్వహించనున్నారు. గత తొమ్మిది రోజులుగా గణేష్ విగ్రహాలను నెలకొల్పి భక్తిశ్రద్ధలతో ఎంతో ఘనంగా నవరాత్రోత్సవాలు నిర్వహించారు. జిల్లా అంతటా నేడు గణేష్ నిమజ్జనం చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలో 38 ప్రదేశాల్లో నిమజ్జనం ఏర్పాట్లను చేశారు. సోమవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వినాయక నిమజ్జనాలను పూర్తి చేసేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 3వేల వరకు విగ్రహాలను నెలకొల్పారు. గత ఏడాది వినాయక చవితితో పోలిస్తే ఈ ఏడాది విగ్రహాల సంఖ్య తగ్గింది. భక్తులు ఖర్చుకు వెనకాడకుండా గణేష్ నవరాత్రోత్సవాలను ఎంతో భక్తిశ్రద్ధలతో గణనీయంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. కొంతమంది భక్తులు మూడవ, ఐదో రోజు విగ్రహాలను నిమజ్జనాలకు తరలించారు. జిల్లాలో సోమవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ ఆధ్వర్యంలో జిల్లాలో గణేష్ నిమజ్జన బందోబస్తులో సుమారు 900మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.