కృష్ణా జలాలపై సమరం
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:13 AM
కృష్ణాజలాల అంశంపై నల్లగొండ జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. మంగళవారం కృష్ణాజలాల హక్కుల సాధన పేరుతో బీఆర్‌ఎస్ సభ ఏర్పాటుచేసింది. ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్ రానున్నారు. కాగా, పోటీగా కాంగ్రెస్ నల్లగొండ జిల్లా కేంద్రంలో సభలు ఏర్పాటు చేయడంతో ఉత్కంఠ ఏర్పడింది.
నేడు నల్లగొండలో బీఆర్‌ఎస్ సభ, పోటీగా కాంగ్రెస్ నిరసన
కృష్ణా జలాల హక్కుల పరిరక్షణకు జిల్లా కేంద్రంలో ఆందోళనలు
హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్8 నల్లగొండలో తీవ్ర ఉత్కంఠ
నల్లగొండలో సిద్ధమైన మాజీ సీఎం కేసీఆర్ సభా ప్రాంగణం
(ఆంధ్రజ్యోతిప్రతినిధి, నల్లగొండ): కృష్ణాజలాల అంశంపై నల్లగొండ జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. మంగళవారం కృష్ణాజలాల హక్కుల సాధన పేరుతో బీఆర్‌ఎస్ సభ ఏర్పాటుచేసింది. ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్ రానున్నారు. కాగా, పోటీగా కాంగ్రెస్ నల్లగొండ జిల్లా కేంద్రంలో సభలు ఏర్పాటు చేయడంతో ఉత్కంఠ ఏర్పడింది.
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ‘కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ’ సభ మంగళవారం సాయంత్రం 3గంటలకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి బైపాస్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ సభకు మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో పాటు ఇతర ముఖ్యనేతలు హాజరుకానున్నారు. మరోవైపు కృష్ణాజలాల హక్కులు సాధించడంలో బీఆర్‌ఎస్ వైఫల్యం చెందిందని,కాంగ్రెస్ నేతలు పోటీగా నిరసన సభను నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో ఏర్పాటు చేశారు. ఈసభలో ఎల్‌ఈడీల ద్వారా బీఆర్‌ఎస్ వైఫల్యాలను వివరిస్తామని, జిల్లాలోని కృష్ణా ఆధారిత ప్రాజెక్టులను కుర్చీవేసుకొని కట్టిస్తామన్న హామీని విస్మరించిన మాజీ సీఎం కేసీఆర్ ద్రోహం చేశారని, ఆ విషయాన్ని ప్రజలకు వెల్లడించేలా క్లాక్‌టవర్ సెంటర్‌లోనే నిరసన సభ నిర్వహిస్తాని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. గులాబీరంగు కుర్చీ,గులాబీకండువా, మాజీ సీఎంకేసీఆర్ ఫొటో ఏర్పాటు చేసి నిరసన తెలపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రెండు పార్టీలు నల్లగొండ కేంద్రంగా పోటాపోటీగా సభల నిర్వహణకు సిద్ధమవడంతో అందరి దృష్టి నల్లగొండపై ఏర్పడింది. ఉదయం 11గంటలకు కాంగ్రెస్ నిరసన సభ, సాయంత్రం 3గంటలకు బీఆర్‌ఎస్ సభ నిర్వహించనున్నారు. బీఆర్‌ఎస్ సభకు ఉమ్మడి జిల్లా నుంచేగాక, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రజలను తరలించనున్నారు.
నల్లగొండ కేంద్రంగా జలయుద్ధం
కృష్ణాజలాల కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్వహణ అంశాలు కేంద్రం పరిధిలోకి వెళ్లడానికి తమరంటే తమరు కారణమని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పరస్పర విమర్శలతో రాష్ట్రంలో జలరాజకీయం వేడెక్కింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నల్లగొండ కేంద్రంగా ఇరుపార్టీలు శ్రీకారం చుట్టాయి. కృష్ణా బేసిన్‌కు ఆయువుపట్టుగా పేర్కొనే నల్లగొండ జిల్లా నుంచే రెండు పార్టీలు ఉద్యమానికి శ్రీకారం చుట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు దాదాపు ఏకపక్ష విజయాన్ని ఇచ్చిన ఈ జిల్లాలోనే కాంగ్రె్‌స వైఫల్యాలను ఎత్తిచూపడం ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా బీఆర్‌ఎస్ వ్యూహం రూపొందించింది. ఉద్ధండ నేతలున్న ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ సైతం అదే రీతిలో బీఆర్‌ఎ్‌సపై విరుచుకుపడుతోంది. సీనియర్ మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్‌ఎస్ పాలనలో నదీజలాల హక్కులసాధనలో వైఫల్యాలపై ధ్వజమెత్తుతున్నారు. జలాల విషయంలో బీఆర్‌ఎస్ బుకాయిస్తోందని, వారి హయాంలోనే కేఆర్‌ఎంబీకి అప్పగింత, జలాలను ఏపీకి ధారాదత్తంచేసిందని విమర్శిస్తున్నారు.
భారీ పోలీస్ బందోబస్తు
నల్లగొండ: నల్లగొండలో ఓ వైపు బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ, మరో వైపు కాంగ్రెస్ మినీ సభ పోటాపోటీగా ఏర్పాటు చేస్తుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ రెండు రాజకీయ సభలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెలీకాప్టర్ ల్యాండింగ్ కోసం ఆ పార్టీ నాయకులు సోమవారం రాత్రి వరకు కలెక్టర్ అనుమతి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. బైపాస్ రోడ్డులో జరిగే బీఆర్‌ఎస్ సభకు భారీ సంఖ్యలో జనసమీకర ణ చేస్తుండటంతో పోలీసులు అదే స్థాయిలో భారీ బందోబస్తు దిశగా చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్‌ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి జనసమీకరణ చేస్తోంది. దీంతో జిల్లా పోలీ్‌సశాఖ సుమారు 300 మందితో బం దోబస్తుకు నిర్ణయించింది. వివిధ జిల్లాలో ఉన్న డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో పాటు కానిస్టేబుళ్లు, హోంగార్డులను బందోబస్తుకు కేటాయించారు. నల్లగొండ ఇన్‌చార్జి డీఎస్పీ లక్ష్మీనారాయణకు బందోబస్తు బాధ్యతలు అప్పగించి ఎస్పీ చందనాదీప్తి పర్యవేక్షిస్తున్నారు. గడియా రం సెంటర్‌లో కాంగ్రెస్ సభకు సైతం పోలీసుల అనుమతితో ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు.
కాంగ్రెస్ చేతగానితనం వల్లే..
కృష్ణానది జలాల హక్కులను కోల్పోయాం
చలో నల్లగొండకు భారీగా ప్రజలు
మాజీ మంత్రి జగదీ్‌షరెడ్డి
నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే కృష్ణానది జలాల హక్కులను కోల్పోయాం. కృష్ణానది ప్రాజెక్టులో హక్కులను కాపాడుకునేందుకే నల్లగొండలో సభ నిర్వహిస్తున్నాం.ఈ సభకు ఉమ్మడి జిల్లాతో పాటు ఖమ్మం, మహుబూబ్‌నగర్ జిల్లా నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివస్తారు. కాంగ్రెస్, కేంద్రం లోని బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకుంది. కాంగ్రెస్ సీఎంతో పాటు మంత్రులు సాగర్ ప్రాజెక్టును ఎందుకు సందర్శించలేదు. కృష్ణా జలవివాదం అ నేది తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య. జలాల హక్కులను కేఆర్‌ఎంబీకి అ ప్పజెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ద్రోహులుగా, ఏపీ నాయకులకు ఏజెంట్లుగా మారారు. కృష్ణా జలాల హక్కులపై బీఆర్‌ఎస్ పోరా టంవల్లే కేఆర్‌ఎంబీకి అప్పజెప్పలేదని కాంగ్రెస్ తీర్మానం చేసింది. తెలంగాణ ప్రజలు మరోసారి నీటికోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నేడు కాంగ్రెస్ మినీ నిరసన సభ
నల్లగొండ: నల్లగొండ జిల్లాను మాజీ సీఎం కేసీఆర్ ఎడారిగా మార్చారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నిర్వహించనున్న సభ కు నిరసనగా మంగళవారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌లో కాంగ్రెస్ మినీ నిరసన సభ నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు. సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసి న విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు వంగూరి లక్ష్మయ్య, మునిసిపల్ వైస్‌చైర్మన్ అబ్బగోని రమే్‌షగౌడ్ మాట్లాడారు. ఎస్‌ఎల్‌బీసీ వద్ద కుర్చీ వేసుకు ని కూర్చుని పూర్తి చేయిస్తానని మాట తప్పిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నా డో అని ప్రశ్నించారు. కేసీఆర్ రాకకు నిరసనగా ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 1గంట వరకు గడియారం సెంటర్‌లో పింక్ కుర్చీ, టవల్ వేసి, కేసీఆర్ ఫొటోను పెట్టి నిరసన తెలపడంతో పాటు ఎల్‌ఈడీ టీవీల ద్వారా కేసీఆర్ గతంలో మాట్లాడిన మాటలను ప్రదర్శిస్తామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ పా ర్టీకి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క స్థానం కూడా దక్కదన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్ మాట్లాడిన మాటలు పరిశీలిస్తే కేసీఆర్ వల్లే ఏపీకి నీళ్లు వెళ్తున్నాయని అర్థం అవుతుందని గుర్తుచేశారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆమరణ నిరహారదీక్ష చేశారన్నారు.