బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:36 AM
తెలంగాణ సంస్కృతికి ప్రతి రూపంగా నిలిచే బతుకమ్మ వేడుకలు బుధవారం ప్రారంభంకానున్నాయి. ప్రకృతిని దేవతగా కొలుస్తూ సాగే ఈ వేడుకలు మహాలయ అమావాస్య నాడు ప్రారంభమై తొమ్మిది రోజులు కొనసాగనున్నాయి. గౌరమ్మను ఒక్కోరోజు ఒక్కో పేరుతో తీరొక్క పూలతో పూజించి మహిళలు బతుకమ్మల చుట్టూ ఆడిపాడనున్నారు.
నేడు ఎంగిలిపువ్వు బతుకమ్మ
పాఠశాలలకు నేటి నుంచి సెలవులు
కిక్కిరిసిన బస్టాండ్లు
మార్కెట్‌లో పూల సందడి
తెలంగాణ సంస్కృతికి ప్రతి రూపంగా నిలిచే బతుకమ్మ వేడుకలు బుధవారం ప్రారంభంకానున్నాయి. ప్రకృతిని దేవతగా కొలుస్తూ సాగే ఈ వేడుకలు మహాలయ అమావాస్య నాడు ప్రారంభమై తొమ్మిది రోజులు కొనసాగనున్నాయి. గౌరమ్మను ఒక్కోరోజు ఒక్కో పేరుతో తీరొక్క పూలతో పూజించి మహిళలు బతుకమ్మల చుట్టూ ఆడిపాడనున్నారు. బతుకమ్మ సందర్భంగా మంగళవారం పట్టణంలో ప్రజలు పూల కొనుగోళ్లతో సందడి చేశారు. అదేవిధంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. అందుకు భక్తులు జిల్లా వ్యాప్తంగా మండపాలను సిద్ధం చేశారు. అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం చేయనున్నారు. ఈనెల 2 నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో మంగళవారం ఆయా పాఠశాలల్లో విద్యార్థినులు బతుకమ్మ ఆడి సంబరాలు చేసి ఇంటి బాటపట్టారు. దీంతో బస్టాండ్, ముఖ్య కూడళ్లలో రద్దీ కనిపించింది. బుధవారం ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలు ఉండటంతో మహిళలు పుట్టింటికి పయనమయ్యారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ అధికారులు వివిధ రూట్లలో అదనంగా బస్సులు నడిపారు. బస్సులన్నీ కిక్కిరిసి నడిచాయి.