పదివేల రంగుల అద్భుతం
ABN , Publish Date - Nov 30 , 2024 | 11:48 PM
‘చేనేత రంగంలో సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూనే, కొత్త పుంతలు తొక్కిస్తున్నారు యాదాద్రి-భువనగిరి జిల్లా భూదానపోచంపల్లికి చెందిన బోగ బాలయ్య ఆయన సతీమణి సరస్వతీ.
వినూత్న వసా్త్రల తయారీలో వస్త్రశిల్పి బోగ బాలయ్య
వ్యాట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ రంగులతో వసా్త్రల తయారీ
‘చేనేత రంగంలో సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూనే, కొత్త పుంతలు తొక్కిస్తున్నారు యాదాద్రి-భువనగిరి జిల్లా భూదానపోచంపల్లికి చెందిన బోగ బాలయ్య ఆయన సతీమణి సరస్వతీ. ఏడు రంగుల హరివిల్లు వర్ణాలను చూస్తూ విస్తుపోతుంటాం.. అలాంటిది చేనేత ఇక్కత వసా్త్రన్ని పదివేల రంగుల షేడ్స్‌తో మగ్గంపై నేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తమ సృజనతో ‘సంత కబీర్’ పురస్కారాన్ని పొందారు. కొత్తగా శాలువాపై పదివేల రంగుల డిజైన్లతో ఇండియా మ్యాప్‌ను ఆవిష్కరించి అందరినీ అబ్బురపరుస్తున్నారు.’
(ఆంధ్రజ్యోతి-భూదానపోచంపల్లి)
ఇక్కత వసా్త్రల తయారీలో వినూత్న ప్రయోగాలు చేస్తున్న యాదాద్రి-భువనగిరి జిల్లా భూదానపోచంపల్లికి చెందిన చేనేత కళాకారుడు బోగ బాలయ్య ఆయన సతీమణి సరస్వతీ తాజాగా మగ్గంపై డబుల్ ఇక్కత విధానంలో రుమాలు(స్కార్ప్)పై ఇండియా మ్యాప్ నేసి అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆజాదీ కా అమృత మహోత్సవాలను పురస్కరించుకుని తన దేశభక్తి చాటేందుకు బాలయ్య ఇండియా మ్యాప్, మధ్యన చరఖా రాట్నం వచ్చేట్లుగా స్కార్ప్ నేశారు. ఇందుకోసం మృదువుగా ఉండే ప్రత్యేకమైన నూలును తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు నుంచి తెప్పించారు. అలాగే పర్యావరణ హితమైన ఎకో ఫ్రెండ్లీ వ్యాట్ రంగులను వినియోగించారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా పదివేల రంగుల(షేడ్స్)తో కూడిన షేడ్స్‌తో అద్భుతమైన డిజైన్లు రూపొందించారు. సాంప్రదాయ చేనేత వసా్త్రల్లో ఇన్ని రంగులు వాడటం చాలాఅరుదు. అయినా సరే బోగ బాలయ్య సాహసం చేశాడు. రెండేళ్లుగా తాను అనుకున్న విధంగా కష్టపడి మగ్గాన్నే తన క్యాన్వా్‌సగా మార్చుకుని వస్త్రంపై రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించారు. 46/46 అడుగుల సైజులో పదివేల రంగుల షేడ్స్‌తో మెర్సరైజ్డ్ కాటన ఇక్కత వసా్త్రన్ని ఆవిష్కరించారు. ఈ వస్త్ర తయారీలో రసాయాల జాడలేని పర్యావరణ హితమైన రంగులు వాడినట్లు సగర్వంగా చెబుతున్నారు బోగ బాలయ్య - సరస్వతీ. బాలయ్య ఇప్పటికే వినూత్న డిజైన్లతో ఇక్కత చీరలను నేసి 2021లోనే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాన్ని అప్పటి మంత్రి కేటీఆర్ నుంచి అందుకున్నారు.
చేనేత కళ..భళా!
పోచంపల్లి చేనేత ‘ఇక్కత’ వసా్త్రలకు ఖండాంతర ఖ్యాతి ఉంది. చేనేత వస్త్ర తయారీలో కళాకారుల ప్రతిభ అసామాన్యం. చేనేత కళ అత్యద్భుతంగా ప్రదర్శించడంలో తెలంగాణ కళాకారులు అందెవేసిన చెయ్యిగా చాటుకున్నారు. భూదానపోచంపల్లి పట్టణానికి చెందిన బోగ బాలయ్య ఎన్నో అద్భుతమైన వస్త్ర కళాఖండాలను రూపొందించారు. ఈ నేపథ్యంలో వ్యాట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ రంగులను ఉపయోగించి సుమారు 100 పూక చిటికీలు, 100 నిలువు చిటికీలను రూపొందించి అందులో పదివేల రంగులు వచ్చే విధంగా వివిధ రకాల షేడ్‌లను అద్ది తన చేనేత కళా ప్రతిభ ద్వారా పోచంపల్లి పట్టు చీరలు రూపొందించారు. అంతేగాక ఈ పట్టు చీరలు రెండు కొంగులు ఉండే విధంగా రూపొందించడం మరొక విశేషం.
వివిధ రకాల వసా్త్రలు తయారీ
పోచంపల్లి చేనేత వసా్త్రలు ప్రపంచ వ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందేందుకు బాలయ్య, సరస్వతీ దంపతులు శ్రమిస్తున్నారు. 11 నెలల పాటు ఈ దంపతులు శ్రమించి ప్రత్యేక చీర తయారు చేశారు. సుమారుగా ముడి సరుకు, నూలు, రంగులు, రసాయనాలు తదితర ఖర్చులతో కలిపి కేవలం వస్త్ర తయారీకి సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేశారు. బాలయ్య గతంలో 1,400 రంగులలో చీర నేశారు. ఒక చీరలో 121 రంగులు, 121 వివిధ ఆకృతులతో మగ్గంపై చీర చేశారు. ఈ వసా్త్రల తయారీలో ఆయన చూపిన ప్రతిభకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక రాష్ట్ర అవార్డును అందుకున్నారు. భారతదేశ పటంతో డబుల్ ఇక్కతలో 10వేల రంగులతో వసా్త్రన్ని తయారు చేసి తన చేనేత కళను ప్రదర్శించారు.
జాతీయ అవార్డు లక్ష్యం
తమ నూతన డిజైన్ల వసా్త్రలతో ఎంతోమంది అభినందనలు అందుకున్న బాలయ్య, సరస్వతీ దంపతులు జాతీయ అవార్డు లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంత కబీర్ అవార్డుతో పాటు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డును బోగ బాలయ్య- సరస్వతీలు అందుకున్నారు. వారు ప్రస్తుతం మార్కెట్లోకి అధునాతనమైన డిజైన్లతో పలురకాల వసా్త్రలను ప్రవేశపెడుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఏనాటికైనా తాము జాతీయ అవార్డుకు ఎంపిక కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మాజీ మంత్రి కేటీఆర్, రాష్ట్ర చేనేత జౌళీ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యయాదవ్, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు అభినందించారు.
చేదోడుగా పనిచేస్తున్నా
తన భర్త చేనేత వృత్తిలో వినూత్నమైన డిజైన్ల తయారీ కోసం తపన పడుతుంటాడు. అతని లక్ష్య సాధనలో నావంతు చేదోడుగా కృషి చేస్తున్నా. చేనేత వస్త్ర తయారీ ప్రక్రియ చాలా కష్టమైనది. యారన బ్లీచింగ్ మొదలు, వార్పింగ్, డిజైనింగ్, టైయింగ్, డైయింగ్, చిట్కీ, ఆసుపోయడం, వార్పు సరిచేయడం, మగ్గంపై నేయడం తదితర ప్రక్రియల్లో ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ తనవంతు కృషి చేశా. చేనేత రంగంలో జాతీయ స్థాయి గుర్తింపు సాధించాలనే ఆయన తపనకు నా తోడ్పాటు అందిస్తున్నా.
బోగ సరస్వతీ
గుర్తింపు కోసం కష్టపడుతున్నా
గత 40 ఏళ్లుగా చేనేతనే నమ్ముకున్నా. గతంలో 1600 రంగుల మేళవింపుతో ఓ చీరను తయారు చేశాం, కానీ, అది పూర్తిగా గడులుగా ఉండటంతో సరైన గుర్తింపు రాలేదు. తిరిగి 121 వర్ణాలతో 121 డిజైన్లతో ఇక్కత చీరను నేశాం. మా శ్రమను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ‘సంత కబీర్ అవార్డుకు’ ఎంపిక చేసింది. తర్వాత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాన్ని అందించింది. ఇప్పుడు వినూత్నమైన వస్త్ర తయారీతో పదివేల వర్ణ చిత్రాలతో రూపొందించిన ఇక్కత స్కార్ప్‌కు మరింత గుర్తింపు లభించేందుకు కృషి చేస్తున్నాం. ఈ వినూత్నమైన ఆవిష్కరణతో జాతీయస్థాయిలో గుర్తింపు సాధించాలనేది నా కోరిక. నా కష్టానికి తగిన గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఉన్నా’
బోగ బాలయ్య, పోచంపల్లి ప్రముఖ డిజైనర్