బండరాళ్ల మధ్య తల చిక్కి కోడె మృతి
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:59 PM
మేతకు వెళ్లిన ఓ కోడె బండరాళ్ల మధ్య ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందింది. మంగళవారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో ఈ ఘటన జరిగింది.
నార్కట్‌పల్లి, అక్టోబరు 1: మేతకు వెళ్లిన ఓ కోడె బండరాళ్ల మధ్య ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందింది. మంగళవారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో ఈ ఘటన జరిగింది. చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో గోశాలను నిర్వహిస్తున్నారు. భక్తులెవరైనా కోడె మొక్కులు ఉంటే కోరికలు నెరవేరగానే ఆవులను, కోడెలను దేవస్థానానికి అందజేస్తారు. ఇలా భక్తులు సమర్పించిన ఆవులు, కోడెలను చెర్వుగట్టు నుంచి నార్కట్‌పల్లికి వచ్చే దారిలో ఉన్న గోశాలలో సంరక్షిస్తున్నారు. దేవస్థానం అభివృద్ధిలో భాగంగా గుట్టపై చేపట్టిన కల్యాణ మండప విస్తరణ పనులతో వెలికితీసిన బండరాళ్లను దేవస్థానం భూమిలో పారబోశారు. రోజు మాదిరిగానే మేతకు వెళ్లిన ఓ కోడె బండరాళ్ల మధ్య తలపెట్టడంతో ఇరికింది. ఎవరూ గమనించకపోవడంతో ఊపిరాడక మృతి చెందింది. బండరాళ్ల మధ్య ఇరికి మృతిచెందిన కోడెను ఓ పశువుల కాపరి గుర్తించి, గోశాల బాధ్యులకు సమాచారం అందించాడు. ఎక్స్‌కవేటర్ సహాయంతో బండరాళ్లను తొలగించి అనంతరం ఖననం చేశారు.