Share News

నీరున్నా.. నిరుపయోగం

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:05 PM

ఒకప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే కరువు, వలసలకు ప్రసిద్ధి.. సమీపంలో రెండు నదులు ప్రవహిస్తున్నా పాలమూరు భూములకు సాగునీరు ఇచ్చుకోలేని దైన్యం ఆనాటిది.

నీరున్నా.. నిరుపయోగం
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి విడుదలవుతున్న నీరు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేటాయింపుల మేర జరగని వాటర్‌ లిఫ్టింగ్‌

నికర, వరద జలాలు రెండింటినీ వినియోగించుకోలేని పరిస్థితి

స్టోరేజీ రిజర్వాయర్లు లేకపోవడం, చెరువులపై ఆధారపడటమే కారణం

వరద రోజులు ఎక్కువగా నమోదు కాకపోతే ఆయకట్టుపై ప్రభావం

నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా1, 2, కోయిల్‌సాగర్‌ అన్నింటిదీ అదే దుస్థితి

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఒకప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే కరువు, వలసలకు ప్రసిద్ధి.. సమీపంలో రెండు నదులు ప్రవహిస్తున్నా పాలమూరు భూములకు సాగునీరు ఇచ్చుకోలేని దైన్యం ఆనాటిది. ఎప్పుడు చూసినా కరువు వార్తలే పతాక శీర్షికలో దర్శనమిస్తున్న తరుణంలో.. ఉమ్మడి జిల్లాలో సాగు, తాగునీటికి ఢోకా లేకుండా చేసేందుకు ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ఏళ్లుగా నాన్చి నాన్చి దాదాపు ఎనిమిదేళ్ల క్రితం నుంచి ఆ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని అందించడం ప్రారంభించారు. అయినా ఇప్పటికీ సాగునీటికి నోచుకోలేని భూములు లక్షల ఎకరాల్లో ఉన్నాయి. పీఆర్‌ఎల్‌ఐ మినహా మిగిలిన ఎత్తిపోతల పథకాలకు దాదాపు 100 టీఎంసీల నికర, వరద జలాలను కేటాయించగా దాదాపు 50 టీఎంసీల నీటిని మాత్రమే లిఫ్ట్‌ చేస్తున్నారు. గత సంవత్సరం మినహా దాదాపు ఎనిమిదేళ్లుగా కృష్ణానదికి సమృద్ధిగానే వరదలు వస్తున్నాయి. వందల టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతోంది. కానీ, కేటాయింపుల మేర నీటిని మాత్రం వినియోగించుకోవడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఆయా ఎత్తిపోతల పథకాల కింద నీటిని నిల్వ చేసుకోవడానికి సరిపడా నిల్వ సామర్థ్యం లేకపోవడం, కొన్ని రిజర్వాయర్లలో అసంపూర్తి పనుల వల్ల పూర్తిస్థాయిలో నింపుకోలేకపోవడం, డిస్ర్టిబ్యూటరీలు, ఫీడర్‌ఛానల్‌ వ్యవస్థను కాకుండా గొలుసుకట్టు చెరువులపై ఆధారపడటమేనని చెప్పవచ్చు. వర్షాధారంగా గొలుసుకట్టు చెరువులు మెజారిటీ సంవత్సరాల్లో నిండుతుండటంతో నీటిని లిఫ్ట్‌ చేస్తే స్టోరేజీకి వసతి లేకపోవడం, ఆయకట్టు ప్రత్యేకంగా డిస్ర్టిబ్యూటరీ, ఫీడర్‌ ఛానల్‌ వ్యవస్థ ద్వారా స్థిరీకరించకపోవడం వల్ల ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి. అదనపు రిజర్వాయర్లు లేదా ఆన్‌లైన్‌ రిజర్వాయర్లు నిర్మించాలని పాలమూరు అధ్యయన వేదిక, ఇతర పౌరసంఘాలు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ఒకటి రెండుచోట్ల మినహా ఎక్కడా పనులు ప్రారంభించలేదు. నెట్టెంపాడు, భీమా 1, 2, కోయిల్‌సాగర్‌, కల్వకుర్తి, ఆర్డీఎ్‌సకు ప్రత్యామ్నాయంగా నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతలు అన్నింటిలో కేటాయింపుల మేర లిఫ్టింగ్‌ జరగడం లేదు. వరద సమృద్ధిగా వస్తున్న సమయంలోనూ మోటార్లను నిలిపివేసుకోవాల్సిన దుస్థితి ఉంది.

మూడింట రెండొంతులే...

జవహర్‌ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద వరద రోజుల్లో 21.425 టీఎంసీలను జూరాల బ్యాక్‌ వాటర్‌ నుంచి లిఫ్ట్‌ చేసి జోగుళాంబ గద్వాల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీరందించేందుకు డిజైన్‌ చేశారు. ఈ పథకానికి ఇప్పటివరకు రూ. 2754 కోట్లు కేటాయించగా 1.42 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇందులో ప్రధానమైన 99బీ, సీ, డీ, 100 ప్యాకేజీలు రెండు దశాబ్దాలు గడిచినా పూర్తికాలేదు. వీటికింద దాదాపు 58 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలి. ఇప్పటివరకు నీరందిస్తున్నామని చెబుతున్న 1.42 లక్షల ఎకరాలకు కూడా నీరందడం లేదు. ర్యాలంపాడు లీకేజీల కారణంగా 4 టీఎంసీలకు బదులు 2 టీఎంసీల నీటిని మాత్రమే స్టోర్‌ చేస్తున్నారు. గడిచిన మూడు సంవత్సరాల నీటి లిఫ్టింగ్‌ను పరిశీలిస్తే 2021-22 వాటర్‌ ఇయర్‌లో 8.858 టీఎంసీలను లిఫ్ట్‌ చేయగా 2022-23 వాటర్‌ ఈయర్‌లో 6.621 టీఎంసీలు, 2023-24 వాటర్‌ ఇయర్‌లో 6.88 టీఎంసీల నీటిని మాత్రమే లిఫ్ట్‌ చేశారు. ఈ ఎత్తిపోతలకు మొత్తం 21.425 టీఎంసీల కేటాయింపులు ఉండగా.. 2021-22 మినహా మూడింట రెండొంతుల నీటిని కూడా లిఫ్ట్‌ చేసుకోలేని పరిస్థితి ఉన్నది. ఈ ఎత్తిపోతలు పూర్తిచేసి నీరందించాలంటే రూ. 242 కోట్లు అవసరం. అలాగే ఇటీవల ప్రభుత్వం ర్యాలంపాడు లీకేజీలను అరికట్టడానికి రూ. 153 కోట్లు అంచనా వేసింది.

కేఎల్‌ఐలో స్టోరేజీ కరువు...

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం అతి ఎక్కువ ఆయకట్టుకు నీరందిస్తున్న ఎత్తిపోతలు కల్వకుర్తి.. ఈ పథకం 3.65 లక్షల ఎకరాలకు నీరందించేందుకు శ్రీశైలం సోర్స్‌గా నిర్మించారు. 25 టీఎంసీల వరద జలాల ఆధారంగా నిర్మాణం చేపట్టగా గత బీఆర్‌ఎస్‌ 40 టీఎంసీలకు కేటాయింపులు, లక్ష ఎకరాల ఆయకట్టు వరకు పెంచింది. వరద వచ్చినప్పుడే ఎత్తిపోయాల్సిన పథకంలో స్టోరేజీ రిజర్వాయర్లను మాత్రం నిర్మించలేదు. కేవలం 4 టీఎంసీల మేరనే స్టోరేజీ కెపాసిటీ ఉన్నది. దీంతో గొలుసుకట్టు చెరువులను నింపడానికి నీటిని లిఫ్ట్‌ చేస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడు ఆటోమెటిక్‌గా చెరువులు నిండిపోతున్నాయి. ఈ పథకంలో 40 ఆన్‌లైన్‌ రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించగా బుద్ధారం, గణపసముద్రం చెరువులను మాత్రమే రిజర్వాయర్లుగా మారుస్తున్నారు. 2018లో 35 టీంఎసీలు, 2019లో 49 టీఎంసీలు, 2020లో 30 టీఎంసీలు, 2021లో 31.71టీఎంసీలు, 2022లో 37 టీఎంసీలు, 2023లో 30 టీఎంసీలను ఎత్తిపోసినట్లు గణంకాలు చెబుతున్నాయి. అయితే ఈ ఎత్తిపోసిన నీటిలో మిషన్‌ భగీరథ పథకానికి 7.50 టీఎంసీలను కేటాయిస్తున్నారు. అవిపోను మిగిలిన మొత్తం కేటాయింపుల మేర లిఫ్ట్‌ చేయడం లేదనే చెప్పవచ్చు. ప్రధానంగా స్టోరేజీ రిజర్వాయర్ల సమస్య ఎక్కువగా ఉన్నది. ప్రతీ నియోజకవర్గానికి 10 టీఎంసీల చొప్పున రిజర్వాయర్లు ఉండాలనే ప్రతిపాదన ఉండగా ఇప్పటికీ ఆచరణ సాధ్యం కావడం లేదు.

కేటాయింపుల్లో సగమే వినియోగం...

రాజీవ్‌ భీమా ఎత్తిపోతల పథకానికి 20 టీఎంసీల నికర జలాల కేటాయింపులు ఉన్నాయి. వాటిని రెండు దశల్లో ఎత్తిపోసి 2.03 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలి. కానీ, ఇప్పటివరకు సగం ఆయకట్టుకు మాత్రమే నీరందిస్తున్నారు. స్టేజ్‌-1 కింద 92 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉండగా.. ఒక్క భూత్పూరు రిజర్వాయర్‌ పూర్తికాగా సంగంబండ రిజర్వాయర్‌ ఇంకా పునరావసం, బండ పేల్చివేత పెండింగ్‌లోనే ఉండటంతో నీటిని కేటాయింపుల మేర లిఫ్ట్‌ చేసుకోవడం లేదు. స్టేజ్‌-2 కింద 1.11 లక్షల ఎకరాలకు నీరందించాల్సి ఉండగా 64,300 ఎకరాలకు మాత్రమే నీరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. శంకరసముద్రం, రంగసముద్రం రిజర్వాయర్ల పునరావాస సమస్యలు ఉండటంతో పూర్తిస్థాయిలో నింపడం లేదు. అలాగే చెరువులపై ఆధారపడటం వల్ల కూడా తక్కువ నీటిని లిఫ్ట్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మొత్తం కేటాయింపుల్లో 2021-22 వాటర్‌ ఈయర్‌లో 10.68 టీఎంసీలు, 2022-23 వాటర్‌ ఈయర్‌లో 10.63 టీఎంసీలు, 2023-24 వాటర్‌ ఈయర్‌లో 9.387 టీఎంసీలను మాత్రమే లిఫ్ట్‌ చేశారు. దీంతో ఈ లిఫ్ట్‌కు కేటాయించిన 20 టీఎంసీల్లో ఏడు టీఎంసీలను ఇటీవల కొడంగల్‌- నారాయణపేట ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌కు బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ జూరాలకు ఉన్న 11 టీఎంసీల కేటాయింపులో వినియోగించని 2.9 టీఎంసీలను నికర జలాలు కేటాయించగా అక్కడా అదే పరిస్థితి. 2021-22లో 2.04 టీఎంసీలు, 2022-23లో 0.46టీఎంసీలు, 2023-24లో 2.56టీఎంసీలను లిఫ్ట్‌ చేశారు.

ఆర్డీఎస్‌ వినియోగమేదీ..

రాజోలిబండ డైవర్షన్‌ స్కీం (ఆర్డీఎస్‌) కింద ఎడమ కాలువకు 17.1 టీఎంసీలను బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించగా అందులో 15.9 టీఎంసీలు మహబూబ్‌నగర్‌ వాటా, దీనిద్వారా 87500 ఎకరాలకు నీరివ్వాలి. కాలువ పొడవు ఎక్కువ కావడం, నీటి విడుదల సమయంలో కర్ణాటక ఎక్కువగా వాడుకోవడం, కాలువలకు మరమ్మతులు లేకపోవడం వంటి కారణాలతో దాదాపు ఆరు టీఎంసీలను కూడా వినియోగించుకోవడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా రాజోలి వద్ద తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం నిర్మించింది. దీనిద్వారా కాలువ ద్వారా వచ్చిన ఆయకట్టుపోను 55,600 ఎకరాలకు నీరివ్వాలి. ఇక్కడ బిగించిన పంపుల్లో ఒకటి మాత్రమే పనిచేస్తోంది. మూడు పంపులు పనిచేస్తే డెలివరీ సిస్టర్న్‌, కాలువల సామర్థ్యం సరిపోదు. అలాగే ఇక్కడ లిఫ్ట్‌ చేసిన నీటిని స్టోర్‌ చేసుకోవడానికి మల్లమ్మకుంట, జూలకల్‌, వల్లూరు రిజర్వాయర్లను నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ, కేవలం ఆర్డీఎస్‌ కాలువలో నీటిని వదిలి చేతులు దులుపుకున్నారు. 55,600 ఎకరాల్లో సగానికి కూడా నీరివ్వడం లేదు.

Updated Date - Sep 15 , 2024 | 11:05 PM