టైగర్ సఫారీ పునఃప్రారంభం
ABN , Publish Date - Oct 01 , 2024 | 10:47 PM
మూడు నెలల విరామం తర్వాత నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని పర్హాబాద్ చౌరస్తా వద్ద టైగర్ సఫారీ టూర్ ను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు.
మూడు కొత్త వాహనాలకు పూజలు చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ
మన్ననూర్, అక్టోబరు 1 : మూడు నెలల విరామం తర్వాత నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని పర్హాబాద్ చౌరస్తా వద్ద టైగర్ సఫారీ టూర్ ను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ యేడాది కొత్తగా వచ్చిన మూడు సఫారీ వాహనాలకు మంత్రి పూజలు నిర్వహించి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. టైగర్ సఫారీ లో నేచరల్ గైడ్లు, డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్న చెంచులతో కలిసి ఫొటోలు దిగి మాట్లాడారు. నల్లమలలో పర్యావరణహిత ఏకో టూరిజాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో రోహిత్ గోపిడి, ఎఫ్‌డీవో రామమూర్తి, మన్ననూరు రేంజ్ అధికారి దేవజ, డీఆర్‌వో రవి కుమార్, అచ్చంపేట మునిసిపల్ చైర్మన్ శ్రీనివాసులు, ఉమామహేశ్వర దేవస్థాన చైర్మన్ మాధవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఉదయం నుంచే సఫారీ
జంగల్ సఫారీ వాహనాల సర్వీసులు ఉదయం 6:30 నుంచి నాయంత్రం ఆరు గంటల వరకు పెంచుతున్నట్లు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట డీఎ్‌ఫవో రోహిత్ గోపిడి తెలిపారు. టైగర్ సఫారీ పున:ప్రారంభం సందర్భంగా ఫరహాబాద్ చౌరస్తా వద్ద వాహనాల డ్రైవర్లు, చెంచు నేచురల్ గైడ్లు, స్థానిక అటవీ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. పర్యాటకులతో డ్రైవర్లు, నేచురల్ గైడ్లు గౌరవంగా మసలుకోవాలని చెప్పారు. డ్రైవర్ల వేతనాలను రూ.12,000 నుంచి రూ.19,000లకు పెంచుతున్నట్లు తెలిపారు. ఒక వాహనంలో ఏడుగురికి మించి తీసుకెళ్లొద్దన్నారు. అడవిలో వన్యప్రాణులను చూసేందుకు పర్యాటకులు వాహనం దిగొద్దని, సిగరెట్లు కాల్చడం నిషేధమని, ప్లాస్టిక్ వస్తువులను తీసుకెళ్లొద్దని చెప్పారు. అందుకు డ్రైవర్లే బాధ్యత వహించాలన్నారు. ఇటీవలి వర్షాలకు బురదమయమైన దారిని సరిచేయాలని స్థానిక రేంజ్ బీట్ అధికారులను ఆదేశించారు.