త్వరలో పునరావాస పనులు
ABN , Publish Date - Oct 30 , 2024 | 12:12 AM
నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ అభయారణ్యంలోని గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అటవీ శాఖ జిల్లా అధికారి రోహిత్ గోపిడి వెల్లడించారు.
- డీఎఫ్‌వో రోహిత్ గోపిడి వెల్లడి
పెద్దకొత్తపల్లి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ అభయారణ్యంలోని గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అటవీ శాఖ జిల్లా అధికారి రోహిత్ గోపిడి వెల్లడించారు. జిల్లాలోని నల్లమల అప్పర్ ప్లాట్‌లో నివసిస్తున్న సార్లపల్లి, కుడిచింతల, బైలు, తాటిగుండాల, కొల్లంపెంట గ్రామాల ప్రజలకు మొదట విడతలో పెద్దకొత్తపల్లి మండలం బాచారం సమీపంలోని ఫారెస్టులో పునరావాసం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమ్రాబాద్, అచ్చంపేట, ఎంపీడీవోలు రామ్మూర్తి, తిరుమలరావు, నాలుగు గ్రామాల పునరావాస కమిటీ ప్రతినిఽధులతో కలిసి మంగళవారం డీఎఫ్‌వో బాచారం అడవిలో పునరావాస ప్రాంతాన్ని పరిశీలించారు. పులుల సంరక్షణ కోసం నల్లమలలోని నాలుగు గ్రామాలను మొదటి విడతలో బాచారం అటవీ ప్రాంతానికి తరలించినట్లు వెల్లడించారు. ఇందుకు నల్లమల అప్పర్ ప్లాట్ గ్రామాల ప్రజలు ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీకి అంగీకరించడంతో వారికి పునరావాసం కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. ఒక కుటుంబానికి రూ. 15 లక్షలు, 250 గజాలు నివాస స్థలం, అయిదు ఎకరాలు సాగు భూమి ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. రెండో విడతలో వటవర్లపల్లి గ్రామాన్ని బాచారం ప్రాంతానికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. బాచారం అటవీ ప్రాంతాన్ని సర్వే చేసి అందుకు సంబంధించిన రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. ఈ అటవీ భూమిని రెవెన్యూ శాఖ మార్పిడి చేసిన తరువాత బాచారం అటవీ ప్రాంతంలో పునరావాస కేంద్రంలో వివిధ నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు డీఎఫ్‌వో వెల్లడించారు. మొదటి, రెండు విడతల్లో కలిపి మొత్తం 1,167 కుటుంబాలకు పునరావాసం కల్పించినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పునరావాస పనులను రెండు, మూడు నెలల్లో చేపట్టనున్నట్లు తెలిపారు. వీరి వెంట కొల్లాపూర్ ఫారెస్టు రేంజర్ చంద్రశేఖర్, డిప్యూటీ రేంజర్ రాణి, సెక్షన్ ఆఫీసర్లు ధర్మ, రామాంజనేయులు, ప్రశాంత్‌రెడ్డి, బీట్ ఆఫీసర్ వెంకటేశ్, అప్పర్ ప్లాట్ పునరావాస గ్రామాలాభివృద్ధి కమిటీ చైర్మన్ సాయిబాబు ఉన్నారు.