Share News

నేడు పాలమూరుకు సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:10 AM

పాలమూరులో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర రైతు సదస్సులు రెండు రోజులు విజయవంతంగా పూర్తి కాగా, చివరి రోజు శనివారం సదస్సుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. మొదటి రోజు ఉమ్మడి జిల్లాకు చెందిన రైతులు వేలాదిగా తరలిరాగా, రెండో రోజు ఉమ్మడి పాలమూరుతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన రైతులు అధిక సంఖ్యలో తరలొచ్చారు. రైతుల రాకతో సదస్సుకు పండుగ కళ వచ్చింది.

నేడు పాలమూరుకు సీఎం రేవంత్‌రెడ్డి
సిద్ధమౌతున్న బహిరంగ సభా ప్రాంగణం

లక్ష మంది రైతులతో సదస్సు

ముఖ్యమంత్రి చెప్పే శుభవార్త కోసం ఎదురుచూపు

భారీ బందోబస్తు

మహబూబ్‌నగర్‌, నవంబరు 29: పాలమూరులో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర రైతు సదస్సులు రెండు రోజులు విజయవంతంగా పూర్తి కాగా, చివరి రోజు శనివారం సదస్సుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. మొదటి రోజు ఉమ్మడి జిల్లాకు చెందిన రైతులు వేలాదిగా తరలిరాగా, రెండో రోజు ఉమ్మడి పాలమూరుతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన రైతులు అధిక సంఖ్యలో తరలొచ్చారు. రైతుల రాకతో సదస్సుకు పండుగ కళ వచ్చింది. సీఎం సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభాప్రాంగణాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు. లక్ష మంది రైతులతో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఆయా నియోజకవర్గాలలో సన్నాహక సదస్సులు ఏర్పాటు చేసి, బూత్‌కు వంద మందిని సభకు తరలించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బస్సులు, ఇతర వాహనాలలో రైతులను, జనాలను సభకు తరలించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో ప్రతిష్టాత్మకంగా రైతు పండగ సభలు నిర్వహిస్తుండటం, రైతులకు సీఎం శుభవార్త చెబుతారని మంత్రులు చెబుతుండటంతో ఆ వార్త కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల మందికి రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేశారు. రూ.రెండు లక్షలలోపు రుణాలు తీసుకున్న పలువురు రైతులకు సాంకేతిక కారణాల వల్ల మాఫీ కాలేదు. వారి మాఫీపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని, అదేవిధంగా రూ.రెండు లక్షలపైన రుణం ఉన్న రైతుల విషయంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక రైతులనుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యానికి వెంటనే వారి ఖాతాల్లో డబ్బులు జమచేయడం, సన్న వడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తున్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యం మొత్తానికి బకాయి లేకుండా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. శనివారం సాయంత్రం వరకు బోనస్‌ మొత్తం చెల్లించనున్నారు. ఇక రైతు భరోసాపై ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ ఏడాది వానాకాలం రైతుభరోసా ఇవ్వలేదు. సంక్రాంతి లోపు ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎకరాకు పెంచుతామన్న రూ.15 వేలు ఇస్తారా?.. ఎన్ని ఎకరాలకు ఇస్తారు?.. నిబంధనలు ఏంటన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. సంక్రాంతికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉండటంతో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందుగానే ఆసరా పింఛన్‌పై ఇచ్చిన హామీపై శుభవార్త చెబుతారా అన్న ప్రచారం సాగుతోంది.

సీఎం సభకు భారీ బందోబస్తు

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీ్‌సశాఖ అలర్ట్‌ అయ్యింది. ఐజీ సత్యనారాయణ, మహబూబ్‌నగర్‌ ఎస్పీ జానకి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పోలీసులతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన దాదాపు రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

పార్కింగ్‌ల కోసం

సీఎం సభకు పెద్ద సంఖ్యలో వాహనాలు వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్‌లను సిద్ధం చేశారు. అందుకు రెండు చోట్ల స్థలాలను కేటాయించారు. హైదరబాద్‌ నుంచి జడ్చర్ల మీదుగా వచ్చే వాహనాలు జడ్చర్ల ఫ్లైఓవర్‌ ఎక్కడకుండా కిందినుంచి మహబూబ్‌నగర్‌ రూట్‌లో వచ్చి, పిస్తాహౌస్‌ నుంచి బైపాస్‌ మీదుగా భూత్పూర్‌ రోడ్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి భూత్పూర్‌ వెళ్ళే దారిలో గిరిధారి వెంచర్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన పార్కింగ్‌ 1లో వారు వాహనాలు పార్కింగ్‌ చేయాలి. మక్తల్‌, నారాయణపేట, కోడంగల్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు కూడా వన్‌టౌన్‌ మీదుగా వెళ్లి పార్కింగ్‌ 1లోనే పార్కింగ్‌ చేయాలి. గద్వాల, అలంపూర్‌, వనపర్తి, బిజినపల్లి నుంచి వచ్చే వాహనాలు భూత్పూర్‌ ఫ్లైఓవర్‌ దిగగానే ఎడమవైపు టర్న్‌ తీసుకుని భూత్పూర్‌ పార్కింగ్‌ 2లో పార్క్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

ట్రాఫిక్‌ మళ్లింపు

మహబూబ్‌నగర్‌- భూత్పూర్‌ రహదారిలో రాకపోకలు సాగించే జనరల్‌ వాహనాలన్నింటిని శనివారం మధ్యాహ్నం ఒంటి గంటనుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దారి మళ్లించారు. భూత్పూర్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వచ్చే వాహనాలు జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్‌ రూట్‌లో వెళ్లి పిస్తాహౌస్‌ వద్ద బైపాస్‌ మీదుగా మహబూబ్‌నగర్‌కు, మహబూబ్‌నగర్‌ నుంచి భూత్పూర్‌ వెళ్లే వాహనాలు భూత్పూర్‌ రోడ్‌లో బైపాస్‌ వద్ద మళ్లి పిస్తాహౌస్‌ మీదుగా జడ్చర్లకు, అక్కడినుంచి భూత్పూర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

పర్యటన షెడ్యూల్‌ ఇలా..

మహబూబ్‌నగర్‌, నవంబరు 29 (ఆంరఽధజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 3:30కు పాలమూరుకు వస్తారు. 3:45 నుంచి 4:15 గంటల వరకు అమిస్తాపూర్‌ దగ్గర ఏర్పాటు చేసిన రైతు పండగ ఎగ్జిబిషన్‌ పరిశీలిస్తారు. 4:30కు రైతు సభలో పాల్గొంటారు. సాయంత్రం ఆరు గంటలకు రోడ్డుమార్గం ద్వారా హైదరాబాద్‌ వెళ్తారు.

Updated Date - Nov 30 , 2024 | 12:10 AM