Share News

సైబర్‌ నేరగాళ్ల అరెస్టు

ABN , Publish Date - Oct 01 , 2024 | 10:46 PM

వనపర్తి జిల్లాకు చెందిన ముగ్గురు సైబర్‌ నేరగాళ్లను పట్టుకుని, వారి నుంచి రూ. 25 లక్షల విలువ గల భూమి పత్రాలతో పాటు, వాహనాలు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సైబర్‌ సెక్యూరిటీ డీఎస్పీ రత్నం మంగళవారం తెలిపారు.

సైబర్‌ నేరగాళ్ల అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న సైబర్‌ సెక్యూరిటీ డీఎస్పీ రత్నం

పశ్చిమ బెంగాల్‌లో శిక్షణ తీసుకున్న ముగ్గురు వనపర్తి జిల్లావాసులు

వారి నుంచి రూ.25 లక్షల విలువైన సొత్తు, వాహనాలు, ఫోన్లు స్వాధీనం

సైబర్‌ సెక్యూరిటీ డీఎస్పీ రత్నం

కొత్తకోట, అక్టోబరు 1: వనపర్తి జిల్లాకు చెందిన ముగ్గురు సైబర్‌ నేరగాళ్లను పట్టుకుని, వారి నుంచి రూ. 25 లక్షల విలువ గల భూమి పత్రాలతో పాటు, వాహనాలు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సైబర్‌ సెక్యూరిటీ డీఎస్పీ రత్నం మంగళవారం తెలిపారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పెద్దమందడి మండలం పిల్లికుంట తండాకు చెందిన దినేష్‌, విజయ్‌, నరేష్‌ 2022లో పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి సైబర్‌ నేరగాళ్లతో శిక్షణ తీసుకున్నారని చెప్పారు. వారి ఆదేశాల మేరకు ముద్ర, ధ్వని యాప్‌ల లింకులు సెల్‌ ఫోన్‌లకు పంపేవారని తెలిపారు. లైనులోకి వచ్చిన వారికి కొంత నగదు జమ చేస్తే మీరు అడిగినంత లోను వస్తుందని నమ్మబలికి, రూ.లక్షలు కాజేశారని వివరించారు. అలా మోసపోయిన కొత్తకోటకు చెందిన కుమ్మరి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని, విచారణ చేపట్టామని చెప్పారు. రాజు ఇచ్చిన ఆధారాలతో ఆరా తీయగా.. దినేష్‌, విజయ్‌, నరేష్‌ పట్టుపడ్డారన్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా సైబర్‌ నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వారి నుంచి రూ.25 లక్షల విలువ గల ఒక ప్లాటు, పది కుంటల భూమి రిజిస్టేషన్‌ డ్యాకుమెంట్లు, ఒక కారు, ఒక బుల్లెట్‌, తొమ్మిది ఫోన్లు, ఐదు సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సమావేశంలో సీఐ రాంబాబు, ఎస్‌ఐ మంజునాథ్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Oct 01 , 2024 | 10:46 PM