దీక్షాదివస్ స్ఫూర్తిగా మరో పోరు
ABN , Publish Date - Nov 30 , 2024 | 04:23 AM
‘దీక్షా దివ్‌సను, కేసీఆర్ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరోసారి కదనరంగంలోకి దిగుదాం. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుదాం’.. అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీ రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచుదాం
తెలంగాణలో ఏ వర్గమూ సంతోషంగా లేదు
ఈపాటి పాలనకు విజయోత్సవాలు ఎందుకు?
కేసీఆర్ కాలిగోటికి రేవంత్ సరిపోడు
కేసీఆర్ త్యాగాల్ని నేటి తరానికి చెప్పాలి: కేటీఆర్
బంగారు తెలంగాణను ఆగం పట్టిస్తున్నారు: హరీశ్
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్) : ‘దీక్షా దివ్‌సను, కేసీఆర్ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరోసారి కదనరంగంలోకి దిగుదాం. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుదాం’.. అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీ రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో, పార్లమెంటులో, ప్రతి వేదికపైనా తెలంగాణ పక్షాన గొంతు విప్పుతూనే ఉందామని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజును గుర్తు చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా దీక్షాదివస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ర్యాలీలు, సభలతోపాటు ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ తదితర సేవాకార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్, హైదరాబాద్‌లో కేటీఆర్, సిద్దిపేటలో హరీశ్‌రావు, ఆయా జిల్లాల పరిధిలో మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌లో నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అడ్రస్ లేనోడు, ఉద్యమ సమయంలో మనమీదికి తుపాకీ తీసుకువచ్చినోడు.. ఈ రోజు మనల్ని తిడుతున్నాడని సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. హిమాలయాలంతటి సమున్నతుడైన కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్‌రెడ్డి సరిపోడన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, గురుకులంలో ఉండే పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం పెట్టే దిక్కుమాలిన బువ్వతిని విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారని విమర్శించారు. ఈపాటి పరిపాలనకు విజయోత్సవాలా అంటూ ఎద్దేవా చేశారు. పోలీసోళ్లు లేకుండా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఊళ్ళకి పోతే ప్రజలు తరిమి కొడతారన్నారు.
కాంగ్రెస్ వల్లే బలిదానాలు
కాంగ్రెస్ పార్టీ కర్కశత్వం వల్ల 2009 నుంచి 2014 వరకు వందలాది మంది పిల్లలు ఆత్మబలిదానాలు చేసుకున్నారని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష.. ఉద్యమానికి పతాక సన్నివేశంగా మారిందని, ఆ తర్వాత ఐదేండ్ల పాటు తెలంగాణ కోసం కేసీఆర్ వివిధ రూపాల్లో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిండని ఇప్పటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ 2001లో తెలంగాణ కోసం పార్టీ పెట్టినపుడు ఆయనకు 46 ఏళ్ళు మాత్రమేనని... ఆయనకు పదవుల మీద మోజు ఉంటే అప్పటి ముఖ్యమంత్రి ఇచ్చిన మంత్రి పదవిని తీసుకొని హాయిగా ఉండేవాడన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరముందని కేటీఆర్ అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇప్పుడు తెలంగాణ భవన్ గుర్తుకువస్తోందని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ చేసిన పోరాటం వల్లే.. లగచర్ల భూముల సేకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తగ్గిందన్నారు. గుజరాత్ గులాంలు ఓవైపు.. ఢిల్లీ కీలుబొమ్మలు మరోవైపు తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తున్నారని, కాంగ్రెస్, బీజేపీలను ఉద్దేశించి విమర్శించారు.
ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు: మల్లారెడ్డి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన దీక్షాదివ్‌సలో ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ, నాయకులకెప్పుడూ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని.. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే అధికారం పోయిందన్నారు. ప్రజల్లో పైసలు పని చేయవని, నాయకులు కావాలనుకునే వారు ప్రజల ప్రేమ ఆప్యాయతలను సంపాదించాలని, అది సాధిస్తే.. ఇంట్లో కూర్చున్నా జనం ఓట్లేస్తారన్నారు. వరంగల్‌లో జరిగిన దీక్షా దివ్‌సలో ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.. జమిలి ఎన్నికలు రాబోతున్నాయి. మళ్లీ కేసీఆరే సీఎం అవుతారు. కార్యకర్తలెవరు ఆధైర్యపడొద్దు’ అని చెప్పారు.
అలాంటి దొంగలను మళ్లీ రానివ్వం: హరీశ్‌రావు
సిద్దిపేటలోని బీఆర్‌ఎస్ భవన్‌లో నిర్వహించిన దీక్షాదివ్‌సలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కొంతమంది బీఆర్‌ఎ్‌సలో చేరి పదేళ్లపాటు పందికొక్కుల్లా తిని ఇప్పుడు పార్టీని వదిలి పోయారని, అలాంటి దొంగలను మళ్లీ రానివ్వబోమని హెచ్చరించారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ నిబద్ధత, నిజాయితీ గురించి కాంగ్రెస్ అగ్రనేతలకు తెలుసని.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి తన ఆత్మకథలో కూడా కేసీఆర్ గురించి గొప్పగా ప్రస్తావించారని వివరించారు. బంగారు తెలంగాణగా పరుగులు పెట్టిన రాష్ట్రాన్ని రేవంత్‌రెడ్డి ఆగం చేస్తున్నాడని విమర్శించారు.