Share News

వేతనాలు రాక మెప్మా ఆర్పీల విలవిల

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:52 AM

జగిత్యాల జిల్లాలోని పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌లుగా సేవలందిస్తున్న చిరు ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందక విలవిల్లాడుతున్నారు. అరకొర వేతనం అందిస్తున్నప్పటికీ నెల నెల విడుదల చేయకపోవడంతో ఆర్థిక ఇక్కట్లకు గురవుతున్నారు. మున్సిపాలిటీల్లో స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించాలన్నా..ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయాలన్నా మెప్మా ఆర్పీల పాత్ర కీలకంగా ఉంటుంది.

వేతనాలు రాక మెప్మా ఆర్పీల విలవిల

- నెలనెలా అందక ఆర్థిక ఇక్కట్లు

- పెండింగ్‌ వేతనాల మంజూరుకు తప్పని ఎదురుచూపులు

- జగిత్యాల జిల్లాలో 173 మెప్మా రిసోర్స్‌పర్సన్‌లు

- వేతన బకాయిలు రూ. 51.90 లక్షలు

జగిత్యాల, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలోని పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌లుగా సేవలందిస్తున్న చిరు ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందక విలవిల్లాడుతున్నారు. అరకొర వేతనం అందిస్తున్నప్పటికీ నెల నెల విడుదల చేయకపోవడంతో ఆర్థిక ఇక్కట్లకు గురవుతున్నారు. మున్సిపాలిటీల్లో స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించాలన్నా..ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయాలన్నా మెప్మా ఆర్పీల పాత్ర కీలకంగా ఉంటుంది. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలోనూ ఆర్పీలు తమదైన బాధ్యతలను నిర్వర్తించారు. మహిళ సంఘాల సభ్యుల సమస్యల పరిష్కారం, రుణాల అందజేత, రికవరీ తదితర వాటిల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆర్‌పీలకు అయిదు నెలలుగా వేతనం అందడం లేదు.

అన్ని మున్సిపాలిటీల్లోనూ..

జగిత్యాల జిల్లాలోని అయిదు మున్సిపాలిటీల్లో కలిపి 173 మంది క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌లున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో గల 5,337 స్వయం సహాయక మహిళా సంఘాల్లో గల 58,043 మంది సభ్యులకు అవసరమైన బ్యాంకు, ఇతర సేవలను ఆర్‌పీలు అందిస్తున్నారు. ఇందులో జగిత్యాలలో 61 మంది, కోరుట్లలో 50, మెట్‌పల్లిలో 34, రాయికల్‌లో 16, ధర్మపురి మున్సిపాలిటీలో 12 మంది రిసోర్స్‌ పర్సన్‌లు పనిచేస్తున్నారు. మున్సిపాలిటీల్లో 15 నుంచి 20 మహిళా సంఘాలకు ఓ వార్డు సమాఖ్య ఉంటుంది. ప్రతీ సమాఖ్య పరిధిలో ఒక రిసోర్స్‌ పర్సన్‌ పనిచేస్తారు. మహిళా సంఘాల సమావేశాల నిర్వహణ, రికార్డులు, బ్యాంకు రుణాలు ఇప్పించడం, వాయిదాలు సకాలంలో చెల్లించడం, రికవరీ తదితర బాధ్యతలను నిర్వర్తిస్తుంటారు. వీరికి నెలకు రూ. 6 వేతనం చెల్లిస్తున్నారు. ఈ వేతనం మెప్మా మహిళా సమాఖ్య ఖాతాలో జమ చేస్తారు. సమాఖ్య నుంచి వేతనం మొత్తాన్ని ఆర్‌పీలు తీసుకుంటారు. సమాఖ్య లాభాల్లో ఉంటే నెలకు రూ. 2 వేలు అదనపు వేతనం ఆర్‌పీలకు అందుతుంది. వీరికి ప్రస్తుత యేడాది జూన్‌ నుంచి వేతనాలు అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా గల 173 మంది ఆర్‌పీలకు అయిదు నెలలకు కలిపి రూ. 51.90 లక్షల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. పెండింగ్‌ వేతనాల విడుదల కోసం మెప్మా రిసోర్స్‌ పర్సన్‌లు ఎదురుచూస్తున్నారు.

వేతన బకాయిలు విడుదల చేయాలి

- ఎం అనిత, మెప్మా రిసోర్స్‌పర్సన్‌, కోరుట్ల, జగిత్యాల జిల్లా

అయిదు నెలల వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలి. చాలీ చాలని వేతనం ఇస్తూ అదికూడా నెల నెల అందించకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. మెప్మా రిసోర్స్‌ పర్సన్‌ల సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరం. స్వయం సహాయక మహిళా సంఘాల పనులతో పాటు ప్రభుత్వం అమలు చేసే పలు కార్యక్రమాలల్లో భాగస్వామ్యం అవుతున్నాము.

వేతనం తక్కువే...అది కూడా సమయానికి రావడం లేదు

- కొయ్యాడ రమాదేవీ, మెప్మా రిసోర్స్‌ పర్సన్‌, జగిత్యాల జిల్లా

మున్సిపాలిటీల్లో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిరంతరం సేవలు అందిస్తున్న మెప్మా రిసోర్స్‌ పర్సన్‌లకు అందిస్తున్న వేతనం తక్కువే..అదికూడా సమాయానికి అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. నెల నెల వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి.

బకాయిలు విడుదల కావాల్సి ఉంది

- శ్రీనివాస్‌, మెప్మా ఏవో, జగిత్యాల జిల్లా

జగిత్యాల జిల్లాలోని మెప్మా రిసోర్స్‌ పర్సన్స్‌లకు వేతన బకాయిలు విడుదల కావాల్సి ఉంది. అయిదు నెలల వేతనాల విడుదలపై ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం అందించాము. బడ్జెట్‌ విడుదల చేయగానే వేతనాలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాము.

Updated Date - Nov 30 , 2024 | 12:52 AM