Share News

నేత కార్మికులు స్వతంత్రంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:51 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎటువంటి సంక్షోభమూ ఉండకూడదని, నేత కార్మికులు ఇతరులపై ఆధాపరపడకుండా స్వతంత్రంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజ రామయ్యర్‌ అన్నారు. వేములవాడ ఆలయ గెస్ట్‌హౌస్‌లో నేత కార్మికుల సమస్యలు, వస్త్ర పరిశ్రమ అభివృద్ధి పెండింగ్‌ బకాయిలు, ఆర్డర్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

నేత కార్మికులు స్వతంత్రంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి
సమీక్షలో మాట్లాడుతున్న శైలజ రామయ్యర్‌

వేములవాడ కల్చరల్‌, అక్టోబరు 1 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎటువంటి సంక్షోభమూ ఉండకూడదని, నేత కార్మికులు ఇతరులపై ఆధాపరపడకుండా స్వతంత్రంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజ రామయ్యర్‌ అన్నారు. వేములవాడ ఆలయ గెస్ట్‌హౌస్‌లో నేత కార్మికుల సమస్యలు, వస్త్ర పరిశ్రమ అభివృద్ధి పెండింగ్‌ బకాయిలు, ఆర్డర్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేత కార్మికులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. జిల్లాలో నూలు డిపోల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పెండింగ్‌ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించామని, మిగిలి ఉంటే వాటి చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలంగాణలోని మహిళా సంఘాలకు 2 చీరల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీని ద్వారా నేత కార్మికులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. మహిళా సంఘాలకు యూనిఫాం విధంగా ఆ చీర ఉండాలని సీఎం ఆలోచిస్తున్నారని, దానికి కొత్త బ్రాండ్‌ ఇమేజ్‌ రావాలని అన్నారు. మహిళా గ్రూప్‌లతో, చేనేత పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడామని, పాలిస్టర్‌ చీర జరీ అంచు ఉంటుందని అన్నారు. ఆధునికంగా ఉండే విధంగా చీరలు తయారు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. సిరిసిల్ల జిల్లాలో స్వతంత్రంగా ఆ చీరలు తయారు చేసే అవకాశం కల్పించాలని ఆసాములు కోరడంతో ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేసిందని, దానికి తగిన విధంగా చర్యలు చేపట్టిందని అన్నారు. నూలు డిపో పెట్టిన తర్వాత దాని తరలింపు బాధ్యత ఆసాములదేనన్నారు. సొసైటీకి నూలు అప్పగించిన తర్వాత లాభాలను సేట్లు, ఆసాములు, వర్కర్లు ఎలా తీసుకుంటారనే అంశాలను వివరించాలన్నారు. ప్రస్తుతం వచ్చే లాభం ఆసాములకు చేరాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. వంద శాతం దీనిపై ఆధారపడకుండా ప్రైవేటు మార్కెట్‌లోనూ చేనేతలు రాణించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. హైదరాబాద్‌లో కోఠి, బేగం బజార్‌, ప్యారడైస్‌ చుట్టు పక్కల ఉన్న ప్రాసెసింగ్‌ యూనిట్‌ సూరత్‌ నుంచి తెచ్చి ప్రింటింగ్‌ చేస్తున్నారని, మన సిరిసిల్ల చేనేతల అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. అంతకుముందు వేములవాడ రాజన్న ఆలయంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ స్వాగతం పలికారు.

చేనేత సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలం

చేనేత సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉన్నారని, చేనేత రంగంలోని అనుభవం కలిగిన ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ప్రత్యేక శ్రద్ధతో జిల్లా పరిధిలోని సమస్యలను ఒక్కోటిగా పరిష్కరిస్తున్నారని ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. గత ప్రభుత్వం పెట్టిన రూ. 190 కోట్ల బకాయిలను విడుదల చేసి పరిష్కరించడమే దీనికి నిదర్శనమన్నారు. టెస్కో జీఎం అశోక్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త పథకాలతో దీర్ఘకాలంలో నేత కార్మికులకు లాభం చేకూరుతుందన్నారు. టెస్కో అందించే ఆర్డర్లతోపాటు ప్రైవేటు రంగంలో అకాశాలను చేనేతలు అందిపుచ్చుకోవాలన్నారు. సమావేశంలో కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, టెస్కో జీఎం అశోక్‌రావు, హ్యాండ్లూమ్‌ ఏడీ సాగర్‌, నేత కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:51 AM