Share News

నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:42 AM

గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ అన్నారు. బుధవారం గణేష్‌ ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు.

నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌, అధికారులు

- మండపాల వద్ద శానిటేషన్‌ తప్పనిసరిగా చేయించాలి

- కలెక్టర్‌ బి సత్యప్రసాద్‌

జగిత్యాల, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ అన్నారు. బుధవారం గణేష్‌ ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రజలంతా ఐక్యమత్యంతో చేసుకోవాలని కోరారు. పోలీస్‌శాఖ నిబంధన మేరకు రెండు సౌండ్‌బాక్స్‌లు మాత్రమే పెట్టుకోవాలన్నారు. నిర్వాహకులు ఏ రోజు నిమజ్జనం చేస్తారో పోలీస్‌శాఖవారికి ముందస్తుగా తెలియపరచాలన్నారు. ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జనం పూర్తయ్యేవరకు ఆయా శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఎస్పీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లా లోని అన్ని మండపాల నిర్వాహకులు తమ గణపతుల సమగ్ర సమాచారాన్ని పోలీస్‌వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. విగ్రహాలను నిర్ణీత సమయానికి నిమజ్జనం చేసేలా అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, గౌతమ్‌రెడ్డి, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు మధుసూదన్‌, ఆనంద్‌కుమార్‌, శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ ఏవో హన్మంతరావు, డీపీవో రఘువరణ్‌, వివిధశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- మట్టి వినాయక ప్రతిమలను పూజించాలి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను పూజించాల్సిన అవసరముందని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో గల తన చాంబర్‌లో కాలుష్య నియంత్రణ మండలి ఆద్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్లను వివిధ విభాగాలకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మాట్లాడారు. సాంప్రదాయబద్ధంగా గణేష్‌ చవితిని జరుపుకోవాలని సూచించారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను కాకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించాలని తెలిపారు. కాలుష్యనియంత్రణ మండలి ఆద్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వేల మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ కార్యాలయ ఏవో హన్మంత్‌ రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్‌ సహాయక శాస్త్రవేత్త కనక జ్యోతి, జిల్లా సంక్షేమ అధికారి నరేశ్‌, కలెక్టరేట్‌ కార్యాలయ పలువురు సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:42 AM