Share News

నిమజ్జనానికి అందరూ సహకరించాలి

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:58 PM

: గణేష్‌ నిమజ్జనానికి ప్రభుత్వం తరుపున అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనానికి ప్రజలందరు సహకరించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. మానకొండూర్‌ చెరువు వద్ద జరిగే నిమజ్జన ఉత్సవాల ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు.

 నిమజ్జనానికి అందరూ సహకరించాలి

మానకొండూర్‌, సెప్టెంబరు 15 : గణేష్‌ నిమజ్జనానికి ప్రభుత్వం తరుపున అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనానికి ప్రజలందరు సహకరించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. మానకొండూర్‌ చెరువు వద్ద జరిగే నిమజ్జన ఉత్సవాల ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సోమవారం కరీంనగర్‌లోని విగ్రహాలను మానకొండూర్‌, కొత్తపల్లి, చింతకుంటలో నిమజ్జనం చేస్తారన్నారు. దీనికి సంబంధించి మున్సిపల్‌ యంత్రాంగం, వివిధ శాఖల అఽధికారులు సమన్వయంతో గణేష్‌ నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. మానకొండూర్‌ చెరువు కట్టపై జరిగే నిమజ్జనంలో ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్‌, మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. శోభాయాత్ర సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు నిమజ్జనం జరిగే ప్రదేశంలో లైటింగ్‌ ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం గణేష్‌ మండపాలకు ఉచిత విద్యుత్‌ను అందించిందన్నారు. అధికారులతో నిర్వహకులు, గణేష్‌ ఉత్సవ సమితి, వీహెచ్‌పీతో సమన్వయం చేసుకుని పని చేయాలని కోరారు. గణేశుడి ఆశీర్వాదంతో నిమజ్జన కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్వక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగే నిమజ్జనంపై ఎలాంటి సందేహం లేదని, గతంలో జరిగిన దాని కంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేసిందన్నారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్‌, వాటర్‌ వర్క్స్‌, వివిద శాఖల అధికారుల సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. 17న హైదరాబాద్‌లో సెలవు ఉన్నందున త్వరగా నిమజ్జనం పూర్తి చేయాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ని దెబ్బ తీసేందుకు ప్రతి పక్షాలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. శాంతి భద్రతలకు విఘాతం జరిగితే ఉపేక్షించేది లేదని అలాంటి వారిపై కఠినంగా వ్వవహరించాలని పోలీస్‌ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పార్టీ ఫిరాయింపుల విషయం హైకోర్టులో ఉందని, అది శాసన సభ చూసుకుంటుందన్నారు. రాజకీయ విమర్శలు చేసి పోట్లాడుకోవాలనుకుంటే నిమజ్జనం తర్వాత అని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే ఏ పార్టీనైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

అధికారులు సమన్వయంతో పని చేయాలి

జిల్లాలోని అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేసి గణేష్‌ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులకు సూచించారు. మానకొండూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం గణేష్‌ నిమజ్జనంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానకొండూర్‌ చెరువుకట్టపై సొమవారం జరిగే గణేష్‌ నిమజ్జన ఉత్సవాలను అందిరి సహకారంతో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా, ఉత్సాహంగా నిమజ్జనంలో భక్తులు, నిర్వాహకులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని టవర్‌ సర్కిల్‌ వద్ద తొలి వినాయక ఊరేగింపు ఆరు గంటలకు మొదలవుతుందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా గణేష్‌ ఉత్సవాలకు అందరిని ఆహ్వానించి ఉత్సవాల్లో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్‌ కోసం తగిన ఏర్పాట్లు చేసి ట్రాఫిక్‌ సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మండల కేంద్రంలో గణేష్‌ నిమజ్జనం పూర్తయ్యేంత వరకు అధికారులంతా అందుబాటులో ఉండాలని కోరారు. అవసరమైతే షిఫ్టుల వారిగా విధులు నిర్వహించాలని సూచించారు. పోలీస్‌ సిబ్బందికి సహకరించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. నిమజ్జనం పూర్తి అయిన వెంటనే చెత్తా చెదారాన్ని పూర్తి స్థాయిలో తొలగించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు ప్రపుల్‌ దేశాయ్‌, లక్ష్మికిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, తహసీల్దార్‌ రాజేశ్వరీ, ఎంపీడీవో వరలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:58 PM