Share News

గ్రామీణ రోడ్లకు మహర్దశ

ABN , Publish Date - Feb 13 , 2024 | 01:53 AM

జిల్లాలోని గ్రామాల్లోగల మట్టి రోడ్లకు మహర్దశ పట్టనున్నది.

గ్రామీణ రోడ్లకు మహర్దశ

- రూ.40.33 కోట్లతో 431 రోడ్లు మంజూరు

- ఉపాధిహామీ నిధులతో నిర్మాణం

- తర్వలో ప్రారంభంకానున్న పనులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలోని గ్రామాల్లోగల మట్టి రోడ్లకు మహర్దశ పట్టనున్నది. ఉపాధిహామీ పథకం ద్వారా జిల్లాలోని 431 సిమెంట్‌ రోడ్ల నిర్మాణానికి 40 కోట్ల 33 లక్షల రూపాయల నిధులు మంజూరుచేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో ఈ పనులను చేపట్టనున్నారు. జిల్లాలో మహాత్మా గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా 1,17,396 జాబ్‌ కార్డులను జారీచేయగా, 2,56,869 మంది కూలీలు నమోదై ఉన్నారు. ఉపాధిహామీ చట్టం ప్రకారం కేటాయించే బడ్జెట్‌లో తప్పనిసరిగా కూలీల వేతనాల కోసం 60 శాతం, మెటీరియల్‌ కంపోనెంట్‌ కింద 40 శాతం డబ్బులను వెచ్చించాల్సి ఉంటుంది. కూలీలు ఎంత ఎక్కువ పని చేస్తే మెటీరియల్‌ కంపోనెంట్‌ కింద ఎక్కువ పనులు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు 100 రూపాయలకు 60 కూలీలకు ఖర్చు చేస్తే, 40 రూపాయలు మెటీరియల్‌ కోసం వెచ్చించే అవకాశాలు కల్పించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం గ్రామాలకు వరంగా మారింది. ప్రతి ఏటా ఉపాధి కూలీలకు పనులు కల్పించడంతో పాటు మెటీరియల్‌ కంపోనెంట్‌ పనుల కింద శాశ్వత నిర్మాణ పనులను చేపడుతున్నారు. ప్రధానంగా గ్రామాల్లో మురికి కాలువలు, సిమెంట్‌ రోడ్లు, డంపింగ్‌ యార్డులు, సెగ్రిగేషన్‌ షెడ్లు, స్వశక్తి సంఘాల భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, రైతు వేదికల వంటి పనులను చేపట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన లేబర్‌ కంపోనెంట్‌ పనుల ద్వారా జనరేట్‌ అయ్యే మెటీరియల్‌ కంపోనెంట్‌ కింద మొత్తం సిమెంట్‌ రోడ్ల పనులనే చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. ఆ మేరకు గ్రామాల వారీగా ఉపాధిహామీ కూలీలు చేపట్టిన పనుల ఆధారంగా ఆయా గ్రామాల్లోని వీధుల్లో సిమెంట్‌ రోడ్లను నిర్మించనున్నారు.

ఫ నామినేషన్‌ ప్రాతిపదికన..

మంథని నియోజకవర్గంలోని మంథని మండలంలో 88 పనులకు 8 కోట్ల 17 లక్షల రూపాయలు, కమాన్‌పూర్‌ మండలంలో 30 పనులకు 2 కోట్ల ఒక లక్ష రూపాయలు, రామగిరి మండలంలో 51 పనులకు 4 కోట్ల 98 లక్షల రూపాయలు, ముత్తారం మండలంలో 65 పనులకు 6 కోట్ల 55 లక్షల రూపాయలు మంజూరు చేశారు. రామగుండం నియోజకవర్గం పరిధిలోని అంతర్గాం మండలంలో 12 పనులకు 2 కోట్ల 63 లక్షల 50 వేల రూపాయలు, పాలకుర్తి మండలంలో 24 పనులకు 3 కోట్ల 79 లక్షల రూపాయలు, ధర్మారం మండలంలో 24 పనులకు 2 కోట్ల 60 లక్షల రూపాయలు, ధర్మపురి నియోజకవర్గం పరిధిలోని ధర్మారం నియోజకవర్గంలో 24 పనులకు 2 కోట్ల 60 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని పెద్దపల్లి మండలంలో 31 పనులకు 2 కోట్ల 25 లక్షల రూపాయలు, జూలపల్లి మండలంలో 16 పనులకు 95 లక్షల రూపాయలు, సుల్తానాబాద్‌ మండలంలో 29 పనులకు కోటి 85 లక్షల రూపాయలు, ఓదెల మండలంలో 21 పనులకు కోటి 85 లక్షల రూపాయలు, కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో 24 పనులకు కోటి 50 లక్షల రూపాయలు, ఎలిగేడు మండలంలో 16 పనులకు కోటి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు. అన్ని పనులు 5 లక్షల రూపాయలలోపు ఉన్నవే కావడంతో ఈ పనులను నామినేషన్‌ ప్రాతిపదికన అధికార పార్టీకి చెందిన నాయకులకు అప్పగించే అవకాశాలున్నాయి.

Updated Date - Feb 13 , 2024 | 01:53 AM