బీఆర్‌ఎస్‌ను వీడను ... బీజేపీలో చేరను
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:36 AM
జిల్లా రాజకీయాలకు కేంద్రం కరీంనగర్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ మేయర్ పదవికి అత్యంత రాజకీయ ప్రాధాన్యం ఉంది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న సుమారు 80శాతం మంది కార్పొరేషన్ పరిధిలోనే ఉంటారు. జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్యేల స్థాయిలో ఇక్కడి మేయర్‌కు రాజకీయంగా పెద్దపీట వేస్తుంటారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
జిల్లా రాజకీయాలకు కేంద్రం కరీంనగర్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ మేయర్ పదవికి అత్యంత రాజకీయ ప్రాధాన్యం ఉంది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న సుమారు 80శాతం మంది కార్పొరేషన్ పరిధిలోనే ఉంటారు. జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్యేల స్థాయిలో ఇక్కడి మేయర్‌కు రాజకీయంగా పెద్దపీట వేస్తుంటారు. అలాంటి మేయర్ పదవిలో ఉన్న యాదగిరి సునీల్‌రావు ఇప్పుడు జిల్లాలో చర్చకు కేంద్రంగా మారారు. బీఆర్‌ఎస్ నుంచి ఎన్నికై మేయర్ పదవిని చేపట్టిన ఆయన ఆ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు బాటలు వేసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కౌన్సిలర్ పదవి నుంచి కేంద్ర మంత్రి పదవికి ఎదిగిన బండి సంజయ్‌కుమార్‌తో ఉన్న సాన్నిహిత్యమే ఇప్పుడు రాజకీయంగా పలు అనుమానాలకు దారితీస్తున్నది. ఒక వైపు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం.. మరోవైపు డిప్యూటీ మేయర్‌తో పొసగని వ్యవహారం.. ఇంకో వైపు స్మార్ట్‌సిటీ పనుల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఆరోపణలు రావడం సునీల్‌రావును వివాదాల తెరపైకి తెచ్చాయి. సునీల్‌రావు రాజకీయంగా ఎటు అడుగులు వేయనున్నారు.. ఆయన ఏ పార్టీలో చేరనున్నారు.. బీజేపీలో చేరి కేంద్ర మంత్రి బండి సంజయ్ బాటలో నడుస్తారా... బీఆర్‌ఎస్‌లోనే ఉండి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి పనిచేస్తారా అంటూ రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈనేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ఆయనతో ముచ్చటించింది. బీజేపీలో చేరుతారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. స్మార్ట్‌సిటీలో జరిగాయంటున్న అవినీతి అక్రమాలు తన ఎదుగుదలను చూసి గిట్టనివారు చేస్తున్న ప్రచారంగా పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతూ క్రమశిక్షణగల కార్యకర్తగా పనిచేస్తానన్నారు. .
ఆంధ్రజ్యోతి: ఇటీవలి కాలంలో మీరు బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అక్కడ ఏమైనా పదవి హామీ పొందారా?
మేయర్: బీజేపీలో చేరుతానని ప్రచారం జరుగుతున్న విషయం నా దృష్టికి కూడా వచ్చింది. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ ఎంపీగా, కరీంనగర్ కార్పొరేషన్ ఎక్స్ అఫిషీయో సభ్యుడిగా ఉన్నారు. ఆయన ఎంపీగా ఉన్న కాలంలో కార్పొరేషన్‌కు నిధులు కేటాయింపులో ఎంతో సహకరించారు. కేంద్రమంత్రిగా ఆ సహకారాన్ని కొనసాగించాలని కోరడానికే కార్పొరేటర్లమందరం కలిసి ఆయన ఇంటికి వెళ్లి అభినందించాము. దానిని గిట్టనివారు రాజకీయ రంగు పులిమి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేనివారే ఈ ప్రచారాన్ని ప్రారంబించారు.
ఆంధ్రజ్యోతి: స్మార్ట్‌సిటీని ఎవరు మంజూరు చేయించారు.. ఈ విషయం బీఆర్‌ఎస్, బీజేపీలో వివాదంగా మారింది కదా... ?
మేయర్: ఎంపీగా, బి వినోద్‌కుమార్ ఉన్న సమయంలో కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా ఎంపిక చేయించడానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ఢిల్లీకి ప్రతిపాదనలు పంపారు. అందుకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ సహకారం అందించారు. వీరితోనే స్మార్ట్‌సిటీ మంజూరైంది. 2020 వరకు స్మార్ట్‌సిటీ పనుల్లో 20 లక్షల విలువ చేసేవి మాత్రమే జరిగాయి. 2019లో ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌కుమార్ స్మార్ట్‌సిటీ నిధుల విడుదల్లో చొరవ చూపారు. ఆ కారణంగానే కేంద్రం 390 కోట్లు విడుదల చేయగా రాష్ట్రం కూడా 360 కోట్లు మంజూరు చేసింది. బండి సంజయ్‌కుమార్ నిధుల విడుదలకు సహకరించారని చెప్పిన విషయాన్నే వక్రీకరించి రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి: కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌తో ఇటీవల సాన్నిహిత్యం పెరిగిందని విమర్శలు వస్తున్నాయి.. దీనిపై మీ కామెంట్?
మేయర్: ముమ్మాటికీ కాదు.. ఆయన కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా నాతో రెండుసార్లు కలిసి పనిచేశారు. విద్యార్థి దశలోనూ ఆయన ఏబీవీపీ నాయకుడిగా ఉంటే నేను ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిగా పనిచేశాను. ఇద్దరికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే సఖ్యతను ఇప్పుడూ కొనసాగిస్తున్నాము. ఎవరి రాజకీయాలు వారియే. మా పార్టీలు వేరైనా రాజకీయం వేరైనా కలిసి ఉండడం తప్పా.
ఆంధ్రజ్యోతి: స్మార్ట్‌సిటీ నిధులను బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని జేబుల్లో నింపుకున్నారన్న ఆరోపణలకు మీ సమాధానమేమిటి?
మేయర్: స్మార్ట్‌సిటీ నిధుల వెచ్చింపు విసయంలో ఏ ఒక్కరికి నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. కరీంనగర్ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి 12 మంది డైరెక్టర్లు ఉంటారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ప్రిన్సిపల్ సెక్రెటరీ చైర్మన్‌గా, మున్సిపల్ కమిషనర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంటారు. మేయర్‌గా నేను ఒక డైరెక్టర్‌ను మాత్రమే.. మిగతా డైరెక్టర్ పోస్టుల్లో అధికారులు ఉంటారు. టెండర్లు పిలిచే అధికారం కమిషనర్లది. ఫైనల్ చేసేది, చెల్లింపులు చేసేది అధికార యంత్రాంగమే. ప్రతి టెండర్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచుతారు. అంతా పారదర్శకంగా జరుగుతుంది. ఎక్కడ అవినీతికి తావులేదు. ఏ అవకతవకలు జరిగినా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేను కానీ, ఏ ప్రజాప్రతినిధికానీ స్మార్ట్‌సిటీ పనుల్లో అవినీతికి పాల్పడలేదు.
ప్రశ్న: బీఆర్‌ఎస్‌లో ముఖ్యంగా మీకు, డిప్యూటీ మేయర్‌కు మధ్య పోరు ఎందుకు?
మేయర్: నాకు ఎవరితో గొడవ లేదు. ఎన్నికలు జరిగిన సమయంలో 60 మంది కార్పొరేటర్లకుగాను 33 మంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు గెలిచారు. ఏడుగురు ఇండిపెండెంట్లు పార్టీలో చేరారు. ఏడుగురు ఎంఐఎం కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌కు మద్దతు పలికారు. వీరందరి మద్దతుతో మేయర్‌గా బాధ్యతలు చేపట్టాను. అందరితో కలిసి కార్పొరేషన్ అభివృద్ధికి కృషిచేశాను. నాకైతే ఎవరితో ఎలాంటి విబేధాలు లేవు. అందరికీ ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాను. డిప్యూటీ మేయర్ మనసులో ఏముందో నాకు తెలియదు. నేను ఏ తప్పు చేయలేదు. కార్పొరేషన్‌లో ఏ అభివృద్ధి పని జరిగినా ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు తెలియకుండా జరుగలేదు.
ప్రశ్న: మాజీ మంత్రి కమలాకర్‌తో కలిసి పనిచేస్తారా... కేంద్రమంత్రి బండి సంజయ్ బాటలో నడుస్తారా..?
మేయర్: నేను 2014 నుంచి బీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తున్నాను. 1987 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో, వివిధ పదవుల్లో పనిచేశాను. ఆనాడు ఆపార్టీలో ఉన్న పరిస్థితుల కారణంగా బీఆర్‌ఎస్‌లో చేరాను. పదేళ్లుగా క్రమశిక్షణతో పనిచేస్తూ అందరి సహకారాన్ని పొందుతూ రాజకీయంగా ముందుకు సాగుతున్నాను. బీఆర్‌ఎస్‌ను వీడే ప్రసక్తిలేదు. బీజేపీలో చేరే ప్రస్తావనే లేదు.