నేటి నుంచి విద్యాసంస్థలకు సెలవులు
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:51 PM
రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబరు 2 గాంధీ జయంతి సెలవు కావడంతో 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలకు ప్రభుత్వం దసరా సెలవులు ఇచ్చింది. సెలవు రోజుల్లో తరగతులను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
కరీంనగర్ టౌన్/భగత్‌నగర్, అక్టోబరు 1: రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబరు 2 గాంధీ జయంతి సెలవు కావడంతో 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలకు ప్రభుత్వం దసరా సెలవులు ఇచ్చింది. సెలవు రోజుల్లో తరగతులను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థినీ, విద్యార్థులు సంతోషంగా వారివారి సొంతూళ్లకు వెళ్లారు. దీనితో నగరంలోని స్కూల్స్, కాలేజీలతోపాటు హాస్టళ్లన్నీ ఖాళీ అయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్లన్నీ విద్యార్థులతో కిటకిటలాడాయి. వరుస సెలవులు రావడంతో గ్రామాలకు వెళ్ళే విద్యార్థులు రెండురోజులుగా పండుగ సందర్భంగా నూతన వస్త్రాలను, ఇతర అలంకార వస్తువులను కొనుగోలు చేయడంతో దుకాణాలన్నీ కిక్కిరిసి పోయాయి. మంగళవారం సాయంత్రం వరకు విద్యార్థులంతా గ్రామాలకు వెళ్ళడంతో జిల్లా కేంద్రంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు బోసి పోయాయి.
కిక్కిరిసిన కరీంనగర్ బస్టాండ్
కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ మంగళవారం ప్రయాణికులతో కిక్కిరిసింది. దసరా, బతుకమ్మ పండుగలను పురస్కరించుకుని ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు చేరుకునేందుకు ఆర్టీసీ ప్రయాణ ప్రాంగాణానికి చేరుకున్నారు. కరీంనగర్ బస్టాండ్‌లోని అన్ని ఫ్లాట్ ఫాంలు ప్రయాణికులతో కిటకిటలాడాయి. రద్దీకి అనుగుణంగా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. జిల్లా కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతాలతోపాటు, నగరాలకు సైతం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు బారులు తీరారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్, గోదావరిఖని, వరంగల్, నిజాబాద్, మంచిర్యాల, జగిత్యాల వైపు వెళ్లేందుకు బస్సుల కోసం ఫ్లాట్‌ఫాం వద్ద పెద్ద ఎత్తున ప్రయాణికులు వేచి చూశారు. దసరా పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.