చీకటి వెలుగుల రంగేళి.... జీవితమే ఓ దీపావళి
ABN , Publish Date - Oct 30 , 2024 | 01:13 AM
ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు వచ్చేది దీపావళి. ధన త్రయోదశి నాడు బంగారం కొనడం, చతుర్థశి నాడు మంగళ హారతులు, దీపావళి నాడు ధనలక్ష్మి పూజలు చేస్తారు.
కరీంనగర్ కల్చరల్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు వచ్చేది దీపావళి. ధన త్రయోదశి నాడు బంగారం కొనడం, చతుర్థశి నాడు మంగళ హారతులు, దీపావళి నాడు ధనలక్ష్మి పూజలు చేస్తారు. ఈ యేడు గురువారం మధ్యాహ్నం చతుర్దశి ఉంటూ 2 గంటల నుంచి అమావాస్య వస్తోంది. గురువారమే దీపావళి పండుగ, ధనలక్ష్మి పూజలు జరుపుకోనున్నారు. శుక్రవారం స్వాతి నక్షత్రంతో కూడిన అమావాస్య ఉండడంతో నోములు నోచుకోనున్నారు. వ్యాపార గృహ సముదాయాల్లో పూజల అనంతరం టపాసులు కాలుస్తారు. ప్రతి ఇల్లు కొత్త అల్లుళ్లలతో సందడిగా మారగా ఇంటిల్లిపాది పిండి వంటలు తింటూ కబుర్లతో కాలక్షేపం చేస్తారు. పడిపోయిన, కొత్తవి, పంచకునే నోములు శుక్రవారం ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు.
ఫ దీపావళి పండగ వెనుక ఇతిహాసం..
ద్వాపర యుగంలో ప్రాగ్జోతిష్యపురం రాజధానిగా నరకాసురుడు పరిపాలన చేస్తూ దేవ, మావన జాతిని ఇబ్బందులకు గురి చేసేవాడు. ధర్మానికి భంగం కలిగించే పనులకు సహించని భూమాత, దేవతలు, ప్రజలు, శ్రీకృష్ణుడికి విన్నవించుకుంటారు. కృష్ణుడు సత్యభామతో కలిసి ఆశ్వయుజ చతుర్థశి నాడు నరకుడిని అంతం చేస్తారు. అది నరక చతుర్ధశి. నరకాసుర వధానంతరం వచ్చిన సత్యభామ కృష్ణులకు అమావాస్య (చీకటి రోజు) నాడు ప్రజలు దీపాలను వెలిగించి మంగళహారతులు, భాజాభజంత్రీలుతో స్వాగతం పలుకుతారు. ఆనాటి నుంచి దీపావళిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
ఫ దీపాల వెలుగులు- టపాసుల మోతలు..
దీపావళి అనగానే వివిధ ఆకృతుల్లో ఉన్న ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. వరుసలుగా దీపాలు వెలిగించి ఆ కాంతుల మధ్య వెలిగి పోతున్న గృహాలను చూసుకొని మురిసి పోతారు. అమావాస్య తిథి లక్ష్మీదేవికి ఇష్టం కావడంతో దీపాలు వెలిగించి అమ్మ వారికి పూజలు చేసి ఆహ్వానిస్తే ధనలక్ష్మి కృప ఉంటుందని విశ్వాసం.పూజల అనంతరంవివిధ రకాల టపాసులను, బాంబులను చిన్నా పెద్ద తేడా లేకుండా కాల్చి ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటారు.
ఫ దీపావళిని ఇలా జరుపుకోవాలి..
గురువారం మధ్యాహ్నం వరకు చతుర్ధశి తిథి ఉన్నందున దేవుని వద్ద మంగళ హారతి వెలిగించాలి. ఆడపడచులు హారతులిచ్చి దిష్టి తీయగానే తలంటు స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి లక్ష్మీపూజ చేసి నైవేద్యం సమర్పించాలి. అమావాస్య తిథి గురువారం మధ్యాహ్నం వస్తుండడంతో మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు దీపావళి పూజలు జరుపాలి. నోములు, వ్రతాలున్న వారు కేదారీశ్వర, సత్యనారాయణ స్వామి వ్రతాలు శుక్రవారం ఆచరించవచ్చు.