బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...
ABN , Publish Date - Oct 02 , 2024 | 01:04 AM
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతు కమ్మ పండుగ. తొమ్మిది రోజులపాటు ఆడపడుచులు వైభవంగా జరుపుకునే వేడుక. బతుకమ్మ అంటే ప్రకృతి కూడా పులకరిస్తుంది. పండగ వేళ తెలంగాణ లోగిళ్లు పూల వనాలను తలపిస్తాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు భక్తిశ్రద్ధలతో గౌరమ్మను పూజిస్తారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతు కమ్మ పండుగ. తొమ్మిది రోజులపాటు ఆడపడుచులు వైభవంగా జరుపుకునే వేడుక. బతుకమ్మ అంటే ప్రకృతి కూడా పులకరిస్తుంది. పండగ వేళ తెలంగాణ లోగిళ్లు పూల వనాలను తలపిస్తాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు భక్తిశ్రద్ధలతో గౌరమ్మను పూజిస్తారు. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే పూల జాతరను అట్టహాసంగా జరపుకోవడానికి జిల్లాలోని మహిళలు సిద్ధమయ్యారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు గౌరమ్మ ఉయ్యాలో... పాడిపంటలను ఉయ్యాలో... చల్లంగా చూడమ్మ ఉయ్యాలో... అంటూ ఆటాపాటలతో సందడి చేయనున్నారు.
ఆడపడుచులు ఎదురుచూసే సంబరం
పండుగలు పబ్బాలు, నోములు, వ్రతాలు సంవత్సరం పొడవునా జరుపుకుంటున్నా బతుకమ్మ వేడుకను మాత్రం ఆడపడుచులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు ఆటాపాటలతో సాగిపోయి దసరాకు రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మతో ముగిసే పండుగ కోసం ఆడ పడుచులు ఎదురు చూస్తారు.
ప్రకృతి పులకరించే
బతుకమ్మ పండుగ రోజులు పల్లెబాటలకు ఇరువైపులా పసుపు పారబోయిసినట్లుగా తంగేడు పూస్తుంది. ఏ దిక్కున చూసినా కట్ల పూలు పలక రిస్తాయి. ప్రతి ఇంటా మందారాలు, గన్నేరు పూలు వికసిస్తాయి. గుమ్మడి నేలంతా పరుచుకుంటుంది. సద్దుల బతుకమ్మకు మగవారంతా తంగేడు, గునుగు పూలను పచ్చిక బయల్లలోంచి సేకరించి తీసుకొస్తారు. ఇంటిల్లి పాది ఎంతో ఉత్సాహంగా బతుకమ్మను పేరుస్తారు. ఇలా చివరి రోజున పెద్ద బతుకమ్మ పేర్చి ప్రధాన కూడళ్లలో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడ పడుచులు బతుకమ్మ ఆడుతారు. చీకటి పడుతున్న వేళ ఊరి శివారులోని వాగులు, చెరువుల వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. రకరకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆడ పడుచులు పల్లెంలో తెచ్చిన నీటితో వాయినాలు ఇచ్చుకుంటారు.
రోజుకో పేరు.. ఫలహారం
బతుకమ్మకు రోజుకో పేరుతో పిలుచుకుంటూ ఫలహారాన్ని సమర్పిస్తారు. మాపటేల ఆటపాటలతో రకారకాల ఫలహారాలు బతుకమ్మకు సమర్పించి వాయనాలుగా ఇచ్చి పుచ్చుకుంటారు. పల్లెల బాధలను, గాథలను, మంచీచెడులను తెలియజెప్పే పాటలతో గడిపే మహిళలు గౌరమ్మకు అందించే ఫల హారాలు ఇలా ఉంటాయి..
మొదటి రోజు : ఎంగిలిపూల బతుకమ్మగా పేరుస్తారు. ఈ రోజు నువ్వులు, బెల్లం, మొక్కజొన్న పేలాలు నైవేద్యంగా సమర్పిస్తారు.
రెండో రోజు : అటుకుల బతుకమ్మ. సప్పిడి పప్పు, బెల్లం, అటుకుల ప్రసాదం.
మూడో రోజు : ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు బెల్లం, పాలు.
నాలుగో రోజు : నానబియ్యం బతుకమ్మ. నానిన బియ్యం, పాలలో నానబెట్టిన బియ్యంపిండితో బెల్లం కలిపి ప్రసాదం చేస్తారు.
ఐదో రోజు : అట్ల బతుకమ్మ. బియ్యం నానబెట్టి దంచి తీసిన పిండితో తయారు చేసిన అట్లు ప్రసాదంగా తీసుకెళ్తారు.
ఆరో రోజు : అలిగిన బతుకమ్మ. కొన్ని చోట్ల బతుకమ్మను పేర్చడం, ఆడడం చేయరు. ఆ రోజు బతుకమ్మ అలిగిందని అతివలు విశ్వసిస్తారు. ఒకవేళ బతుకమ్మ ఆడినా ప్రసాదం చేయరు.
ఏడో రోజు : వేపకాయల బతుకమ్మ. సకినాలు చేసే పిండిని వేపకాయలంత పరిమాణంలో ముద్దలా చేసి నూనెలో వేయించి ప్రసాదం చేస్తారు. పప్పు బెల్లం కూడా తయారు చేస్తారు.
ఎనిమిదో రోజు : వెన్నముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న బెల్లం, నెయ్యితో చేసిన ఫలహారం.
తొమ్మిదో రోజు : పెద్ద బతుకమ్మ. చివరి రోజు సద్దుల బతుకమ్మగా పిండి వంటలతో ఉత్సాహంగా గడుపుతారు. రకరకాల పిండి వంటలతో పోటీ పడతారు. ఇంటిల్లి పాది బతుకమ్మను సాగనంపుతారు.
తెలంగాణలోనే అతిపెద్ద బతుకమ్మ ఘాట్
బతుకమ్మ సంబరాలకు జిల్లా కేంద్రంలో బతుకమ్మ ఘాట్ ముస్తాబైంది. 2018లో జిల్లా యంత్రాంగం బతుకమ్మ ఘాట్ నిర్మించింది. కేవలం 28 రోజుల్లోనే రూ.1.60 కోట్ల వ్యయంతో సిరిసిల్ల మానేరు వాగు తీరంలో అందరూ అబ్బురపడే విధంగా నిర్మాణం చేపట్టారు. 40 ఫీట్ల వెడల్పు రోడ్డు, ఇరువైపులా పుట్‌పాత్‌లు, చెట్లు, లైట్లు ఏర్పాట్లు చేశారు. 120 ఫీట్లతో ఘాట్ నిర్మాణం చేపట్టడంతోపాటు గ్రానైటుతో తీర్చిదిద్దారు. 8700 చదరపు అడుగులతో బతుకమ్మలు వేయడానికి తెప్పను నిర్మించారు. తెప్ప మధ్యలో తల్లీకూతుళ్ల ప్రతిమలను ఏర్పాటు చేశారు.
సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు
బతుకమ్మ తెలంగాణ సంప్రదాయాల్లో పెద్దతనం పోషిస్తుంది. బతుకమ్మ సంబరాలతో ప్రతిపల్లె ఆటాపాటలతో పులకరిస్తుంది. ఏటా మహాలయ అమవాస్య నుంచి చిన్న బతుకమ్మలతో సంబరాలు మొదలవుతాయి. పెద్ద బతుకమ్మతో ముగుస్తాయి. ఈ నెల 10న సద్దుల (పెద్ద) బతుకమ్మ జరుపు కోనున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ పండుగకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు.