రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలి
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:49 AM
వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధిక ప్రణాళికలు రూపొందించాలని, ఆధ్యాత్మిక పట్టణంగా తీర్చి దిద్దేందుకు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ అన్నారు. మంగళవారం వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్‌తో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.
వేములవాడ కల్చరల్, అక్టోబరు 1 : వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధిక ప్రణాళికలు రూపొందించాలని, ఆధ్యాత్మిక పట్టణంగా తీర్చి దిద్దేందుకు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ అన్నారు. మంగళవారం వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్‌తో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. వేములవాడ ఆలయాన్ని చారిత్రాత్మక, సాంస్కృతిక, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్రణాళికలు, చేపట్టిన పనులు, వాటి స్థితిగతులు తదితర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రిన్సిపల్ సెక్రెటరీకి వివరించారు. వేములవాడకు 35 కిలో మీటర్ల పరిసరాల్లో ఉన్న కొండగట్టు, నాంపల్లిగుట్ట, సిరిసిల్ల వేంకటేశ్వరస్వామి దేవాలయంతోపాటు ఇతర ఆలయాలు, కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం, ఎలగందుల ఫోర్టు, అనంతసాగర్ వాటర్ ఫాల్స్, రామడుగు కోట మొదలగు పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయన్నారు. అనంతరం శైలజ రామయ్యర్ మాట్లాడుతూ వేములవాడ పట్టణానికి ఆధ్మాత్మిక శోభ తీసుకొచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దేవాలయం చుట్టుపక్కల అందుబాటులో ఉన్న 36 ఎకరాల భూమి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ స్థలంలో వసతి గృహాలు, దేవస్థానం కార్యాలయం, పార్కింగ్, క్యూ కాంప్లెక్, సాంస్కృతిక జోన్, బతుకమ్మ పండుగ నిర్వహణకు వేదిక ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.275 కోట్లతో సమగ్ర ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రస్తుతం అందించే ప్రతిపాదనలు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తయారు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకంలో వేములవాడ దేవాలయం ఎంపికైందని, ఆ నిధులను సైతం సమర్థవంతంగా వినియోగించుకుంటూ వేములవాడను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. రాజన్న ఆలయానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చినా ఏర్పాట్లు సరిపోయే విధంగా అభివృద్ది కార్యక్రమాలు రూపొందించాలన్నారు. పట్టణంలోని బస్టాండ్, రాబోయే రైల్వే స్టేషన్ నుంచి దేవాలయానికి వచ్చే కనెక్టివిటీ రోడ్లలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరగాలన్నారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని, మన ప్రాంతంలో కొనసాగుతున్న గంగా జమునా తహసిబ్ అదేవిధంగా కొనసాగేలా చూడాలని అన్నారు. వేములవాడ పట్టణంలో దేవాలయాలకు వచ్చే విధంగా అవసరమైనా రోడ్లు, ప్లాట్‌ఫామ్, జంక్షన్ సుందరీకరణ లైట్ల ఏర్పాటు మొదలగు అభివృద్ధి పనులకు రూ.80 కోట్లతో ప్రాతిపాదనలు సిద్దం చేస్తున్నామన్నారు. ప్రధాన దేవాలయ అభివృద్ధిని రూ.70 కోట్లతో చేపట్టాలని, దీనికి సంబంధించి ఆధ్యాత్మికతో కూడిన ప్రణాళికలు ముందుగా తయారు చేయాలని అన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న ఆలయాభివృద్ధితోపాటు పట్టణ సమగ్రాభివృద్ధి ప్రణాళిక రూపొందించి ముందుకు సాగుతామన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయమని, దక్షిణకాశీగా పేరుగాంచిన రాజన్న భక్తులకు స్వామి దర్శనం వేగంగా కల్పించడంతోపాటు వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, ఆలయాధికా రులు, ఆర్కిటెక్ బృందం ప్రతినిధులు సూర్యనారాయణ మూర్తి ఉన్నారు.