Share News

కామారెడ్డి ఆస్పత్రికి విచారణ బృందం

ABN , Publish Date - Feb 13 , 2024 | 03:48 AM

కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై విచారణకు ముగ్గురు వైద్యులతో కూడిన బృందం సోమవారం ఆస్పత్రిని పరిశీలించింది. ఈ బృందంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డాక్టర్‌ అనిల్‌ కూడా ఉన్నారు. ఇటీవల ఐసీయూలో ముజిబ్‌ అనే రోగిని ఎలుకలు గాయపరిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాధితుడి కుటుంబీకులతో

కామారెడ్డి ఆస్పత్రికి విచారణ బృందం

రోగిపై ఎలుకల దాడి ఘటనపై వివరాల సేకరణ

నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు

తీసుకుంటాం: మంత్రి దామోదర రాజనర్సింహా

కామారెడ్డి టౌన్‌, ఫిబ్రవరి 12: కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై విచారణకు ముగ్గురు వైద్యులతో కూడిన బృందం సోమవారం ఆస్పత్రిని పరిశీలించింది. ఈ బృందంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డాక్టర్‌ అనిల్‌ కూడా ఉన్నారు. ఇటీవల ఐసీయూలో ముజిబ్‌ అనే రోగిని ఎలుకలు గాయపరిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాధితుడి కుటుంబీకులతో మాట్లాడి విచారణ బృందం వివరాలు సేకరించింది. అలాగే ఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న అటెండర్‌ నుంచి వైద్యుల వరకు అందరిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆదివారం వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆస్పత్రిలో డయాలసిస్‌ విభాగాన్ని పరిశీలించడంతో పాటు ఎలుకలు వస్తున్న మార్గాలను పరిశీలించారు. ఎలుకల నివారణకు గతంలో శానిటేషన్‌ ఏజెన్సీ చేపట్టిన పనులను, ఎలుకల సంచారం ఉన్నప్పుడు శానిటేషన్‌ సిబ్బందికి ఏ విధంగా సమాచారమిచ్చారన్న వివరాలపై ఆరా తీశారు. అందరి నుంచి రాత పూర్వక నివేదికను తీసుకుని ప్రభుత్వానికి అందిస్తామని బృంద సభ్యులు తెలిపారు. మరోవైపు రోగిని ఎలుకలు కొరికిన ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై.. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సంహా తెలిపారు. ఈ వ్యవహారంలో వైద్యులను సస్పెండ్‌ చేయడంపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, టీవీవీపీ జేఏసీ కమిటీ సభ్యులు సోమవారం మంత్రిని కలిశారు. నివేదిక అందిన తర్వాత వైద్యులపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తామని వారికి మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. వైద్యులు, వైద్య సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, వైద్య భద్రత కల్పించేలా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని కోరారు.

Updated Date - Feb 13 , 2024 | 10:31 AM