Global AI Summit: నేడు, రేపు ప్రపంచ కృత్రిమ మేధ సదస్సు
ABN , Publish Date - Sep 05 , 2024 | 04:07 AM
‘ప్రపంచ కృత్రిమ మేధ(ఏఐ) సదస్సు’కు హైదరాబాద్ వేదిక కానుంది. గురు, శుక్రవారాల్లో (5, 6 తేదీలు) రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.
ప్రారంభించనున్న సీఎం రేవంత్
పాల్గొననున్న మంత్రి శ్రీధర్‌బాబు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ఇలాంటి సదస్సు దేశంలో ప్రథమం సదస్సుకు దాదాపు 2000 మంది ప్రతినిధులు
హైదరాబాద్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ‘ప్రపంచ కృత్రిమ మేధ(ఏఐ) సదస్సు’కు హైదరాబాద్ వేదిక కానుంది. గురు, శుక్రవారాల్లో (5, 6 తేదీలు) రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్‌ఐసీసీ)లో గురువారం ఉదయం 10 గంటలకు సదస్సును సీం రేవంత్ ప్రారంభిస్తారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొంటారు. ‘ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేధస్సుతో పని(మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఎవ్రీ వన్)’ ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఇలాంటి గ్లోబల్ ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్‌ను నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి.
ఐటీ రంగంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సును నిర్వహిస్తోంది. ప్రపంచ నలుమూలల నుంచి ఏఐ రంగంలో పేరొందిన దాదాపు 2 వేల మంది ప్రముఖులు, సంస్థల ప్రతినిధులు సదస్సుకు హాజరవుతున్నారు. ఏఐ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఖాన్ అకాడమీ అధినేత సల్ ఖాన్, ఐబీఎం నుంచి డానియెలా కాంబ్, ఎక్స్‌ప్రైజ్ ఫౌండేషన్ నుంచి పీటర్ డయామండిస్ తదితర ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఏఐ రంగం అభివృద్ధికి తమ ఆలోచనలను పంచుకుంటారు.
భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చలు జరుపుతారు. సమాజంపై ఏఐ ప్రభావం, నియంత్రణ, సవాళ్లను చర్చిస్తారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ధి దశలో ఉన్న వినూత్న ప్రాజెక్ట్‌లను ఈ సదస్సులో ప్రదర్శిస్తారు. రెండు రోజుల సదస్సు కోసం ప్రధాన వేదికతో పాటు నాలుగు అదనపు వేదికలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో నిర్మించనున్న ఫోర్త్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగానికి ఇస్తున్న ప్రాధాన్నాన్ని, అందుకు రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణాన్ని ఈ ఏఐ గ్లోబల్ సదస్సు ప్రపంచానికి చాటి చెబుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రాన్ని ఏఐ హబ్‌గా తీర్చి దిద్దేందుకు, ప్రపంచ దిగ్గజ సంస్థల పెట్టుబడులను ఆకర్షించడానికి ఇటీవల అమెరికా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి అధిక ప్రాధాన్యమిచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ రంగాల్లో ఏఐ సేవలను వినియోగించడానికి వీలుగా ప్రభుత్వం ప్రత్యేక రోడ్‌మ్యా్‌పను రూపొందించింది. దీన్ని సదస్సులో సీఎం విడుదల చేస్తారు. సదస్సులో దాదాపు 25 కార్యక్రమాలను నిర్వహించనున్నారు.