చట్టసభలకు రాకుండా అక్కడికెలా వెళ్తావ్..
ABN , Publish Date - Feb 13 , 2024 | 03:37 AM
నల్లగొండలో సభ పెట్టే నైతిక హక్కు మాజీ సీఎం కేసీఆర్‌కు లేదని.. ఆయన అక్కడ సభ పెట్టడం సిగ్గు చేటని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి, రాందాస్ నాయక్, ఆది శ్రీనివాస్, సంజీవరెడ్డి, లక్ష్మణ్‌కుమార్,
నల్లగొండలో కేసీఆర్ సభ పెట్టడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): నల్లగొండలో సభ పెట్టే నైతిక హక్కు మాజీ సీఎం కేసీఆర్‌కు లేదని.. ఆయన అక్కడ సభ పెట్టడం సిగ్గు చేటని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి, రాందాస్ నాయక్, ఆది శ్రీనివాస్, సంజీవరెడ్డి, లక్ష్మణ్‌కుమార్, రాంచంద్రనాయక్ మండిపడ్డారు. ప్రజల సొమ్మును దోచుకున్నది కాక నల్లగొండ సభలో ప్రజలకు ఏం చెప్తావ్.. అని ప్రశ్నించారు. చట్టసభలకు రాని కేసీఆర్ నల్లగొండ సభకు మాత్రం ఎలా వెళ్తారని నిలదీశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడారు. ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరమని చెప్పి ప్రజలను మాజీ సీఎం కేసీఆర్ మోసం చేశారని.. ఇప్పుడు ఆ ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితికి వచ్చిందని చెప్పారు. ‘ఏ ఇంజనీర్ చెప్పినా వినకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించాడు. తానే గొప్ప ఇంజనీర్‌నని చెప్పుకొని ప్రాజెక్టు నిర్మాణంలో రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. కేసీఆర్ నువ్వు నిజమైన తెలంగాణ వాదివి కాదు. రాజకీయ స్వార్థం కోసం కృష్ణా జలాలు కేంద్రానికి అప్పగించావ్.. కాళేశ్వరం కింద లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చానన్నావ్.. సభకు వచ్చి ఎక్కడ ఇచ్చావో చెప్పాలి. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలె మిమ్మల్ని చెప్పుతో కొట్టెలా సమాధానం ఇస్తారు. కాళేశఽ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతిని తెలియజేసేందుకే మంగళవారం రేవంత్, భట్టి, ఉత్తమ్ నేతృత్వంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను తీసుకెళ్లేందుకు ప్రాజెక్టు పర్యటనను ఏర్పాటు చేశారు’ అని చెప్పారు. సభలో నీళ్ల గురించి కాంగ్రెస్ సభ్యులు అడుగుతుంటే.. బీఆర్‌ఎస్ సభ్యులు నీళ్లు నములుతున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కింద ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎకరం భూమి కూడా పారట్లేదని కాంగ్రెస్ మరో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించబోమని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీర్మానానికి ధన్యవాదాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గానికో లక్ష ఎకరాలకు సాగు నీరు ఇస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడెక్కడ ఉన్నారని ప్రశ్నించారు.