Share News

Harish Rao: రేవంత్‌ తీరుతో పెట్టుబడులు రావట్లేదు

ABN , Publish Date - Sep 12 , 2024 | 04:13 AM

పది నెలల కాంగ్రెస్‌ పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదని, నమ్మి ఓట్లేసిన ప్రజలందర్నీ ఆ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు దుయ్యబట్టారు.

Harish Rao: రేవంత్‌ తీరుతో పెట్టుబడులు రావట్లేదు

  • హామీలు నెరవేర్చలేక హైడ్రా పేరిట డ్రామాలు

  • ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసింది: హరీశ్‌

నర్సాపూర్‌, సెప్టెంబరు 11: పది నెలల కాంగ్రెస్‌ పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదని, నమ్మి ఓట్లేసిన ప్రజలందర్నీ ఆ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 41 లక్షల మంది రైతులకు రుణ మాఫీ చేయాల్సి ఉండగా, కేవలం 21 లక్షల మందికే వర్తింపజేసి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌లో ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసాను ఎగ్గొట్టిన ఘనత కాంగ్రె్‌సకే దక్కుతుందన్నారు. పంటల బీమా అమలు చేయకపోవడంతో వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు అతీగతీ లేకుండా పోయిందన్నారు.


గ్రామాల్లో పారిశుధ్యం లోపించడం వల్లే ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. పది నెలలుగా పంచాయతీలకు పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. హామీలు నెరవేర్చడం చేతకాక హైడ్రా పేరిట డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌ సర్కారు తీరు వల్ల రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని, హైదరాబాద్‌ ఇమేజ్‌ తగ్గడంతో పెట్టుబడులూ రావట్లేదని ఆరోపించారు. ప్రజల ఉసురు పోసుకోవడం తప్ప, ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి ఉపాధిహామీ పథకం కింద రూ.400 కోట్లు వస్తే.. ఆ నిధులనూ గ్రామాలకు ఇవ్వకుండా మళ్లించారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ కూడా రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు.


పక్క రాష్ట్రమైన ఏపీకి ప్యాకేజీలు ఇస్తూ.. తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిందని విమర్శించారు. కాగా, ఓ పసికందును కుక్కలు పీక్కుతున్నాయన్న వార్త.. తన మనసును కలిచివేసిందని, రాష్ట్రంలో ఇంత హృదయవిదారక ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్‌ సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదని ‘ఎక్స్‌’ వేదికగా హరీశ్‌ ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది 60వేలకుపైగా కుక్కకాట్లు నమోదయ్యాయని విమర్శించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ రేబీస్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాలని కోరారు. కుక్క కాటుకు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై హైకోర్టు తీవ్రంగా స్పందించి మందలించినా తగిన చర్యలు చేపట్టడంలో సర్కారు విఫలమైందని దుయ్యబట్టారు. కాగా, రాష్ట్రంలో మరో నాలుగు మెడికల్‌ కాలేజీలకు జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ అనుమతి ఇవ్వడంపై హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉంటే.. కేసీఆర్‌ కృషి వల్ల వాటి సంఖ్య ఏకంగా 34కు చేరడం గర్వకారణమన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 08:22 AM