Hyderabad: పట్టించిన ఫోన్ కాల్..
ABN , Publish Date - Oct 20 , 2024 | 03:25 AM
మద్యం మత్తులో వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించి.. ప్రతిఘటించడంతో ఆమెను, ఆ హత్యను చూసిన ఆమె భర్తను దారుణంగా హత్య చేశాడో దుర్మార్గుడు!
మద్యం మత్తులో వృద్ధురాలిపై లైంగికదాడికి యత్నించి హత్య
అడ్డొచ్చిన ఆమె భర్తనూ కొడవలితో నరికి చంపిన ఉన్మాది
తన మొబైల్‌ను వెతుక్కునే క్రమంలో హతుల సెల్ నుంచి కాల్
దీంతో పట్టివేత.. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఘటన
నిరుడు ఓ మహిళను చంపిందీ ఇతడే.. విచారణలో వెలుగులోకి
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించి.. ప్రతిఘటించడంతో ఆమెను, ఆ హత్యను చూసిన ఆమె భర్తను దారుణంగా హత్య చేశాడో దుర్మార్గుడు! తన సెల్ ఫోన్ ఎక్కడుందో తెలుసుకునేందుకు హతుల సెల్ నుంచి తన సెల్‌కు ఫోన్ చేయడమే నిందితుడిని పట్టించింది. ఈ జంట హత్యలు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కందుకూరు మండలంలో జరిగితే.. ఈ దుర్మార్గానికి ఒడిగట్టింది అదే మండలం దాసర్లపల్లికి చెందిన ఉప్పుల శివకుమార్ (25). రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లికి చెందిన చింతపల్లి మనోహర్‌రావుకు కందుకూరు మండలం కొత్తగూడలో 8 ఎకరాల మామిడితోట ఉంది.
కూలీలుగా అక్కడే ఉండి పనిచేయడానికి తన సొంతూరు పెద్దకొత్తపల్లి నుంచి మూగ ఉషయ్య (70), శాంతమ్మ (65) దంపతులను పనిలో పెట్టుకున్నాడు. కందుకూరు మండలం దాసర్లపల్లికి చెందిన ఉప్పుల శివకుమార్ మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. ఈనెల 15న రాత్రి ఏడు గంటలకు బైక్ మీద వెళుతూ కొత్తగూడ గ్రామపరిధిలో ఉన్న ఉషయ్య దంపతులు పనిచేస్తున్న మామిడితోట వద్ద ఆగాడు. మద్యం మత్తులో ఉన్న శివ, తోటలోకి వెళ్లాడు. అక్కడ షెడ్డులో ఉన్న శాంతమ్మపై లైంగికదాడికి యత్నించాడు. ప్రతిఘటించడంతో ఆమెను కొడవలితో నరికి హత్య చేశాడు. అప్పుడే వచ్చిన ఉషయ్య, భార్య మృతదేహాన్ని చూసి కేకలు వేస్తూ పరుగులు తీయగా అతడిని వెంటాడి కొడవలితో నరికి చంపాడు.
ఈ కేసును తేల్చేందుకు రాచకొండ సీపీ సుధీర్‌బాబు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. హత్య జరిగిన రోజు శివకుమార్ తన ఫోన్ చార్జింగ్ లేకపోవడంతో దాన్ని ఇంట్లోనే వదిలేసి బయటకొచ్చాడు. హత్యల తర్వాత తన ఫోన్ ఇంట్లో వదిలేసిన విషయం మరిచిపోయిన శివ.. తన ఫోన్ తోటలోనే ఎక్కడో పడిపోయి ఉంటుందని భావించి వృద్ధ దంపతుల మృతదేహాల వద్ద ఉన్న ఫోన్ నుంచి తన నంబరుకు కాల్ చేశాడు. అది స్విచాఫ్ ఉండటంతో రింగ్ కాలేదు. తర్వాత వృద్ధులకు చెందిన ఫోన్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ మొబైల్‌లో చివరి కాల్ శివ కుమార్ నంబరుకు చేసి ఉన్నట్లుగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకొని కేసును తేల్చారు.
శివ కుమార్‌ను విచారించిన క్రమంలో ఏడాదిన్నర క్రితం దాసర్లపల్లిలో ఓ మహిళను అతడు హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నెల్లూరు జిల్లాకు చెందిన శైలజారెడ్డి (42) తన భర్త, పిల్లలతో కలిసి కందుకూరు మండలంలోని దాసర్లపల్లి గ్రామానికి వచ్చి అరుణ ఫామ్‌హౌజ్‌లో పనికి చేరింది. 2023 మార్చి3న రాత్రి ఫామ్‌హౌజ్‌లోకి శివ వెళ్లాడు. గదిలో వంటచేస్తున్న శైలజారెడ్డిపై లైంగికదాడికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో అక్కడే ఉన్న గొడ్డలితో మెడపై నరికి చంపాడు. అప్పట్లో క్లూస్ టీం వంటగదిలోని వోడ్కా బాటిల్‌పై వేలిముద్రలను సేకరించింది. తాజా జంట హత్యల నేపథ్యంలో శివ వేలిముద్రలు, ఓ బాటిల్‌పై ఉన్న వేలిముద్రలతో సరిపోలడంతో పోలీసులు విచారించగా శివ ఆ నేరాన్నీ అంగీకరించాడు.