స్కీం బోర్డును ఇన్సూరెన్స కంపెనీలకు అప్పగించవద్దు
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:14 AM
భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స కంపెనీలకు అప్పగించవద్దని, సంక్షేమ పథకాలను ప్రభుత్వమే అమలుచేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన వర్కర్స్ ఫెడరేషన (సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి సీహెచ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
స్కీం బోర్డును ఇన్సూరెన్స కంపెనీలకు అప్పగించవద్దు
నల్లగొండరూరల్, సెప్టెంబరు 11: భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స కంపెనీలకు అప్పగించవద్దని, సంక్షేమ పథకాలను ప్రభుత్వమే అమలుచేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన వర్కర్స్ ఫెడరేషన (సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి సీహెచ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవనలో బుధవారం నిర్వహించిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద బీమా, సహజ మరణం, శాశ్వత పాక్షిక అంగవైకల్యం తదితర సంక్షేమ పథకాలను బీమా కంపెనీలకు అప్పజెప్పాలని చూస్తోందని ఆరోపించారు. ఆ విధానాన్ని విరమించుకోకపోతే కార్మికవర్గ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా భవన నిర్మా ణ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటలను చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 12నుంచి 15వ తేదీ వరకు సంతకాల సేకరణ, 16న కలెక్టరేట్ ఎదుట ధర్నా, 19, 20, 21 తేదీల్లో అడ్డా పని ప్రదేశాల్లో సమావేశాలు, 23న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. బైరం దయానంద అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఫెడరేషన జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, పి.సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా నాయకులు జిట్ట నగేష్ పాల్గొన్నారు.