Share News

లేఅవుట్ల లెక్క తేల్చేనా?

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:29 PM

ఔటర్‌ రింగురోడ్డు లోపల హైడ్రా కూల్చివేతలతో నగర శివారు చుట్టూ విస్తరించి ఉన్న మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని లేఅవుట్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు తెలిసింది.

లేఅవుట్ల లెక్క  తేల్చేనా?

జిల్లాలోని లేఅవుట్లపై అధికారుల నజర్‌!

చెరువు కుంటల సమీప స్థలాలపై సర్వే

సన్నద్ధమవుతున్న రెవెన్యూ అధికారులు

ఇప్పటికే బఫర్‌జోన్‌లు, ఎఫ్‌టీఎల్‌లలో

అనుమతులు ఇచ్చిన శాఖలకు లేఖలు!

మేడ్చల్‌ అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఔటర్‌ రింగురోడ్డు లోపల హైడ్రా కూల్చివేతలతో నగర శివారు చుట్టూ విస్తరించి ఉన్న మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని లేఅవుట్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు తెలిసింది. ముఖ్యంగా జిల్లాలోని చెరువులు, కుంటల సమీపంలో ఏర్పాటు చేసిన లేఅవుట్ల లెక్కలను అధికారులు తేల్చేందుకు సిద్ధ్దమౌతున్నట్లు సమాచారం. జిల్లా పూర్తిగా నగరశివారులో ఉండటంతో ఇక్కడ భూములు చాలా విలువైనవి. ఎకరా భూమి రూ. కోట్లలో పలుకుతుంది. దీంతో కొంత మంది రియల్టర్లు ఇక్కడి భూములపై కన్నేశారు. చెరువులు, కుంటల సమీపాల్లో లేఅవుట్లు చేసి బఫర్‌, ఎఫ్‌టీఎల్‌ స్థలాల్లో కూడా ప్లాట్లు చేశారనే ఫిర్యాదులు అందాయి. దీంతో జిల్లాలోని గ్రామాలు, మున్సిపాల్టీల్లోని చెరువులు, కుంటల సమీప స్థలాలను సర్వే చేసేందుకు రెవెన్యూఅధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు బఫర్‌జోన్‌లు, ఎఫ్‌టీఎల్‌లలో అనుమతులు ఇచ్చిన శాఖలకు లేఖలు రాసినట్లు తెలిసింది. ఇరిగేషన్‌శాఖ అధికారులు డిజిటల్‌ జీపీఎస్‌ సర్వేలు చేసి గ్రామ నక్షలతో సరిచేయనున్నారు. ఆయా శాఖల అధికారులు లేఅవుట్లకు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే అనుమతులు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. దీంతోజిల్లాలోని అక్రమ లేఅవుట్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. వాటి లెక్కలు తేల్చే పనుల్లో నిమగ్నమైనట్లు సమాచారం.

Updated Date - Oct 01 , 2024 | 11:29 PM