Manchiryāla- వర్గీకరణపై కమిటీని ఉపసంహరించుకోవాలి
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:08 PM
ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని వెంటనే ఉపసంహరించుకోవాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలితం శంకర్, జై భీమ్ సైనిక్ దళ్ రాష్ట్ర కన్వీనర్ ఆసాది పురుషోత్తం అన్నారు. జాతీయ మాల మహానాడు నస్పూర్ మున్సిపాలిటీ సమావేశం ఆదివారం శ్రీరాంపూర్‌లోని ఓ పాఠశాలలో నిర్వహించారు. వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
శ్రీరాంపూర్, సెప్టెంబరు 15: ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని వెంటనే ఉపసంహరించుకోవాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలితం శంకర్, జై భీమ్ సైనిక్ దళ్ రాష్ట్ర కన్వీనర్ ఆసాది పురుషోత్తం అన్నారు. జాతీయ మాల మహానాడు నస్పూర్ మున్సిపాలిటీ సమావేశం ఆదివారం శ్రీరాంపూర్‌లోని ఓ పాఠశాలలో నిర్వహించారు. వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఎస్సీల అభిప్రాయాన్ని సేకరించకుండా ఏకపక్షంగా వర్గీకరణ అమలు పేరుతో మంత్రుల కమిటీ వేయడం సమంజసం కాదన్నారు. దానికి చైర్మన్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మిగతా సభ్యులు ఇతర కులాల వారు ఉన్నారని చెప్పారు. మాలలుగాని, మాల ఉపకులాల వారు లేరని తెలిపారు. ఇది మాలలకు జరిగిన అన్యాయం కాదా వారు ప్రశ్నించారు. ఈ కమిటీతో మాలలు, మాల ఉప కులాలను మోసగించడానికే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆరోపించారు. ఈ మంత్రుల కమిటీ స్థానంలో న్యాయమూర్తితో కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా కంటే మాలల జనాభా ఎక్కువగా ఉందని చెప్పారు. ప్రభుత్వం మాలలకు అన్యాయం చేయాలని చూస్తే గతంలో చంద్రబాబుకు పట్టిన గతే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పడుతుందని వారు హెచ్చరించారు. అనంతరం జాతీయ మాల మహానాడు నస్పూర్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఐతే పరమేష్, శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడిగా పుట్ట రవిని నియమించారు. అలాగే జై భీమ్ సైనిక్ దళ్ మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షుడిగా కాటం రాజు, నస్పూర్ పట్టణ అధ్యక్షుడిగా బింగి సదానందం, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడిగా దొంతమల్ల శివకుమార్‌ను నియమించారు. వీరికి నియామక పత్రాలు అందజేశారు. ఇటీవల జాతీయ మాల మహానాడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా గుమ్మడి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధిగా తలారి రాజు ఎన్నిక కాగా, వారితో పాటు నూతన కమిటీలను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షుడు గరిసె రామస్వామి, జై భీమ్ సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు ఎర్రోళ్ల నరేష్, ఉపాధ్యక్షుడు జింజుపల్లి నర్సింగ్, ప్రధాన కార్యదర్శి సొల్లు శ్రీనివాస్, నాయకులు కౌటం కృష్ణ, చెవుల వాసు, దొంత మురళి, అనిల్, బత్తుల స్వామి, చీదురు సంతోష్, డి పోశం, టి శ్యాముల్, రత్నయ్య, విఠల్, అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.