Share News

CM Revanth Reddy: అనుకూల చరిత్ర రాయించుకున్నారు!

ABN , Publish Date - Dec 20 , 2024 | 03:50 AM

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతోపాటు తొలి, మలి దశల రాష్ట్ర సాధన ఉద్యమాల చరిత్రలో ఎంతోమంది త్యాగధనులకు, అమరులకు సముచిత స్థానం దక్కలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

CM Revanth Reddy: అనుకూల చరిత్ర రాయించుకున్నారు!

  • అదే నిజమైనదిగా భ్రమ కల్పించారు

  • దాంట్లో అమరులకు చోటు దక్కలేదు

  • కేసీఆర్‌ హయాంపై రేవంత్‌ వ్యాఖ్య

  • 37వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక

  • ప్రదర్శనను ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతోపాటు తొలి, మలి దశల రాష్ట్ర సాధన ఉద్యమాల చరిత్రలో ఎంతోమంది త్యాగధనులకు, అమరులకు సముచిత స్థానం దక్కలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సమిధలైన వారి త్యాగాలకన్నా రాజకీయ ప్రయోజనాలు పొందిన వారి చరిత్రపైనే ఎక్కువ చర్చ సాగడం బాధాకరమన్నారు. గురువారం 37వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శనను సీఎం రేవంత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పదేళ్లపాటు అధికారం చేతిలో ఉన్నవారు, తమకు అనుకూలమైన చరిత్రను రాయించుకొని అదే నిజమైన చరిత్ర అని సమాజంలో భ్రమలు కల్పించారని మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఆ చరిత్రలోని వాస్తవాలను, అవాస్తవాలను ప్రజలు గుర్తించాలి అని సూచించారు. మరోవైపు, పుస్తక పఠనం అవసరాన్ని వివరిస్తూ.. ‘డిజిటల్‌ యుగంలో రకరకాల సామాజిక మాధ్యమాల వల్ల పుస్తకాలకు ప్రాధాన్యం తగ్గింది.


చరిత్ర చదవడం ద్వారా భవిష్యత్తుకు పునాదులు నిర్మించుకోవచ్చు అన్న ఆలోచన క్రమంగా సన్నగిల్లుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పుస్తకాల పండుగ భావితరాలకు ఒక స్ఫూర్తిని ఇవ్వాలి. చరిత్ర పఠనం ఆవశ్యకతను ఎలుగెత్తి చాటాలి. తద్వారా భవిష్యత్తుకు సరైన దశాదిశను నిర్దేశించుకోగలమన్న సందేశాన్ని ఈ వేదిక ద్వారా తెలియజెపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సామాజిక స్పృహను పెంపొందించడానికి తోడ్పడే పుస్తక ప్రదర్శనలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత అని, దీంట్లోభాగంగానే తనతో పాటు సహచర మంత్రులు ఈ పుస్తక మహోత్సవంలో పాల్గొంటున్నాం అని సీఎం రేవంత్‌ తెలిపారు. తమ కలం ద్వారా, గళం ద్వారా సామాజిక చైతన్యాన్ని అందించడమేగాక, ప్రజా పోరాటాల నిర్మాణానికి దోహదపడిన కవులు, రచయితల పేర్లు బుక్‌ఫెయిర్‌లోని పలు వేదికలకు పెట్టడం మంచి విషయమంటూ నిర్వాహకులను సీఎం అభినందించారు.


పుస్తకాల నుంచే ఎంతో నేర్చుకున్నా

‘కొత్తతరానికి తెలిసిందల్లా సమాచారం కోసం గూగుల్‌ను ఆశ్రయించడమే. అందులో ఎవరు సమాచారం ముందుగా పొందుపరిస్తే, దాన్నే నిజం అనుకుంటారు. తద్వారా వాస్తవం ఏమిటో బోధపడదు. నిజానికి, చరిత్ర పుస్తకాలు చదవడం ద్వారా గొప్పవ్యక్తుల త్యాగాలను తెలుసుకోగలం. అందుకే యువత తప్పనిసరిగా చరిత్ర పుస్తకాలు చదవాలి’ అని రేవంత్‌ సూచించారు. పుస్తకాల ద్వారా సముపార్జించిన జ్ఞానంతోనే తాను.. ఉమ్మడి ఏపీలో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంలోనూ, అనంతరకాలంలో తెలంగాణ ఉద్యమ చరిత్ర రచనల్లోని అసమగ్రతను, వక్రీకరణలను ప్రశ్నించగలిగానని తెలిపారు. ఆనాడు సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి వంటి మహనీయులు మొదలు, తర్వాత కాలంలో గద్దర్‌, గూడ అంజన్న లాంటి కవులు, కళాకారులు ఎంతోమంది తనలాంటి వారికి నిజమైన తెలంగాణ ఆకాంక్షలను గుర్తెరగడానికి కావాల్సిన స్ఫూర్తిని అందించారన్నారు.


అటువంటి పోరాట యోధుల ఉజ్వల చరిత్రను యువతరానికి అందించటానికి పుస్తక ప్రదర్శన ప్రధాన వేదిక కావాలని ఆకాంక్షించారు. కాగా, హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ సొసైటీకి గ్రంథాలయం, పుస్తకావిష్కరణల వేదికతో కూడిన శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సభాముఖంగా కార్యనిర్వాహకులు సీఎంను కోరారు. దీనిపై రేవంత్‌ స్పందిస్తూ, శాశ్వత భవనం ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. సొసైటీకి అవసరమైన వసతుల మీద ఒక నివేదికను రూపొందించి ప్రభుత్వానికి ఇవ్వవలసిన బాధ్యతను ఎమ్మెల్సీ కోదండరామ్‌కు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌.. పుస్తక పఠనం ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రసంగించారు. రోజులో కనీసం అరగంటైనా పఠనానికి సమయం కేటాయించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన 37 ఏళ్ల చరిత్రలో.. బుక్‌ ఫెయిర్‌ ప్రారంభోత్సవానికి హాజరైన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అని బుక్‌ఫెయిర్‌ అధ్యక్షుడు, కవి యాకూబ్‌ తెలిపారు. సమాజం పట్ల సీఎంకు ఉన్న నిబద్ధతకు ఇదే నిదర్శనమని కొనియాడారు.

Updated Date - Dec 20 , 2024 | 03:50 AM