Share News

CM Revanth Reddy: స్థానిక సంస్థల ఎన్నికలు బీసీల లెక్క తేలాకే!

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:34 AM

రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

CM Revanth Reddy: స్థానిక సంస్థల ఎన్నికలు బీసీల లెక్క తేలాకే!

  • కాంగ్రెస్‌ కార్యకర్తలను గెలిపించుకుంటాం

  • మా క్యాడర్‌ జోలికి వస్తే ఒళ్లు చింతపండే

  • మనవాళ్ల ఇంటికి వస్తామని వాళ్లే అన్నారు

  • తీరా మనవాళ్లే వెళ్తే.. తన్నారంటున్నారు

  • చూసుకుందాం రమ్మని ఎందుకు పిలిచినట్లు?

  • రాజీనామా చేస్తానన్న సన్నాసి ఏమయ్యాడు?

  • మహేశ్‌గౌడ్‌ టీపీసీసీ చీఫ్‌ కావడం సంతోషకరం

  • ఇద్దరం సమన్వయంతో పనిచేస్తాం: సీఎం రేవంత్‌

  • మహేశ్‌గౌడ్‌ బాధ్యతల స్వీకారంలో వ్యాఖ్యలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. బీసీ కమిషన్‌ ద్వారా రానున్న మూడు, నాలుగు నెలల్లో బీసీ జనాభా లెక్కలు తీస్తామని, ఆ వర్గాలకు దక్కాల్సిన వాటా ఇచ్చి.. ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమితుడైన బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆదివారం గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఇందిరాభవన్‌ ఆవరణలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. బీసీ నేత అయిన మహేశ్‌కుమార్‌గౌడ్‌.. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం తామందరికీ సంతోషం కలిగిస్తోందన్నారు. 2023 ఎన్నికలు సెమీఫైనల్స్‌ మాత్రమేనని, 2029 పార్లమెంటు ఎన్నికలు ఫైనల్స్‌ అని సీఎం అభివర్ణించారు.


ఆ ఎన్నికల్లో కాంగ్రె్‌సను గెలిపించి రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. ఎవరైనా తమ కార్యకర్తల జోలికివస్తే ఊరుకోబోమని, కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇక.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి కారణమైన కార్యకర్తలను సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, మునిసిపల్‌ చైర్మన్లుగా గెలిపించుకునే బాధ్యత తనపైనా, మహేశ్‌కుమార్‌గౌడ్‌ పైనా ఉందన్నారు. ఈ విషయంలో తామిద్దరమూ సమన్వయం చేసుకుని ముందుకుపోతామని తెలిపారు. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలు నాయకులకు సంబంధించినవని, ఇకపై జరిగే ఎన్నికలు.. కాంగ్రెస్‌ జెండాలు మోసిన కార్యకర్తలకు సంబంధించినవని పేర్కొన్నారు. కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత తామందరిపైనా ఉందని, వారి గెలుపు కోసం తమ ఎన్నికల కంటే ఎక్కువగా కష్టపడతామని చెప్పారు.


  • ఒక్కొక్కటిగా గ్యారెంటీల అమలు

తాను 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లానని, ఇంద్రవెల్లి వేదికగా సమరశంఖం పూరించి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామని రేవంత్‌రెడ్డి తెలిపారు. తానొకవైపు, భట్టి విక్రమార్క మరోవైపున పల్లె పల్లెనా పాదయాత్ర చేశామని గుర్తు చేశారు. రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటప్రకారం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేశామన్నారు. రాష్ట్రంలోని 23 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు వేసి వ్యవసాయం పండుగ అని నిరూపించామన్నారు. తుక్కుగూడ సభలో సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. పంద్రాగస్టు లోగా రూ.2 లక్షల మేరకు రైతు రుణమాఫీ చేస్తానని యాదగిరిగుట్ట నరసింహస్వామి సాక్షిగా ప్రకటించి.. ఇచ్చిన మాటప్రకారం భద్రాద్రి రాములవారి సాక్షిగా పంద్రాగస్టున అమలు చేశామని సీఎం రేవంత్‌ అన్నారు. ‘‘పంద్రాగస్టు కల్లా రూ.2 లక్షల రుణమాఫీ అమలైతే రాజీనామా చేస్తానని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు సవాల్‌ చేశాడు.


ఆ సన్నాసి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడు?’’ అని ప్రశ్నించారు. రూ.2 లక్షల పైన రుణం ఉన్న రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రూ.2 లక్షల పైన ఉన్న రుణాన్ని బ్యాంకులో చెల్లించాలని, మరుక్షణమే ఆ రూ.2 లక్షలు ఆయా రైతుల ఖాతాలో వేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాబోయే పంట నుంచి సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తామని సీఎం ప్రకటించారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం.. అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలు ఇచ్చామన్నారు. మరో 35 వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేశామని, ఈ ఏడాది చివరికల్లా ఆ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదని అన్నారు. నిరుద్యోగులకు నైపుణ్యం అందించేందుకు యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని తెలిపారు.


దేశంలో 140 కోట్ల మంది జనాభా, అందులో 50 శాతం యువత ఉన్నా.. ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా రాకపోవడం అవమానం కాదా? అని ప్రధాని మోదీని సీఎం ప్రశ్నించారు. వచ్చే ఒలింపిక్స్‌ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దీక్ష పూనిందని, త్వరలో రాష్ట్రంలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 2028 ఒలింపిక్స్‌లో దేశం తరఫున బంగారు పతకాలు సాధించే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇక రీజినల్‌ రింగ్‌ రోడ్డును తీసుకువచ్చి హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని, ముచర్లలో ఫోర్త్‌ సిటీని అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్లేందుకుగాను పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించే అధ్యక్షుడు ఉండాలని అధిష్ఠానాన్ని తాను కోరానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.


అధిష్ఠానం అన్నివిధాలా ఆలోచించి బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తనదైన పాత్ర పోషించిన మహేశ్‌కుమార్‌గౌడ్‌ను అధ్యక్షుడిగా నియమించిందన్నారు. మొన్నటి ఎన్నికల్లో గెలుపు సెమీ ఫైనల్స్‌ మాత్రమేనని, ఫైనల్స్‌ 2029లో ఉంటాయని సీఎం చెప్పారు. ప్రధాని మోదీని ఓడించి రాహుల్‌గాంధీని ప్రధానిని చేసినప్పుడే ఫైనల్స్‌లో కాంగ్రెస్‌ గెలిచినట్లని వ్యాఖ్యానించారు. వచ్చే పదేళ్లూ రాష్ట్రంలో కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని, 2029 పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 15 సీట్లు గెలిస్తేనే ఫైనల్స్‌లో గెలిచినట్లవుతుందని పేర్కొన్నారు. అప్పటివరకూ ఎవరమూ విశ్రమించవద్దన్నారు.


  • కార్యకర్తల జోలికొస్తే చింతపండే

‘‘నిన్న.. మొన్న మన కార్యకర్తలపై దాడులు చేసే ప్రయత్నాలు జరిగినయి. మనింటికి వస్తమని చెప్పిన్రు. కానీ, మనోళ్లే వాళ్ల ఇంటికి పోయిన్రు. చింతపండు అయినాక.. మా ఇంటికి వచ్చి తన్నారని అంటున్రు. రా.. చూసుకుందామని ఎందుకు పిలిచినట్లు?’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తమ కార్యకర్తలు ఎవరి జోలికీ పోరని, ఎవరైనా తమ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే మాత్రం చింతపండు అవుతుందని హెచ్చరించారు. మహేశ్‌కుమార్‌ సౌమ్యుడై ఉండవచ్చని, కానీ.. ఆయన వెనకాల తానున్నానన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ‘‘మా ఆటలు సాగుతయి.. ఊర్లలో మా ఇష్టం వచ్చినట్లు చేయవచ్చని ఎవరైనా అనుకుంటే.. ఒక్కొక్కడికి ఉంటది’’అని హెచ్చరిక జారీ చేశారు.


  • హైడ్రాను ఆపొద్దు..!

హైడ్రా హైడ్రా అనేది చరిత్రాత్మక నిర్ణయమని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ దీనిని ఆపొద్దని, హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా జిల్లాలకూ విస్తరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. హైదరాబాద్‌.. చెరువులు, గుట్టల నగరమని, గత పదేళ్లలో యథేచ్చగా చెరువులను కబళించారని ఆరోపించారు. చెరువులను యథాతథ స్థితికి తీసుకువచ్చే వరకు హైడ్రా కార్యకలాపాలు కొనసాగాలన్నారు. ఇది మన పిల్లలు, మనవల వరకు ఉపయోగపడే కార్యక్రమమన్నారు. అయితే తెలియక చెరువుల్లో ఇళ్లు కట్టుకున్న పేదలకు పునరావాసం కల్పించాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నిర్మించేందుకు స్థలం కావాలని సీఎం రేవంత్‌ను కోరారు.


వారంలో ఇద్దరు మంత్రులు గాంధీభవన్‌కు రావాలని, బుధవారం ఒకరు, శుక్రవారం ఒకరు కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఆయా శాఖలకు సంబంధించిన విజ్ఞప్తులు స్వీకరించాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా నెలలో రెండుసార్లు గాంధీభవన్‌కు రావాలని విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. నిబద్ధతతో పనిచేసే ప్రతి కార్యకర్తకూ పార్టీలో సముచిత స్థానం ఉంటుందనడానికి మహేశ్‌కుమార్‌గౌడ్‌ నియామకమే నిదర్శనమన్నారు. సెప్టెంబరు 17పై బీజేపీ ఏవేవో ప్రకటనలు చేస్తోందని, కానీ.. హైదరాబాద్‌ విలీనం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆ పార్టీ పాత్ర ఏముందని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ కార్యకర్తలపై కేసులను ఎత్తివేయాలని వీహెచ్‌ కోరారు. చాలా కాలం తర్వాత బీసీ నాయకత్వం రావడం సంతోషమన్నారు.


  • అట్టహాసంగా కాంగ్రెస్‌ ర్యాలీ

  • గన్‌పార్కు వద్ద మహేశ్‌కుమార్‌ నివాళి

హైదరాబాద్‌ సిటీ/అఫ్జల్‌గంజ్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ పదవీ బాధ్యతల స్వీకరణ సందర్భంగా గన్‌పార్కు నుంచి గాంధీభవన్‌ వరకు కాంగ్రెస్‌ ర్యాలీ అట్టహాసంగా నిర్వహించారు. దారి పొడవునా భారీ జెండాలతో నిర్వహించిన ర్యాలీ డప్పుల మోతలు, డీజే సౌండ్‌లతో కోలాహలంగా సాగింది. ఉదయం నుంచే గన్‌పార్కు ప్రాంతంలో సందడి నెలకొంది. గాంధీభవన్‌ వైపు వచ్చే మార్గాలన్నీ ప్లెక్సీలతో నిండిపోగా.. ర్యాలీ ప్రారంభమయ్యే గన్‌పార్కు నుంచి గాంధీభవన్‌ వరకు నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా, మహేశ్‌కుమార్‌గౌడ్‌.. నార్సింగిలోని తన నివాసంలో పూజలు చేసుకొని ఇంటి నుంచే ఓపెన్‌ టాప్‌ జీపులో భారీ వాహన శ్రేణితో గన్‌పార్కు వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తల నినాదాల మధ్య గన్‌పార్కులోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా ఆయనకు గాంధీటోపీని ధరింపజేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ఓపెన్‌ టాప్‌ జీపులో భారీ ర్యాలీ మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమైంది. పోలీసు కంట్రోల్‌రూమ్‌, దామోదరం సంజీవయ్య విగ్రహం, పబ్లిక్‌ గార్డెన్‌, నాంపల్లి చౌరస్తా నుంచి గాంధీభవన్‌కు చేరుకుంది. ర్యాలీ అరగంటకు పైగా సాగింది. గాంధీభవన్‌ పరిసరాలన్నీ కాంగ్రెస్‌ కార్యకర్తలతో సందడిగా మారాయి. జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు గన్‌పార్కు వద్దకు చేరుకోవడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది.

Updated Date - Sep 16 , 2024 | 03:34 AM