Share News

రూ.వెయ్యి పెన్షన్‌ చెల్లింపు సిగ్గు చేటు

ABN , Publish Date - Oct 21 , 2024 | 04:31 AM

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడంతోపాటు రూ.26 వేల కనీస వేతనం, సామాజిక భద్రత కోసం ఉద్యమించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

రూ.వెయ్యి పెన్షన్‌ చెల్లింపు సిగ్గు చేటు

  • రూ.7,500 పెన్షన్‌ సిఫారసును మోదీ ప్రభుత్వం తొక్కిపెట్టింది

  • కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి

  • సామాజిక భద్రతకు ఉద్యమించాలి

  • టీయూసీఐలో ఐఎ్‌ఫటీయూ విలీన సభలో వక్తల పిలుపు

రాంనగర్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడంతోపాటు రూ.26 వేల కనీస వేతనం, సామాజిక భద్రత కోసం ఉద్యమించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ట్రేడ్‌ యూనియన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (టీయూసీఐ)లో ఐఎ్‌ఫటీయూ తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘం విలీన సభ జరిగింది. ఐఎ్‌ఫటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో టీయూసీఐ ఆలిండియా ఉపాధ్యక్షుడు అలీక్‌ చక్రవర్తి (బెంగాల్‌), టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షులు ఉమాకాంత్‌ (ఢిల్లీ), ఎన్‌టీయూఐ ఆలిండియా కార్యదర్శి దేవ బ్రధ శర్మ (అసోం), టీయూసీఐ మహారాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌ నట్కర్‌, ఐఎ్‌ఫటీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, ఉపాధ్యక్షులు ఎస్‌.ఎల్‌.పద్మ, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, హెచ్‌ఎంఎ్‌స రాష్ట్ర కార్యదర్శి రెబ్బ రామారావు తదితరులు మాట్లాడారు.


కార్మికులు జమచేస్తున్న ప్రావిడెంట్‌ ఫండ్‌కు రూ.వెయ్యిలోపు పెన్షన్‌ చెల్లించడం సిగ్గు చేటు అని, కార్మిక వర్గానికి సరైన సామాజిక భద్రత కల్పించడంలో కేంద్రం విఫలమైందని కృష్ణ విమర్శించారు. ప్రావిడెంట్‌ ఫండ్‌ ట్రస్ట్‌ బోర్డు.. రిటైర్‌ అయిన కార్మికులకు నెలకు రూ.7,500 పెన్షన్‌ ఇవ్వాలనే సిఫారసును గత పదేళ్లుగా మోదీ ప్రభుత్వం తొక్కి పెట్టడాన్ని తీవ్రంగా నిరసించారు. కార్మికులు మరింత పట్టుదలతో ఉద్యమించి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలను నవీకరిస్తున్నామనే సాకుతో 29 కార్మిక, ప్రయోజన సంక్షేమ చట్టాలను 4 లేబర్‌ కోడ్స్‌గా మార్చి కేంద్ర ప్రభుత్వం గత కార్మిక హక్కులను హరించే చర్యలు చేపట్టిందని అలీక్‌ చక్రవర్తి అన్నారు.


దేశంలో కార్మికవర్గం మరింతగా ఐక్యం కావాలన్నారు. కార్మిక సంఘ నిర్మాణ చట్టం అమల్లోకి వచ్చి 98 ఏళ్లు గడుస్తున్నా కార్మిక సంఘాన్ని నిర్మించుకుంటే సహించని యజమాన్యం ఇప్పటికీ దేశంలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో అనేక రంగాల్లో పనిచేస్తున్న ఐఎ్‌ఫటీయూ రాష్ట్ర కమిటీ టీయూసీఐలో చేరడాన్ని ఉమాకాంత్‌ ఆహ్వానించారు. శ్రమజీవులకు సరైన భద్రత, వేతనాలు, హక్కుల అమలుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్మిక సంక్షేమ బోర్డు కనీస పెన్షన్‌ రూ.7,500 ఇవ్వాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు ఎం.హన్మేష్‌, ఎం.నరేందర్‌, కె.రాజన్న, సి.వెంకటేష్‌, జి.రామయ్య, పి.అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 04:31 AM