Kumaram Bheem Asifabad: ఆందోళనలో చేనేతన్న
ABN , Publish Date - Sep 15 , 2024 | 10:31 PM
కాగజ్‌నగర్ టౌన్, సెప్టెంబరు 15: జిల్లాలో ఎక్కువ శాతం ఉన్న చేనేత కార్మికులకు ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా వీరి బతుకులు మాత్రం మారడం లేదు.
- దశాబ్దాలు గడుస్తున్న మారని బతుకులు
- బిల్లులు రాక ఇక్కట్లు
- వృద్ధ కార్మికులకే చేనేత పరిమితం
కాగజ్‌నగర్ టౌన్, సెప్టెంబరు 15: జిల్లాలో ఎక్కువ శాతం ఉన్న చేనేత కార్మికులకు ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా వీరి బతుకులు మాత్రం మారడం లేదు. కులవృత్తిని నమ్ముకున్న కుటుంబాలు ఇతర వృత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. తాము బతకడంతోపాటు మరికొంత మందికి ఉపాధి కల్పించాల్సిన చేనేత కార్మికులు బతుకుదెరువు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. దీంతో ఇతర వృత్తివ్యాపారాల్లోకి వెళ్లిపోతున్నారు. కాగజ్‌నగర్ సొసైటీలో గతంలో 60మంది పనిచేసేవారు. ప్రస్తుతం వయోభారంతోపాటు ఇతర కారణాలతో వారిలో కొంతమంది వేరేవృత్తిలోకి వెళ్లగా కేవలం 30మందితోనే ప్రస్తుతం సొసైటీని నడిపిస్తున్నారు. ఈ సొసైటీ ద్వారా చేనేత కార్మికులకు పని కల్పించి వారు తయారు చేసిన బెడ్ షీట్స్, కార్పెట్స్‌ను ప్రభుత్వం ఆధ్వర్యంలోని హాస్టళ్లకు సప్లయ్ చేస్తారు. వాటిపై వచ్చే బిల్లులను త్వరగా మంజూరు చేయక రోజు వారి కూలీగా వచ్చే రూ. 250నుంచి 450కూడా రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
సర్‌సిల్క్‌మిల్లు మూసివేతతో..
35సంవత్సరాల క్రితం సర్‌సిల్క్(వస్త్ర పరిశ్రమ) మూతపడడంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాగజ్‌నగర్‌లోని ఈ మిల్లులో వేలాది మంది పని చేస్తుండేవారు. వారంతా తదనంతర కాలంలో మహారాష్ట్రలోని షోలాపూర్, బీవండి, హైదరాబాద్, సూరత్ తదితర పట్టణాలకు వెళ్లి జీవనోపాధి కొనసాగిస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్న కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం కాగజ్‌నగర్ చేనేత సహకార సంఘం ఉత్పత్తులు, విక్రయ సంఘాన్ని 2002లో భవనం మంజూరు చేసి నిర్మించింది. ఈ సొసైటీ ద్వారా పలువురు మహిళా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. మిల్లు మూసివేసినప్పటి నుంచి కేవలం నామమత్రంగా బతుకులు వెళ్లతీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చేనేత కార్మికులకు చేయూతను అందించే దిశగా ప్రవేశపెట్టిన పథకాలు మధ్యలో నిలిచిపోవడంతో పూట గడవని పరిస్థితి ఉంది.
నిలిచిన చేనేత మిత్ర
చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే చేనేత మిత్ర పథకం కొంతకాలంగా నిలిచిపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చేనేత కార్మికులకు రూ.2000, అనుబంధ కార్మికుడికి నెలకు రూ.500 చేనేత చేయూత (థ్రిఫ్ట్ పథకం) కింద ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ పథకం నిలిచిపోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల కిందట చేనేత సొసైటీని సందర్శించిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు చేనేతల సంక్షేమానికి తగిన నిధులు ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు కార్మికులు పేర్కొన్నారు. అలాగే చేసిన పనికి వచ్చే మొత్తం కూలీకి రెట్టింపుగా వచ్చే రికరింగ్ డిపాజిట్ పథకం కూడా పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. దీంతోపాటు వ్యక్తిగత రుణాలు మాఫీ చేసి, ముద్ర రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులు నేసిన వస్త్రాలకు నిలిపి వేసిన బిల్లులు మంజూరు చేస్తే అటు ఉపాధితో పాటు మరోవైపు వడ్డీ భారం తగ్గినట్లు అవుతుందని పేర్కొంటున్నారు.
బిల్లులు మంజూరు చేసి ఆదుకోవాలి..
-నల్ల కనకయ్య, చేనేత సహకార సొసైటీ కార్యదర్శి
కాగజ్‌నగర్ చేనేత సహకార సంఘంలో పనిచేసిన కార్మికులకు కొద్ది రోజులుగా బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు ఇప్పించాలి. అలాగే ముద్ర, ఇతరరుణాలు, వడ్డీమాఫీ, చేనేత చేయూత, థ్రిఫ్ట్ తదితర పథకాలను కొనసాగించి కార్మికులకు సహకరించి ఆదుకోవాలి.