Kumaram Bheem Asifabad: అభివృద్ధికి నోచుకోని ‘గిరి’గ్రామాలు
ABN , Publish Date - Oct 20 , 2024 | 11:02 PM
కాగజ్‌నగర్, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉన్న పలు గిరి గ్రామాలకు రవాణా వ్యవస్థ సక్రమంగా లేక గిరిజనులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.
-కానరాని రహదారి సౌకర్యాలు
-చిన్నపాటి వర్షానికే దారులన్నీ బురదమయం
-ఇబ్బందులు పడుతున్న గిరిజనులు
-నారాపూర్‌కు వంతెన, రోడ్డు లేక తంటాలు
-అవస్థలు పడుతున్న ఐదుగూడేల ప్రజలు
కాగజ్‌నగర్, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉన్న పలు గిరి గ్రామాలకు రవాణా వ్యవస్థ సక్రమంగా లేక గిరిజనులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. కాగజ్‌నగర్ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న నారాపూర్, గోంది, మారిగూడ, తుమ్రిగూడ, భీమన్‌గోంది గ్రామాల ప్రజలు రోడ్డుసౌకర్యంతోపాటు ఇతర వసతరులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాలకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేదు. అలాగే అనుసంధానంగా ఉన్న వంతెన పూర్తిగా తెగి పోయింది. చిన్నపాటి వర్షం వస్తే చాలు రవాణా సౌకర్యం పూర్తిగా స్తంభించిపోతుంది. రాత్రి వేళల్లో అత్యవసరమొస్తే దేవుడిపై భారం వేసి కాలం గడపాల్సిన పరిస్థితి. నారాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా బురదమయంగా ఉంది. బండలు తేలి ఉండటంతో ద్విచక్ర వాహనం వెళ్లేందుకు కూడా వీలుండదు. ఈ గ్రామంలో 25 కుటుంబాల గిరిజనులు నివసిస్తున్నారు. వీరందరికి పంట పొలాలే జీవనాధారం. ఈ గ్రామానికి ముందు ఉన్న వంతెన పూర్తిగా కూలి పోయింది. వంతెన బాగుచేయాలని పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కూడా ఇంతవరకు పరిష్కరించ లేదని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారులు, నాయకులు తమ గ్రామానికి వచ్చిపోతున్నా కూడా ఇంతవరకు సమస్య పరిష్కరించ లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇక వర్షాకాలంలో బాహ్యా ప్రపంచానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి దాపురించిందని గిరిజనులు పేర్కొంటున్నారు.
వర్షం వస్తే భయమేస్తుంది..
-మానేపల్లి భీమయ్య, నారాపూర్
వర్షం వచ్చిందంటే చాలు తమ గ్రామానికి రహదారి సౌకర్యం ఉండదు. బండలు తేలిన బురదరోడ్డు ఉంటుంది. ద్విచక్ర వాహనంపై కూడా వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. తమ గ్రామానికి సమీపంలో వంతెన ఉంది. ఈ వంతెన పూర్తిగా నీట మునుగుతుంది. అత్యవసరమోస్తే దేవుడిపైనే భారం వేస్తాం. చాలా దుర్భరమైన పరిస్థితిలో కాలం వెళ్లదీస్తున్నాం. అధికారులు, నాయకులకు చెప్పిన కూడా ఇంత వరకు ఎలాంటి పరిష్కారం కాలేదు.
వంతెన నిర్మిస్తే చాలు..
-ఆత్రం పోశం, నారాపూర్
మాకు వంతెన నిర్మిస్తే సరిపోతుంది. చిన్నపాటి వర్షానికే గుట్టల నుంచి నీరు ఉధ్రుతంగా పారుతుంటుంది. దీంతో గ్రామానికి ముందు న్న చిన్న వంతెన మునిగిపోతుంది. ఏమీ చేయాలో అర్థం కాదు. అధికారులకు చెప్పిన కూడా పట్టించుకోవటం లేదు. నాయకులకు చెప్పినా కూడా పట్టించుకునే వారేలేరు. రాత్రి వేళల్లో ఏదైనా అయితే దేవుడిపైనే భారం వేస్తున్నాం.
వర్షాకాలం రాకపోకలుండవు..
-ఎమ్మాజీ, నారాపూర్
గ్రామానికి వంతెన, రోడ్డు లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం కాలం రాకపోకలుండవు. ఎండాకాలం, చలికాలం మాత్రం బండరాళ్ల మధ్య నుంచి కష్టం మధ్య రాకపోకలు చేస్తుంటాం. బండలు తేలిన, బురదతో నిండిన రోడ్డు ఉంటుంది. అధికారులు స్పందించి మా గూడేనికి రవాణా సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది.