Kumaram Bheem Asifabad: చీకట్లు తొలగి.. వెలుగులు నిండాలి..
ABN , Publish Date - Oct 30 , 2024 | 11:27 PM
ఆసిఫాబాద్, ఆక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): దీపం జ్ఞానానికి ప్రతీక.. ఏ శుభకార్యం జరిగినా జ్యోతి ప్రజ్వలనతోనే ప్రారంభిస్తాం.
- నేడు దీపావళి
- కళకళలాడుతున్న గృహాలు, వ్యాపార సముదాయాలు
- మార్కెట్‌లో దీపావళి సందడి
ఆసిఫాబాద్, ఆక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): దీపం జ్ఞానానికి ప్రతీక.. ఏ శుభకార్యం జరిగినా జ్యోతి ప్రజ్వలనతోనే ప్రారంభిస్తాం. దీపావళి నాటి వెలుగులు జగత్ నంతటిని కాంతిమయం చేస్తాయి. ప్రతివ్యక్తి జీవితంలో దీపావళి ఒక మరుపురాణి పండుగ.. ఈ రోజు మహిళలు బొమ్మల పండుగను జరుపుకుంటారు. ఇంట్లో బొమ్మల కొలువును ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారుల దీపావళి నాడు తమ దుకాణాలను ప్రత్యేకంగా అలంకరించుకుంటారు. లక్ష్మీపూజ చేస్తారు. నేడు దీపావళి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకోవానికి సిద్ధమయ్యారు.
మార్కెట్‌లో దీపావళి సందడి..
జిల్లా కేంద్రంలో దీపావళి సందడి నెలకొంది. దీపావళి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇక్కడి ప్రాంతవాసులు బుధవారం జరిపిన కొనుగోళ్లతో వ్యాపారసముదాయాలన్నీ కళకళలాడాయి. ప్రధానంగా స్టేషనరీ దుకాణాలు, వస్త్రదుకాణాలు, పూజా సామగ్రి విక్రయకేంద్రాల్లో సందడిగా మారాయి. దుకాణ సముదాయాలు ఉదయం నుంచి కొనుగోలుదారులతో బిజీగా కనిపించాయి. వ్యాపారులు ఉదయం వేళలో ముహుర్తం ప్రకారం స్టేషనరీ దుకాణాలకు వెళ్లి తమకు అవసరమైన ఖాతాబుక్‌లను కొనుగోలు చేశారు. లక్ష్మీపూజలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన పూజా సామాగ్రిని కొనుగోలు చేశారు. పట్టణంలోని వస్త్ర దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఏ షాపులో చూసినా సందడి కనిపించింది. రోడ్లపై పూల దుకాణాలు, ప్రమిదల విక్రయకేంద్రాలు వెలిశాయి. వ్యాపారులు తమ సంస్థలను రంగులతో తీర్చిదిద్దుతూ విద్యుత్‌బల్బులను అమర్చారు. విద్యుత్‌దీపాలతో విరజిమ్మే వెలుగులతో గృహాలు కళకళలాడాయి. ఇక టపాసుల విక్రయ కేంద్రాలకు పెద్దసంఖ్యలో ప్రజలు రావడంతో ఆసిఫాబాద్ పట్టణంలోని టపాసుల దుకాణాల వద్ద సందడి నెలకొన్నది. ఇక బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. మార్కెట్ ఎక్కడ చూసినా దీపావళి శోభ సంతరించుకుంది.