Share News

అమన్‌.. అదరహో

ABN , Publish Date - Aug 10 , 2024 | 06:39 AM

2008 నుంచి మన రెజ్లర్లు పతకం లేకుండా ఒలింపిక్స్‌ నుంచి వెనుదిరిగిందే లేదు. కానీ పారిస్‌లో మెడల్‌ మాత్రం అతి సమీపం వరకు వచ్చినట్టే వచ్చి చేజారింది. గెలవాల్సిన మ్యాచ్‌లో నిషా దహియా

అమన్‌.. అదరహో

57 కిలోల ఫ్రీస్టయిల్‌లో కాంస్యం కైవసం

భారత్‌ ఖాతాలో ఆరో పతకం

2008 నుంచి మన రెజ్లర్లు పతకం లేకుండా ఒలింపిక్స్‌ నుంచి వెనుదిరిగిందే లేదు. కానీ పారిస్‌లో మెడల్‌ మాత్రం అతి సమీపం వరకు వచ్చినట్టే వచ్చి చేజారింది. గెలవాల్సిన మ్యాచ్‌లో నిషా దహియా గాయంతో వైదొలగడం.. ఇక కనీసం రజతం ఖాయమనుకున్న వినేశ్‌ ఫొగట్‌పై అనర్హత వేటుతో భారత క్రీడాభిమాని ఆవేదన మరింత రెట్టింపయ్యింది. ఈసారిక రిక్తహస్తాలతో వెనుదిరగడమేనా అనుకున్న వేళ.. నేనున్నానంటూ.. 21 ఏళ్ల అమన్‌ సెహ్రావత్‌ ముందుకొచ్చాడు. సెమీస్‌లో ఓడిన అతను కాంస్య పతక పోరుకు సై అంటూ ఉడుం పట్టుతో ప్రత్యర్థిని పడగొట్టాడు. మెడల్‌ను సగర్వంగా మెడలో వేసుకుని త్రివర్ణపతాకాన్ని రెపరెపలాడించాడు.

పారిస్‌: కుస్తీలో భారత్‌ బోణీ కొట్టింది. పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్‌ విభాగంలో 21 ఏళ్ల అమన్‌ సెహ్రావత్‌ కాంస్య పతకం సాధించాడు. తద్వారా పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి రెజ్లర్‌గా అమన్‌ నిలిచాడు. శుక్రవారం ప్యూర్టోరికోకు చెందిన డారియన్‌ క్రజ్‌ను అమన్‌ 13-5 తేడాతో చిత్తుగా ఓడించాడు. తద్వారా 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ నుంచి భారత రెజర్లు పతకాలతోనే స్వదేశానికి వెళ్లే సంప్రదాయాన్ని కొనసాగించినట్టయ్యింది. అలాగే హరియాణాకు చెందిన అమన్‌కిది తొలి ఒలింపిక్స్‌ కావడం విశేషం. గురువారం జరిగిన సెమీస్‌లో అమన్‌ జపాన్‌ రెజ్లర్‌ రీ హిగుచి చేతిలో ఓడి కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. ఓవరాల్‌గా భారత్‌ తరఫున ఒలింపిక్‌ పతకం సాధించిన ఏడో రెజ్లర్‌గా అమన్‌ సెహ్రావత్‌ నిలిచాడు. సుశీల్‌ ఒక్కడే రెండు పతకాలు సాధించాడు.

పూర్తి ఆధిపత్యం

రాత్రి 11.10 గంటలకు ఆరంభమైన కాంస్య పోరులో అమన్‌ వ్యూహాత్మకంగా ప్రత్యర్థిపై పట్టు సాధించాడు. మొదట తను ప్రత్యర్థికి చిక్కకుండా రింగ్‌ దాటి బయటకు వెళ్లడంతో పాయింట్‌ కోల్పోయినా.. ఆ తర్వాత డారియన్‌ను పడేయడంతో రెండు పాయింట్లు సాధించి ఆధిక్యం పొందాడు. కానీ అటు డారియన్‌ కూడా వెంటనే కోలుకుని రెండు పాయింట్లతో పోటీ ఇచ్చాడు. ఆ వెంటనే అమన్‌ వేగంగా కదిలి పడగొట్టడంతో 4-3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఓ దశలో 6-5తో డారియన్‌ నుంచి కాస్త పోటీ ఎదురైనా ఆ తర్వాత తను అలిసిపోయినట్టు కనిపించాడు. అటు అమన్‌ మాత్రం పదేపదే అతడిని టేక్‌డౌన్‌ చేయడంతో పాయింట్లు వేగంగా పెరిగాయి. ప్రత్యర్థికి మరో పాయింట్‌ ఇవ్వకుండా 13-5తో ముగించడంతో భారత శిబిరంలో కంచు సంబరాలు ఆరంభయ్యాయి.

అతి పిన్న వయసులో ఒలింపిక్‌ పతకం సాధించిన భారత ప్లేయర్‌గా అమన్‌ (21 ఏళ్లు)

Updated Date - Aug 10 , 2024 | 06:39 AM