మనోళ్లు తగ్గేదేలె..
ABN , Publish Date - Sep 16 , 2024 | 05:21 AM
చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. అటు పురుషులు, ఇటు మహిళలు వరుసగా ఐదో రౌండ్లోనూ గెలుపొందారు. ఆదివారం జరిగిన పురుషుల విభాగంలో భారత్ 3-1తో అజర్‌బైజాన్‌ను...
భారత జట్లకు వరుసగా ఐదో గెలుపు
చెస్ ఒలింపియాడ్
బుడాపెస్ట్: చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. అటు పురుషులు, ఇటు మహిళలు వరుసగా ఐదో రౌండ్లోనూ గెలుపొందారు. ఆదివారం జరిగిన పురుషుల విభాగంలో భారత్ 3-1తో అజర్‌బైజాన్‌ను చిత్తుచేయగా.. మహిళల బృందం 2.5-1.5తో కజకిస్థాన్‌పై గెలిచింది. టోర్నీలో ఓటమన్నదే లేకుండా దూసుకెళుతున్న తెలుగు గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేశాడు. తెల్లపావులతో ఆడిన అర్జున్ 54 ఎత్తుల్లో రౌఫ్ మమెదోవ్ ఆట కట్టించగా, గుకేష్ 47 ఎత్తుల్లో అదిల్ సులేమన్లిపై గెలిచాడు. మరో గేమ్‌లో నిజత్ అబసోవ్‌తో ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు. ఇక ఆఖర్లో మమెదో షఖిర్యార్‌తో గేమ్‌ను విదిత్ సంతోష్ గుజరాతి డ్రాగా ముగించాడు. ఇక..కజకిస్థాన్‌తో పోరులో భాగంగా అసుబయేవా బిబిసార చేతిలో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక ఓటమిపాలైంది.
ఆ తర్వాత నుర్మాన్‌పై వంతికా అగర్వాల్ నెగ్గగా.. బలబయేవాతో గేమ్‌ను దివ్యా దేశ్‌ముఖ్ డ్రా చేసుకుంది. దీంతో నిర్ణాయక ఆఖరిగేమ్‌లో కమలిదెయోవా మెరుట్‌ను వైశాలి ఓడించి భారత్‌కు గెలుపును కట్టబెట్టింది.