శరద్ అదుర్స్.. తంగవేలు మరోమారు
ABN , Publish Date - Sep 05 , 2024 | 02:35 AM
భారత అథ్లెట్లు మంగళవారం అర్ధరాత్రి జరిగిన పోటీలలో నాలుగు పతకాలు సొంతం చేసుకున్నారు. పురుషుల హైజంప్ టీ63 విభాగంలో శరద్ కుమార్, మరియప్పన్ తంగవేలు రజత, కాంస్య పతకాలతో మెరిశారు...
భారత అథ్లెట్లు మంగళవారం అర్ధరాత్రి జరిగిన పోటీలలో నాలుగు పతకాలు సొంతం చేసుకున్నారు. పురుషుల హైజంప్ టీ63 విభాగంలో శరద్ కుమార్, మరియప్పన్ తంగవేలు రజత, కాంస్య పతకాలతో మెరిశారు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 కేటగిరీలో అజీత్ సింగ్, సుందర్ సింగ్ గుర్జార్ కూడా రజత, కాంస్య పతకాలు చేజిక్కించుకున్నారు. హైజంప్ టీ63లో 32 ఏళ్ల శరద్ కుమార్ 1.88 మీటర్ల దూరం దూకి రెండో స్థానం సాధించగా, 29 ఏళ్ల తంగవేలు మరియప్పన్1.85 మీటర్ల దూరంతో మూడో స్థానం దక్కించుకున్నాడు. మూడేళ్ల కిందట జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో తంగవేలు రజతం అందుకోగా, శరద్ కాంస్యం సాధించాడు. వరల్డ్ రికార్డు హోల్డర్, 19 ఏళ్ల ఫ్రెచ్ ఎజ్రా (అమెరికా) 1.94 మీటర్ల పారాలింపిక్స్ రికార్డు దూరంతో స్వర్ణం నెగ్గాడు.
జావెలిన్ త్రోలో రెండు, మూడు మనవే: పురుషుల ఎఫ్46 జావెలిన్ ఫైనల్ ఐదో రౌండ్లో సహచరుడు, వరల్డ్ రికార్డు హోల్డర్ సుందర్‌సింగ్ గుర్జార్ (64.96మీ.)ను వెనక్కు నెట్టిన అజీత్ సింగ్ రజత పతకం నెగ్గాడు. దాంతో గుర్జార్ కాంస్యానికే పరిమితమయ్యాడు. క్యూబా త్రోయర్ గెలెర్మో గొంజాలెజ్ (66.16మీ.) స్వర్ణ పతకం అందుకున్నాడు. పారాలింపిక్స్‌లో గుర్జార్‌కు ఇది వరుసగా రెండో కాంస్య పతకం. టోక్యో క్రీడల్లో అతడు మూడో స్థానంలో నిలిచాడు.