అదంతా ఫొటో షో!
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:24 AM
భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉషపై రెజ్లర్ వినేశ్ ఫొగట్ మండిపడింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఉష రాజకీయాలు చేసిందని ఆరోపణలు చేసింది. ఆమె తనకు అండగా నిలవలేదని..
ఉష రాజకీయం
ఐవోఏ ‘చీప్’ ట్రిక్స్
దుయ్యబట్టిన ఫొగట్
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉషపై రెజ్లర్ వినేశ్ ఫొగట్ మండిపడింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఉష రాజకీయాలు చేసిందని ఆరోపణలు చేసింది. ఆమె తనకు అండగా నిలవలేదని.. కేవలం ఫొటోకు ఫోజులిచ్చిందని విమర్శించింది. ఇటీవలే జరిగిన ఒలింపిక్స్ రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఫొగట్ ఫైనల్ చేరినా.. 100 గ్రాములు అధిక బరువు ఉందనే కారణంతో ఆమెపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. తనకు కనీసం రజతమైనా ఇవ్వాలని వినేశ్ చేసిన అప్పీలును క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (కాస్) కొట్టేసింది. అయితే, బరువు తగ్గే ప్రక్రియలో ఆమె నీరసించడంతో క్రీడాగ్రామంలో ఆసుపత్రిలో చేర్చారు. ఫొగట్‌ను ఉష పరామర్శించగా.. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, రాజకీయాల్లో భాగంగానే ఉష ఆ ఫొటోను పోస్టు చేసిందని ఓ ఇంటర్వ్యూలో వినేశ్ దుయ్యబట్టింది. ‘ఆసుపత్రిలో బెడ్‌పై ఉన్నప్పుడు ఉష నన్ను పరామర్శించింది. అప్పుడు ఒక ఫొటో తీసుకొన్నారు. రాజకీయాల్లో మూసిన తలుపుల వెనుక ఎన్నో జరుగుతాయి. పారి్‌సలో కూడా జరిగింది అలాంటిదే. అందుకే నా హృదయం ముక్కలైంది. నా రిటైర్మెంట్ నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలంటూ ఎంతో మంది కోరారు.
కానీ, నేనెందుకు కొనసాగాలి? రాజకీయాలనేవి ప్రతిచోటా ఉన్నాయ’ని వినేశ్ ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఫొటో తీసుకున్నట్టే తనకు తెలియదని తెలిపింది. ‘నాకు మద్దతుగా ఉన్నామనే విధంగా షో చేసేందుకు వచ్చి ఫొటో దిగారు. అందుకు నా అనుమతి కూడా తీసుకోలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో ప్రచారం చేసుకొన్నారు. వాళ్లు చేసిందంతా షో తప్ప ఏమీలేద’ని ఆమె ఘాటుగా విమర్శించింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున వినేశ్ బుధవారం నామినేషన్ దాఖలు చేసింది.