గిల్ సిద్ధం
ABN , Publish Date - Nov 30 , 2024 | 04:51 AM
గాయంతో తొలి టెస్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్ రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతను తొలిసారిగా
రోహిత్‌తో ప్రాక్టీస్
నేటినుంచి భారత్ వామప్ మ్యాచ్
కాన్బెర్రా: గాయంతో తొలి టెస్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్ రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతను తొలిసారిగా శుక్రవారం నెట్స్‌లో ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రాక్టీస్ సాగించాడు. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్‌శర్మ కూడా సాధన చేశాడు. స్థానిక మనూకా ఓవల్ మైదానంలో భారత ఆటగాళ్లు కాసేపు నెట్స్‌లో గడిపారు. డిసెంబరు ఆరు నుంచి రెండో టెస్టు జరుగనుంది. అయితే దానికి ముందు శనివారం నుంచి ప్రైమ్ మినిస్టర్ లెవన్‌తో భారత్ రెండు రోజుల వామప్ మ్యాచ్ ఆడనుంది. ముందుగా రోహిత్ మైదానంలోకి రాగా ఆ తర్వాత యశస్వీ జైస్వాల్, కోహ్లీ వారికి జత కలిశారు. అటు గిల్ బొటన వేలి గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నట్టు కనిపించింది. పేసర్లు ప్రసిద్ధ్, యష్ దయాళ్, ఆకాశ్‌ల బంతులను గిల్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అతడి ఫిట్‌నె్‌సపై సహాయక కోచ్ అభిషేక్ నాయర్ కూడా సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే బుమ్రా, సిరాజ్, హర్షిత్ మాత్రం ప్రాక్టీ్‌సకు దూరంగా ఉన్నా రు. మిగిలిన ఆటగాళ్లు గ్రౌండ్లో ఫుట్‌బాల్ ఆడారు. మరోవైపు వర్షం కురవడంతో టీమిండియా సాధన ఎక్కువసేపు సాగలేదు.
రోహిత్ ఏ స్థానంలో..?
రెండో టెస్టులో రోహిత్‌శర్మతోపాటు శుభ్‌మన్ గిల్ కూడా ఆడడం దాదాపు ఖాయమైనందున బ్యాటింగ్ ఆర్డర్ మరిం త పటిష్టంగా మారనుంది. వీరి రాకతో జట్టులో దేవ్‌దత్, జురెల్‌ల స్థానాలు గల్లంతైనట్టే. అయితే ఈ ఇద్దరినీ ఏ స్థానాల్లో ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ‘గిల్, రోహిత్ రాకతో మాకు సెలెక్షన్ డైలమా తప్పదు. ఇద్దరు టాప్ ప్లేయర్స్ జట్టులోకి తిరిగి వస్తే ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది’ అని అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తెలిపాడు. అయితే రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్‌పై అతడు పెదవి విప్పలేదు. అడిలైడ్ చేరుకున్నాక ఆ విషయం ఆలోచిస్తామని చెప్పాడు. అటు ఓపెనర్‌గా రాహుల్ మెరుగ్గానే ఆడడంతో పాటు తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌కు 201 పరుగులు అందించాడు. దీంతో ఫామ్‌లో లేని రోహిత్‌ను మిడిలార్డర్లో ఆడించే అవకాశాలు లేకపోలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.