Share News

విరిగిన చేయితో బరిలో దిగి సెంటీ మీటర్‌ తేడాతో..

ABN , Publish Date - Sep 16 , 2024 | 05:28 AM

గత టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో చరిత్రకెక్కి, ఈ ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో రజత పతకంతో డబుల్‌ ధమాకా సృష్టించిన స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా.. ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌ ఫైనల్లోనూ తనదైన ప్రదర్శనతో...

విరిగిన చేయితో బరిలో దిగి సెంటీ మీటర్‌ తేడాతో..

పట్టుదలకు సలాం..

కొన్నాళ్లుగా గాయంతోనే బాధపడుతున్న నీరజ్‌.. ఇటీవలి ఒలింపిక్స్‌ మినహాయిస్తే ఈ సీజన్‌లో ఒకేఒక్క అంతర్జాతీయ ఈవెంట్‌ను గెలిచాడు. జూన్‌లో ఫిన్లాండ్‌ వేదికగా జరిగిన పావో నుర్మి గేమ్స్‌లో స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత గజ్జల్లో కండరాల సమస్యతో బాధపడ్డ నీరజ్‌.. గాయంతోనే పారిస్‌ ఒలింపిక్స్‌ బరిలో దిగాడు. ఈ క్రమంలో ప్రాక్టీస్‌ సరిగా లేకున్నా కూడా విశ్వక్రీడల్లో పాల్గొన్నాడు. పారి్‌సలో ఈటెను ఏకంగా 89.45 మీటర్లు విసిరిన నీరజ్‌.. రెండోస్థానంలో నిలిచి వరుసగా రెండో ఒలింపిక్‌ పతకంతో చరిత్ర సృష్టించాడు. మళ్లీ ఇప్పుడు డైమండ్‌ లీగ్‌ ఫైనల్లోనూ గాయంతోనే పోటీపడి కేవలం సెంటీ మీటర్‌ తేడాతో టైటిల్‌ను చేజార్చుకున్న నీరజ్‌ పట్టుదలకు సలాం కొట్టకుండా ఉండలేం.


టైటిల్‌ మిస్సయిన నీరజ్‌ చోప్రా

డైమండ్‌ లీగ్‌ ఫైనల్లో రన్నర్‌పతో సరి

బ్రస్సెల్స్‌: గత టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో చరిత్రకెక్కి, ఈ ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో రజత పతకంతో డబుల్‌ ధమాకా సృష్టించిన స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా.. ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌ ఫైనల్లోనూ తనదైన ప్రదర్శనతో మెరిపించి ఈ సీజన్‌ను బాగానే ముగించాడు. శనివారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన లీగ్‌ సీజన్‌ ఫైనల్లో నీరజ్‌ రన్నరప్‌గా నిలిచాడు. 2022లో తొలిసారి డైమండ్‌ లీగ్‌ విజేతగా నిలిచిన నీరజ్‌.. ఈమారు కేవలం సెంటీమీటర్‌ తేడాతో టైటిల్‌ మిస్సయ్యాడు. ఈ బల్లెం వీరుడు మూడో ప్రయత్నంలో ఈటెను 87.86 మీటర్లు త్రో చేసి వరుసగా రెండో ఏడాది రెండోస్థానంలో నిలిచాడు. గ్రెనెడాకు చెందిన రెండుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ 87.87 మీటర్లు త్రో చేసి టైటిల్‌ విజేతగా నిలిచాడు. జర్మనీ త్రోయర్‌ జులియన్‌ వెబర్‌ 85.97 మీటర్ల త్రోతో మూడోస్థానంలో నిలిచాడు. పీటర్స్‌ తొలి ప్రయత్నంలోనే ఈటెను అత్యధిక దూరం విసరగా.. ఆ తర్వాత ఎవరూ అతడిని అందుకోలేకపోయారు. కాగా, కొద్దిలో విజయాన్ని దూరం చేసుకున్న నీరజ్‌ ఈ పోటీలకు గాయంతోనే బరిలోకి దిగడం గమనార్హం. ఫ్రాక్చర్‌ (విరిగిన) చేతితోనే ఫైనల్లో పోటీపడ్డ నీరజ్‌, నొప్పిని భరిస్తూనే ఈటెను విసిరాడు. గాయం విషయాన్ని అతడు పోటీలు ముగిశాక వెల్లడించాడు. విరిగిన తన ఎడమ చేతి ఎక్స్‌రే ఫొటోను కూడా సోషల్‌ మీడియాలో పో‘స్ట్‌ చేశాడు.


‘ఈ టోర్నీకోసం ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు చేతి గాయానికి గురయ్యా. ఎక్స్‌రే తీయిస్తే, ఎడమ చేతి నాలుగో వేలి దగ్గర ఎముక విరిగినట్టు బయటపడింది. అయినా, నా టీమ్‌ సహాయంతో బ్రస్సెల్స్‌లో పోటీపడ్డా. ఈ ఏడాదికి ఇదే నా చివరి పోటీ. నా అంచనాలను అందుకోలేకపోయినా, ఈ సీజన్‌లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. మరింత పట్టుదలగా పోరాడతా, పూర్తి ఫిట్‌గా మీ ముందుకొస్తా. మళ్లీ 2025లో కలుద్దాం’ అని 26 ఏళ్ల నీరజ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. నీరజ్‌.. సాధారణంగా కుడిచేతితో ఈటెను విసిరిన వెంటనే ఫాలోత్రూ యాక్షన్‌లో తన ఎడమ అరచేతిని బలంగా నేలపై ఉంచుతాడు. కానీ, ఈసారి పోటీలకు ఎడమ అరచేతికి కట్టుతో దర్శనమిచ్చిన నీరజ్‌.. భరించరాని నొప్పి కారణంగా తన ఆరు ప్రయత్నాల్లోనూ అరచేతిని నేలపై ఉంచలేదు.

Updated Date - Sep 16 , 2024 | 05:29 AM