42 పరుగులకే ఢమాల్
ABN , Publish Date - Nov 29 , 2024 | 05:16 AM
దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 42 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో పర్యాటక జట్టు ఎన్నో చెత్త రికార్డుల్ని మూటగట్టుకుంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో లంకేయులకిది అత్యల్ప స్కోరు...
శ్రీలంక చెత్త రికార్డు
జాన్సెన్‌కు 7 వికెట్లు
దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్
డర్బన్: దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 42 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో పర్యాటక జట్టు ఎన్నో చెత్త రికార్డుల్ని మూటగట్టుకుంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో లంకేయులకిది అత్యల్ప స్కోరు. ఆ జట్టు గత అత్యల్ప స్కోరు 71. రెండు దశాబ్దాల కిందట క్యాండీలో పాకిస్థాన్‌పై ఆ స్కోరు సాధించింది. పేసర్ మార్కో జాన్సెన్ కెరీర్‌లో ఉత్తమ బౌలింగ్‌తో (6.5-1-13-7) చెలరేగడంతో శ్రీలంక 13.5 ఓవర్లలోనే కుప్పకూలింది. దాంతో గత వందేళ్లలో టెస్ట్ క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో (78) ఆలౌట్ అయిన జట్టుగా కూడా లంకేయులు మరో రికార్డు సొంతం చేసుకున్నారు. కాగా..తన స్పెల్‌లో ఏడు ఓవర్లలోపే ఏడు వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా జాన్సెన్ రికార్డు సృష్టించాడు. 1924లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా స్పిన్నర్ హగ్ టంబెల్ (6.5-0-28-7) తొలిసారి ఈ ఫీట్ నమోదు చేశాడు.
అంతకుముందు ఓవర్‌నైట్ 80/4 స్కోరుతో గురువారం మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టు 191 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంకను స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన సఫారీలు..రెండో ఇన్నింగ్స్‌లో రెండోరోజు ఆఖరికి 132/3 స్కోరు చేశారు. ఓవరాల్‌గా 281 పరుగుల ఆధిక్యంలో నిలిచారు.