Duleep trophy: ఇండియా-డీ జట్టుపై ఇండియా-ఏ జయభేరి
ABN , Publish Date - Sep 15 , 2024 | 08:38 PM
దులీప్ ట్రోఫీలో ఇండియా- ఏ జట్టు విజయభేరి మోగించింది. ఆదివారం ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్‌లో ఇండియా- డీతో జరిగిన మ్యాచ్‌లో 186 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తెలుగు తేజం రిక్కీ భుయ్ వీరోచిత ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించినా.. అతనికితోడు ఎవరూ క్రీజ్‌లో నిలబడకపోవడంతో డీ జట్టు 301 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
186 పరుగుల తేడాతో విజయం
వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన తెలుగుతేజం రిక్కీ భుయ్
సెంచరీతో కదంతొక్కిన యువ ఆటగాడు
ఇండియా- సీ, బీ మ్యాచ్ డ్రా
(అనంతపురం, సెప్టెంబర్ 15): దులీప్ ట్రోఫీలో ఇండియా- ఏ జట్టు విజయభేరి మోగించింది. ఆదివారం ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్‌లో ఇండియా- డీతో జరిగిన మ్యాచ్‌లో 186 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తెలుగు తేజం రిక్కీ భుయ్ వీరోచిత ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించినా.. అతనికితోడు ఎవరూ క్రీజ్‌లో నిలబడకపోవడంతో డీ జట్టు 301 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఏ -జట్టులో ఆల్ రౌండర్ సామ్స్ ములానీ 89 పరుగులతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీయడంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇండియా -సీ, బీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 8 వికెట్లతో పాటు 38 పరుగులు సాధించిన అన్షుల్ కాంబోజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎన్నికయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎన్నికైన వారికి అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ అవార్డులను అందజేశారు.
సెంచరీతో కదంతొక్కిన రిక్కీ భుయ్
488 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇండియా -డీ జట్టు ఓవర్‌నైట్ స్కోర్ 62/1తో ప్రారంభించింది. యష్‌దుబే, రిక్కీ భుయ్‌లు నెమ్మదిగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. యష్ దుబే 94 బంతుల్లో 5 బౌండరీల సహాయంతో 37 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. సెకండ్ డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కిల్ కేవలం ఒక పరుగు చేసి సామ్స్ ములానీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రిక్కీ భుయ్‌లతో జతకలిశారు. వీరిద్దరూ అవకాశం దొరికినప్పుడుల్లా బంతులను బౌండరీలుగా మలిచారు.
రిక్కీ భుయ్ 195 బంతులు ఎదుర్కొని 14 బౌండరీలు, 3 భారీ సిక్సర్ల సహాయంతో 113 పరుగులు చేశాడు. 41 పరుగులు చేసి శ్రేయస్ అయ్యర్ 41(8 ఫోర్లు) చేశాడు. శ్రేయస్ అవుటయ్యాక వికెట్ కీపర్ సంజు సామ్సన్, రిక్కీ భుయ్‌లు కాసేపు అలరించారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. రిక్కీ భుయ్ దూకుడు తగ్గలేదు. చూడచక్కని షాట్లతో అందరినీ అలరించాడు. దూకుడుగా ఆడుతున్న రిక్కీ భుయ్‌ను తనుష్ కొటియన్ అవుట్ చేశాడు. సౌరభ్‌కుమార్ 22, హర్షిత్ రాణా 24 పరుగులు చేశారు. ఇండియా-ఏ బౌలర్లలో సామ్స్ ములానీ 3, తనుష్ కొటియన్ 4, రియన్ పరాగ్, ఖలీల్ అహ్మద్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఇండియా సీ, బీ మ్యాచ్ డ్రా..
ఓవర్‌నైట్ స్కోర్ 309/7తో ప్రారంభించిన ఇండియా -బీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 108 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇండియా సీ జట్టుకు 193 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. ఇండియా బీ జట్టు కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 286 బంతుల్లో 157 (14 ఫోర్లు, సిక్సర్) పరుగులు చేశాడు. ఇండియా సీ బౌలర్ అన్షుల్ కాంబోజ్ 27.5 ఓవర్లలో 69 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. విజయకుమార్ ౖవైశాక్, మయాంక్ మార్ఖండే చెరో వికెట్ తీసుకున్నారు. అనంతరం ఇండియా-సీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 128/4 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జట్టులో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 93 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సహాయంతో 62 పరుగులు (అర్ధసెంచరీ) సాధించాడు. రజత్ పటీదార్ 84 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో 42 పరుగులు చేశాడు. ఇండియా-బీ బౌలర్లలో రాహుల్ చాహర్ 2, ముకేష్‌కుమార్, ముషీర్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.