పతకంపైనే గురి
ABN , Publish Date - Feb 13 , 2024 | 05:33 AM
బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షి్‌ప మంగళవారం ఇక్కడ మొదలవనుంది. పారిస్ ఒలింపిక్స్‌కు కీలకమైన పాయింట్లు లభించనుండడంతో టాప్ స్టార్లంతా ఈ టోర్నీ బరిలో దిగుతున్నారు...
బరిలో భారత పురుషులు, మహిళల జట్లు
నేటినుంచి ఆసియా టీమ్ బ్యాడ్మింటన్
షా ఆలమ్ (మలేసియా): బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షి్‌ప మంగళవారం ఇక్కడ మొదలవనుంది. పారిస్ ఒలింపిక్స్‌కు కీలకమైన పాయింట్లు లభించనుండడంతో టాప్ స్టార్లంతా ఈ టోర్నీ బరిలో దిగుతున్నారు. ఈ టోర్నీలో 2016, 2018లో కాంస్యాలు గెలిచిన భారత పురుషుల జట్టు.. ఈసారి పతకం రంగు మార్చాలన్న పట్టుదలతో ఉంది. హెచ్‌ఎ్‌స ప్రణయ్ సారథ్యంలోని లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, డబుల్స్ స్టార్లు సాత్విక్, చిరాగ్ తదితరులతో కూడిన భారత జట్టు గ్రూప్ ‘ఎ’లో బలమైన చైనా, హాంకాంగ్ జట్లతో తలపడనుంది. ఇప్పటిదాకా పతకమే సాధించని భారత మహిళల బృందం.. ఈసారైనా ఆ లోటును భర్తీ చేయాలన్న లక్ష్యంతో ఉంది. పీవీ సింధు ఆధ్వర్యంలో భారత మహిళల జట్టు గ్రూప్ ‘డబ్ల్యూ’లో తలపడుతోంది. ఈ గ్రూపులో భారత్, చైనా మాత్రమే ఉండడంతో.. మనకు ఇప్పటికే నాకౌట్ బెర్త్ ఖాయమైంది. సింగిల్స్‌లో సింధుతో పాటు అన్మోల్, తన్వీ శర్మ, అష్మిత, డబుల్స్‌లో గాయత్రి/ట్రీసా, అశ్విని/తనీషా ఆడనున్నారు. గాయంతో గతేడాది అక్టోబరు నుంచి ఆటకు దూరంగా ఉన్న సింధు ఈ టోర్నీ ద్వారా ఫామ్‌లోకి రావాలనుకుంటోంది. బుధవారం జరిగే తొలి పోరులో హాంకాంగ్‌తో భారత పురుషుల జట్టు.. చైనాతో సింధు బృందం తలపడతాయి.