Share News

Walking : ఇలా నడవండి...

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:12 AM

నడక ఆరోగ్యానికి మంచిది. రోజుకి కనీసం పదివేల అడుగులు వేయాలని నిపుణులు చెబుతున్నారు. అయితే నడిచే విధానంలో

Walking : ఇలా నడవండి...

నడక ఆరోగ్యానికి మంచిది. రోజుకి కనీసం పదివేల అడుగులు వేయాలని నిపుణులు చెబుతున్నారు. అయితే నడిచే విధానంలో కొన్ని పద్దతులు ఉన్నాయి. శరీరాన్ని దృఢంగా ఉంచుతూ వివిధ ఆరోగ్య సమస్యలను నివారించే నడకల గురించి తెలుసుకుందాం.

వేగంగా: నడుస్తూ మాట్లాడగలిగే వేగాన్ని అనుసరించాలి. కానీ పాట పాడగలిగేంత తక్కువ వేగం కాదు. గంటకు నాలుగు మైళ్ల వేగంతో భుజాలను కదిలిస్తూ నడవాలి. ఇలా రోజుకు అర్థ గంట చొప్పున వారానికి అయిదు రోజులు నడవడం వల్ల గుండెకు, ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌ బాగా అందుతుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం తప్పుతుంది. రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ స్థాయి తగ్గుతాయి.

శక్తితో: మొదట సాధారణంగా నడక ప్రారంభించి క్రమంగా వేగం పెంచాలి. భుజాలు, చేతులను కూడా వేగంగా ముందుకు, వెనక్కు కదిలేలా చూసుకోవాలి. మధ్యలో విరామం తీసుకోవచ్చు. ఈవిధంగా నడవడానికి ఎక్కువగా శక్తి ఖర్చవుతుంది. గంటకు అయిదు మైళ్ల వేగంతో రోజుకు ఒక మైలు ఇలా నడిస్తే శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఈ పద్దతి బాగా ఉపకరిస్తుంది.

ఎగుడు దిగుడు నేలపై: ఎత్తు పల్లాలు ఉన్న ప్రదేశాల్లో నడవడం వల్ల పాదాలు, మోకాళ్లలో కండరాలు ఉద్దీపనకు గురై బలంగా మారతాయి. కీళ్లు పట్టేయకుండా సులువుగా కదులుతాయి. శరీర భాగాలన్నీ సమన్వయంతో పనిచేస్తూ సమతాస్థితిలో ఉంటాయి. కాళ్లకు చెప్పులు వేసుకోకుండా రాళ్లు, ఇసుక ఉన్న నేలపై నడిస్తే పాదాలకు రక్తప్రసరణ అందుతుంది.

సన్నని కర్రలతో: ప్రత్యేకంగా రూపొందించిన సన్నని కర్రలను రెండు చేతులతో పట్టుకుని ముందుకు నడవాలి. దీనివల్ల వల్ల కాళ్లతోపాటు భుజాలు, చేతులు, మెడ కండరాలు బలోపేతమవుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కంటిచూపు మెరుగవుతుంది. ఊపిరి తీసుకోవడం, వదలడం ఒక క్రమ పద్దతిలో జరగడం వల్ల గుండె కొట్టుకునే వేగం సాధారణంగా ఉంటుంది. కర్రలు చాలా సన్నగా తక్కువ బరువు ఉండేలా చూసుకోవాలి. లేదంటే చేతి మణికట్టులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.

విరామంతో: నడక వేగాన్ని ఒక నిర్ణీత సమయానుసారం మారుస్తూ నడవడం వల్ల శరీరం జీవక్రియలను సక్రమంగా నిర్వహిస్తుంది. మొదట ఒక నిమిషం వేగంగా నడిచి తరవాత రెండు నిమిషాలు సాధారణంగా నడవాలి. ఇలా నడక వేగాన్ని మారుస్తూ ఉంటే ఓర్పు. సహనం, ఏకాగ్రత అలవడుతాయి.

వెనక్కి నడవడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది. శరీరం సరైన ఆకృతిలోకి మారుతుంది. మోకాళ్ల మీద ఒత్తిడి తగ్గుతుంది. నడిచే వేగం నియంత్రణలో ఉండడం వల్ల గుండె, ఊపరితిత్తులకు శ్రమ తగ్గుతుంది.

Updated Date - Nov 30 , 2024 | 12:12 AM