Share News

ప్రోస్టేట్‌ కేన్సర్‌ పని పడదాం!

ABN , Publish Date - Oct 01 , 2024 | 05:46 AM

విదేశాలతో పోలిస్తే, మన దేశంలో ప్రోస్టేట్‌ కేన్సర్‌ ఉధృతి తక్కువ. అయినప్పటికీ మొదటి స్థానంలో ఉన్న లంగ్‌ కేన్సర్‌ స్థానాన్ని అధిగమించే స్థాయికి ఈ కేన్సర్‌ కేసులు పెరిగి పోడానికి కారణం అప్రమత్తత లోపమే అంటున్నారు వైద్యులు.

ప్రోస్టేట్‌ కేన్సర్‌ పని పడదాం!

కుటుంబ చరిత్రలో పెద్దపేగు, ప్రోస్టేట్‌ కేన్సర్‌ ఉంటే, నడి వయసులో ఈ కేన్సర్‌ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 45 ఏళ్లకే వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలి.

విదేశాలతో పోలిస్తే, మన దేశంలో ప్రోస్టేట్‌ కేన్సర్‌ ఉధృతి తక్కువ. అయినప్పటికీ మొదటి స్థానంలో ఉన్న లంగ్‌ కేన్సర్‌ స్థానాన్ని అధిగమించే స్థాయికి ఈ కేన్సర్‌ కేసులు పెరిగి పోడానికి కారణం అప్రమత్తత లోపమే అంటున్నారు వైద్యులు. అందుబాటులో ఉన్న అత్యాధునిక వ్యాధి నిర్థారణ పరీక్షలతో ప్రోస్టేట్‌ కేన్సర్‌కు ఎలా అడ్డుకట్ట వేయవచ్చో వివరిస్తున్నారు.

మన దేశంలో పురుషుల్లో తలెత్తే రెండవ అత్యంత సాధారణ కేన్సర్‌ ఇది. మొదటిది... లంగ్‌ కేన్సర్‌. ధూమపానంతో లంగ్‌ కేన్సర్‌ సోకుతుందనే అవగాహన పెరగడంతో ఈ కేన్సర్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ రెండో స్థానానికి పరిమితమైన ప్రోస్టేట్‌ కేన్సర్‌ ఉధృతి ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఇందుకు కారణం ఈ కేన్సర్‌ పట్ల అవగాహన లేకపోవడమే! వయసుతో పాటు పెరిగే ఈ ప్రోస్టేట్‌ గ్రంథి మూత్రాశయం దిగువన నెలకొని ఉంటుంది. దీన్లోని కణాల్లో తలెత్తే అసహజ మార్పులు, కణ విచ్ఛిత్తి మూలంగా ప్రోస్టేట్‌లో కణితి ఏర్పడుతుంది. ఇలా గ్రంథికే పరిమితమైన కేన్సర్‌ను నయం చేయడం తేలిక. ఒకవేళ కేన్సర్‌ గ్రంథిని దాటి బయటకు విస్తరిస్తే, దాన్ని తీవ్రమైన కేన్సర్‌గా పరిగణించి తదనుగుణంగా చికిత్స చేయవలసి ఉంటుంది. కాబట్టి సులువైన చికిత్సతో ప్రోస్టేట్‌ కేన్సర్‌ నుంచి శాశ్వత విముక్తి పొందాలంటే, దాన్ని తొలినాళ్లలోనే కనిపెట్టడం అవసరం.

కారణాలు కోకొల్లలు

ప్రోస్టేట్‌ కేన్సర్‌ సోకడానికి ఎన్నో కారణాలున్నాయి. ప్రధానంగా 65 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో ఈ కేన్సర్‌ కనిపిస్తూ ఉంటుంది. అలాగే పెద్ద వయసుతో సంబంధం లేకుండా 40 నుంచి 45 ఏళ్లకే కేన్సర్‌ సోకే అవకాశాలూ లేకపోలేదు. అందుకు కారణాలున్నాయి.

జన్యుపరమైన కారణాలు: కుటుంబ చరిత్రలో పెద్దపేగు, ప్రోస్టేట్‌ కేన్సర్‌ ఉంటే, నడి వయసులో ఈ కేన్సర్‌ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 45 ఏళ్లకే వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలి.

మెటబాలిక్‌ సిండ్రోమ్‌: ఒబేసిటీ, అదుపు తప్పిన మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ కూడా ప్రోస్టేట్‌ కేన్సర్‌ సోకే అవకాశాలను పెంచుతాయి.

హెచ్చరికలను కనిపెట్టాలి

ప్రోస్టేట్‌ కేన్సర్‌ కొన్ని లక్షణాల రూపంలో బయల్పడుతూ ఉంటుంది. మూత్రాశయం దిగువన ఉంటుంది కాబట్టి కేన్సర్‌తో దీని పరిమాణం పెరగగానే మూత్రవిసర్జనలో ఇబ్బంది తలెత్తుతుంది. విసర్జన కష్టంగా మారడం, తరచూ మూత్రవిసర్జన అవసరం పడుతూ ఉండడం, అత్యవసరంగా మూత్రవిసర్జన చేయవలసి వస్తూ ఉండడం, మూత్రం పూర్తిగా బయటకు వెళ్లిపోకుండా, లోపలే మిగిలిపోతూ ఉండడడం, మూత్రంలో రక్తం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే పెద్ద వయసులో ప్రోస్టేట్‌ గ్రంథి పరిమాణం పెరగడం సహజం. కాబట్టి ఈ లక్షణాలు కనిపించినంత వాళ్లందర్లో కేన్సర్‌ ఉంటుందని భావించడానికి వీల్లేదు. అయినప్పటికీ వయసుతో సంబంధం లేకుండా ఈ లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరూ ప్రోస్టేట్‌ పరీక్షలు చేయించుకోవాలి. మరీ ముఖ్యంగా కుటుంబ చరిత్రలో ఈ కేన్సర్‌ ముప్పు ఉన్నవాళ్లు 40 ఏళ్ల నుంచీ ప్రతి ఏటా ప్రోస్టేట్‌ను పరీక్షించుకుంటూ ఉండాలి.

భిన్నమైన దశల్లో...

ప్రోస్టేట్‌ కేన్సర్‌ ఎన్నో దశల్లో బయల్పడుతూ ఉంటుంది. తొలి దశలోనే బయల్పడినప్పుడు, రోబోటిక్‌ సర్జరీ ద్వారా ప్రోస్టేట్‌ను సమూలంగా తొలగించగలిగితే కేన్సర్‌ నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ముదిరిన తర్వాత ప్రోస్టేట్‌ను తొలగించినా ప్రయోజనం ఉండదు కాబట్టి దాన్ని అలాగే వదిలేసి హార్మోన్‌ థెరపీ, కీమో, రేడియేషన్‌లను ఆశ్రయించవలసి ఉంటుంది. కేన్సర్‌ కణాలు టెస్టోస్టెరాన్‌ పురుష హార్మోన్‌ ను ఆహారంగా తీసుకుంటూ వృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి శరీరంలో ఈ హార్మోన్‌ మోతాదును తగ్గిస్తూ, అదనపు హార్మోన్లను అందిస్తూ చికిత్సను కొనసాగించాల్సి ఉంటుంది. పూర్వం ప్రోస్టేట్‌ కేన్సర్‌ సోకిన వాళ్లందరికీ ఒకే రకమైన చికిత్సా విధానాన్ని అనుసరించే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వ్యాధి తీవ్రత ఆధారంగా వైద్యులు చికిత్సను ఎంచుకుంటున్నారు. బాడీ బిల్డింగ్‌ చేసేవాళ్లు, టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ను అదనంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా అదనంగా తీసుకోవడం వల్ల ప్రోస్టేట్‌ కేన్సర్‌ సోకే అవకాశాలు ఉన్నాయని ఇప్పటివరకూ నిరూపణ కానప్పటికీ, ఈ ముప్పు పొంచి ఉన్న వాళ్లు, అప్పటికే ప్రోస్టేట్‌ కేన్సర్‌ సోకి ఉన్న వాళ్లు అదనంగా ఈ హార్మోన్‌ను తీసుకోవడం వల్ల కేన్సర్‌ ఉధృతి పెరిగిపోతుంది. కాబట్టి ఈ హార్మోన్‌ను తీసుకోవాలనుకున్న వాళ్లు ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.


నియంత్రణ ఇలా...

ప్రోస్టేట్‌ కేన్సర్‌ రాకుండా నియంత్రించడం కష్టం. కానీ దాన్ని ముందుగానే కనిపెట్టడం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ముప్పు ఉన్నప్పటికీ, లేనప్పటికీ ముందస్తుగా అప్రమత్తంగా వ్యవహరించడం అవసరం. అలాగే వీలైనంత మేరకు ఆరోగ్యకరమైన అలవాట్లతో కేన్సర్‌ సోకే అవకాశాలను తగ్గించుకోవచ్చు.

అవేంటంటే....

  • ఒమేగా3 ఫ్యాట్రీ యాసిడ్లు పుష్కలంగే ఆహారం తీసుకోవాలి

  • యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా దొరికే ఆహారం తినాలి. యాంటీఆక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్స్‌లో ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లకు కేన్సర్‌ను నిలువరించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఇవ ఎక్కువగా ఉండే, సహజసిద్ధ ముదురు రంగులను కలిగిన టమేటా, క్యారట్‌, బీట్‌రూట్‌, బ్లూబెర్రీ లాంటివి తింటూ ఉండాలి.

  • శరీర బరువును నియంత్రణలో పెట్టుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి.

  • మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌లను నియంత్రణలో పెట్టుకోవాలి.

  • క్రమం తప్పక వ్యాయామం చేయాలి.

  • కుటుంబ చరిత్రలో కేన్సర్‌ ఉంటే, 45 ఏళ్ల వయసు నుంచి, ఇతరులు 50 ఏళ్ల నుంచీ ప్రోస్టేట్‌ స్ర్కీనింగ్‌ చేయించుకోవాలి.

సమర్థమైన ఆధునిక పరీక్షలు

పిఎ్‌సఎ పరీక్ష: ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటిజెన్‌ టెస్టింగ్‌. ఇది రక్త పరీక్ష. కేన్సర్‌ ప్రోస్టేట్‌లోనే పెరగాలనే నియమం లేదు. మూత్ర ఇన్‌ఫెక్షన్లు, ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లు కూడా కేన్సర్‌కు దారి తీయవచ్చు. కాబట్టి 50 ఏళ్లు దాటిన పురుషులందరూ ఈ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. ఈ పరీక్షలో కేన్సర్‌ సోకినట్టు అనుమానం ఉంటే, ఎమ్మారై, ప్రోస్టేట్‌ బయాప్సీలతో కేన్సర్‌ను నిర్థారించుకోవచ్చు.

జీనోమిక్‌ ప్రొఫైల్‌: ఫస్ట్‌ డిగ్రీ రిలేటివ్స్‌ (తండ్రి, సోదరులు)కు ప్రోస్టేట్‌ కేన్సర్‌ ఉండి ఉంటే, జీనోమిక్‌ ప్రొఫైల్‌ చేయించుకుని కేన్సర్‌ సోకే అవకాశాలను ముందుగానే పసిగట్టవచ్చు. కాబట్టి ఈ కోవకు చెందిన వాళ్లు 40 నుంచి 45 ఏళ్ల వయసులో ఈ పరీక్ష చేయించుకోవాలి.

డాక్టర్‌ రాజేష్‌ కుమార్‌ రెడ్డి అడపాల

కన్సల్టెంట్‌ యూరో ఆంకాలజిస్ట్‌,

ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూరో ఆంకాలజీ అండ్‌

రోబోటిక్‌, ఎఐఎన్‌యు,

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - Oct 01 , 2024 | 05:47 AM