Share News

Vantillu : చపాతీలతో తింటే భలే రుచి

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:22 AM

శీతాకాలంలో వేడి వేడి చపాతీలతో రుచికరమైన కూరలు తింటుంటే ఆ తృప్తే వేరు. అందుకే ఈ సారి కొన్ని కూరలు మీకోసం అందిస్తున్నాం..

Vantillu : చపాతీలతో తింటే భలే రుచి

శీతాకాలంలో వేడి వేడి చపాతీలతో రుచికరమైన కూరలు తింటుంటే ఆ తృప్తే వేరు. అందుకే ఈ సారి కొన్ని కూరలు మీకోసం అందిస్తున్నాం..

పనీర్‌ మిరియాల కూర

కావాల్సిన పదార్థాలు:

పనీర్‌- అరకిలో, మిరియాలు- నాలుగు స్పూనులు, తరిగిన ఉల్లిపాయలు- ఒక కప్పు, జీడిపప్పు- అరకప్పు, నూనె- అరకప్పు, నెయ్యి- నాలుగు స్పూనులు, పెరుగు- ఒక కప్పు, జీలకర్ర- ఒక చెంచా, లవంగాలు- నాలుగు, పచ్చి మిర్చి- ఒకటి, ఏలకులు- నాలుగు, పసుపు- ఒక స్పూను, కారం-ఒక స్పూను, తరిగిన కొత్తిమీర- నాలుగు స్పూనులు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- ఒక స్పూను, క్రీమ్‌- నాలుగు స్పూనులు, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని

తయారీ విధానం

  • పనీర్‌ను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. మిరియాలను పొడి చేయాలి. ఈ రెండింటిని కలపాలి.

  • ఒక గిన్నెలో పెరుగు, కారం, పసుపు, ఉప్పు వేసి ఎక్కడ ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమంలో పనీర్‌ ముక్కలను వేసి 15 నిమిషాలు వదిలేయాలి.

  • ఒక మూకుడులో పావు కప్పు నూనె వేసి పనీర్‌ ముక్కలను వేయించాలి. వాటిని కిందకు దించి చల్లార్చాలి.

  • ఈ మూకుడులోనే మిగిలిన పావు కప్పు నూనెను వేడిచేసి- ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, లవంగాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, కారం, జీడిపప్పు వేసి వేయించాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సిలో వేసి ముద్దగా చేయాలి.

  • మూకుడులో నెయ్యిని వేసి వేడి చేయాలి. దీనిలో ఈ ముద్దను వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడకబెట్టాలి. ఉప్పు వేయాలి. దానిలో వేయించిన పనీర్‌ ముక్కలను వేయాలి. పైన తరిగిన కొత్తిమీర చల్లాలి. క్రీమ్‌ను కలపాలి.

జాగ్రత్తలు

  • పనీర్‌ ముక్కలను ఎక్కువ సేపు వేయించకూడదు. దోరగా వేగిన వెంటనే తీసేయాలి.

  • తాజా క్రీమ్‌ దొరకకపోతే వెన్న కూడా వేసుకోవచ్చు.

చికెన్‌ జల్‌ఫ్రిజి

కావాల్సిన పదార్థాలు:

చికెన్‌- పావుకిలో, తరిగిన ఉల్లిపాయముక్కలు- ఒక కప్పు, తరిగిన టమాటాలు- ఒక కప్పు, ధనియాలు- ఒక చెంచా, జీలకర్ర- ఒక చెంచా, మిరియాలు- ఒక చెంచా, పసుపు- ఒక చెంచా, ఎండు మిర్చి- నాలుగు, వెల్లుల్లి- నాలుగు రెబ్బలు, నూనె- కప్పు, గరం మసాలా- రెండు చెంచాలు, నిమ్మరసం- ఒక స్పూను, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని

తయారీ విధానం

  • ఒక మూకుడులో అరకప్పు నూనె వేసి ఉల్లిపాయముక్కలు, టమోటా ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, వేసి వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సిలో వేసి ముద్దగా చేయాలి.

  • మిక్సిలో ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, మిరియాలు వేసి పొడి చేయాలి.

  • చికెన్‌ ముక్కలను తీసుకొని- వాటిలో అరకప్పు నూనె, ఽమిక్సిలో ఆడిన పొడిని వేసి బాగా కలపాలి. ఈ ముక్కలు ఒక గిన్నెలో లేదా ప్లాస్టిక్‌ బౌల్‌లో వేసి మూత బెట్టి ఒక గంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి.

  • మూకుడులో మిగిలిన నూనె వేసి చికెన్‌ ముక్కలను వేయించాలి. దానిలో ముందుగా మిక్సి చేసుకున్న ముద్దను కలపాలి. కొద్దిగా నీళ్లు, ఉప్పు కలిపి ఒక పదినిమిషాల పాటు ఉడకనివ్వాలి.

జాగ్రత్తలు

  • చికెన్‌ ముక్కలను ఎంతసేపు ఫ్రిజ్‌లో ఉంచితే కూరకు అంత రుచి వస్తుంది. చికెన్‌ ముక్కలను ఎక్కువ వేయించకూడదు.

దమ్‌ ఆలూ

కావాల్సిన పదార్థాలు

చిన్న బంగాళదుంపలు- 250 గ్రాములు, నూనె- అర కప్పు, తరిగిన ఉల్లిపాయలు- ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- 2 చెంచాలు, జీలకర్ర- రెండు చెంచాలు, నల్ల మిరియాలు- ఒక చెంచా, కారం- రెండు చెంచాలు, పసుపు- ఒక చెంచా, ధనియాల పొడి- ఒక చెంచా, ఎలకులు- నాలుగు, లవంగాలు- నాలుగు దాల్చిన చెక్క- రుచికి తగినంత, జీడిపప్పు- నాలుగు స్పూన్లు, పెరుగు- ఒక కప్పు, తరిగిన కొత్తిమీర- రెండు చెంచాలు, నీళ్లు- తగినన్ని, ఉప్పు- తగినంత

తయారీ విధానం

  • ఒక మూకుడులో ఒక అరకప్పు నూనె వేసి వేడి చేయాలి. చిన్న బంగాళ దుంపల తొక్క తీసి వాటిని వేయించాలి. వాటిని చల్లార్చటానికి ఒక ప్లేటులో పెట్టుకోవాలి.

  • మిగిలిన నూనెలో ఏలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి బాగా వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సిలో ముద్దగా చేయాలి.

  • ఆ ముద్దను మిక్సిలో వేసి తగినన్ని నీళ్లు కలపాలి. దానిలో పసుపు, కారం, ధనియాల పొడి, పెరుగు వేసి మరింత సేపు ఉడికించాలి.

  • ఈ మిశ్రమంలో వేయించి పెట్టుకున్న బంగాళ దుంపలను వేసి ఉడికించాలి. ముక్కలు మగ్గిన తర్వాత పైన కొత్తిమీర చల్లాలి.

జాగ్రత్తలు

  • చిన్న బంగాళదుంపలు దొరకకపోతే మామూలు బంగాళదుంపలతో ఈ కూర చేసుకోవచ్చు. కానీ పెద్ద బంగాళ దుంపలను ముక్కలుగా చేసిన తర్వాతే నూనెలో వేయించాలి.

  • పెరుగు వేసిన తర్వాత కూరను తిప్పుతూ ఉండాలి. దీనివల్ల పెరుగు విరిగిపోదు.

Updated Date - Nov 30 , 2024 | 12:22 AM